Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Inspirational Stories :

ఈమధ్య పత్రికల్లో వచ్చిన రెండు మంచి స్ఫూర్తిదాయక వార్తలివి. ఒకటి- ఎదురుగా కారులో మంటలను చూసి వేగంగా స్పందించి, కారులోని వారిని రక్షించిన డ్రైవర్. రెండు- తను చదివిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల కొత్త భవనానికి ఆరు కోట్లు విరాళమిచ్చిన రియల్ ఎస్టేట్ వ్యాపారి.

కోవిడ్ కష్టాలు, దూసుకెళ్లే పెట్రోల్ డీజిల్ రేట్లు, జల జగడాల వార్తల మధ్య ఈ రెండు వార్తలు కంటికి ఆనలేదు. చెవికి వినపడలేదు. మనసుకు ఎక్కలేదు. అయినా నానా నెగటివ్ వార్తల సంచలనాల మధ్య పరమ పాజిటివ్, మనసు పరిమళించే వార్తలకు సహజంగానే చోటు తక్కువ.

ప్రాణాలు దక్కాయి
హైదరాబాద్ పి వి ఎక్స్ ప్రెస్ వే మీద వెళుతున్న ఒక కారులో మంటలు రేగాయి. వైర్లు కాలిన వాసన రావడంతో కార్ లోని పిల్లలు కేకలు పెట్టారు. కార్ ను నడుపుతున్న మహిళ వాహనాన్ని పక్కకు ఆపారు. వెంటనే ముందు సీట్లో ఉన్న చిన్నారిని బయటకు తీసుకుంది. వెనుక సీట్లో ఇద్దరు పిల్లలు చిక్కుకుపోయారు. వెనుక రెండు తలుపులు లాక్ అయ్యాయి. పొగ కమ్ముకుని పిల్లలు ఆర్తనాదాలు పెడుతున్నారు. ఎంత ప్రయత్నించినా తలుపులు తెరుచుకోవడం లేదు. ఆమెకు దిక్కు తోచడం లేదు.

ఈలోపు ఎదురుగా వాహనంలో వెళుతున్న యువకుడు రవి మెరుపు వేగంతో స్పందించాడు. అప్పటికి పదిహేను నిముషాలుగా పోగయిన జనం సెల్ ఫోన్లలో వీడియోలు, ఫోటోలు తీస్తున్నారే కానీ- ముందుకు కదల్లేదు. పిల్లలను కాపాడే ప్రయత్నం చేయలేదు. రవి మాత్రం తన కారును పక్కన ఆపి, ఉన్న చిన్నపాటి పరికరాలు తీసుకుని, పొగలో చిక్కుకున్న కారు అద్దాలు పగలగొట్టాడు. ముందు డోర్ లాక్ ఓపెన్ చేసి, వెనుక డోర్లు తెరవగలిగాడు. పిల్లలిద్దరినీ క్షేమంగా రక్షించగలిగాడు. రెండు నిముషాలు ఆలస్యమయ్యి ఉంటే పిల్లలు ఊపిరాడక పోయేవారు. ఆ తల్లి రవిని ఆశీర్వదించింది.పోలీసులు రవిని అభినందించారు. చోద్యం చూస్తూ సెల్ ఫోన్లలో రికార్డ్ చేసుకుంటున్నవారు సిగ్గుతో తలదించుకున్నారు. నిండు నూరేళ్లు రవి చల్లగా ఉండాలి. ఇలాగే పదిమందిని రక్షించే బలం, తెగువ రవిలో పాదుకోవాలి. ఇలాంటి రవుల సమయస్ఫూర్తిని నలుగురు కూర్చుని మాట్లాడుకునే వేళ మరీ మరీ తలచుకోవాలి.

Inspirational Stories :

చదువుల ఎస్టేట్
తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి హైదరాబాద్ లో స్థిరపడ్డ రియల్ ఎస్టేట్ వ్యాపారి. కామారెడ్డి జిల్లా బీబీపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకున్నాడు. దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ పాఠశాల భవనం దయనీయంగా తయారయ్యింది. తను చదివిన పాఠశాలకు కొత్త భవనం నిర్మించి, రుణం తీర్చుకోవాలని సుభాష్ రెడ్డి ఉదారంగా ముందుకొచ్చాడు. ఆరు కోట్ల రూపాయల విరాళమిచ్చాడు. స్కూల్ బిల్డింగ్ సర్వాంగ సుందరంగా తయారయ్యింది. దాదాపు 700 మంది విద్యార్థులు చదువుతున్న పాఠశాలకు ఇన్నాళ్లకు చక్కటి భవనం ఏర్పాటయ్యింది.రవి ప్రాణ దానం చేశాడు.
సుభాష్ రెడ్డి విద్యా దానం చేశాడు.
రవిది సమయ స్ఫూర్తి, సాహసం.
సుభాష్ రెడ్డిది ఔదార్యం, ఆరాటం.
రవి సామాన్యుల్లో అసామాన్యుడు.
సుభాష్ రెడ్డి సంపన్నుల్లో అసామాన్యుడు.

రవి నిలిపిన ప్రాణాలకు ప్రతిఫలం ఇవ్వడానికి; సుభాష్ రెడ్డి వెలిగించిన విద్యా భవన దీపానికి ప్రతిఫలం ఇవ్వడానికి సాధ్యం కాదు. వారి హృదయ వైశాల్యాన్ని నిండు మనసుతో అభినందిస్తూ, ఆశీర్వదించడం మన కనీస కర్తవ్యం.

ఇవి గోరంత దీపాలే కావచ్చు. కానీ కొండంత వెలుగులు ఇచ్చేవి.

-పమిడికాల్వ మధుసూదన్

Read More: పి వి చెప్పే పాఠం

Leave a Reply

Your email address will not be published.

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com