నిఖిల్ తన కెరియర్ ను తాను మార్చుకుంటూ .. మలచుకుంటూ ఎదిగిన తీరు ఆశ్చర్యాన్ని కలిగించేదిగానే ఉంటుంది. మొదటి నుంచి కూడా తాను ఏ సినిమా చేస్తున్నా, ఆ టీమ్ తో కలిసి సినిమా విడుదలయ్యేవరకూ తనవంతు సమయాన్ని కేటాయించే హీరోగా నిఖిల్ కనిపిస్తాడు. టీమ్ తో అతను కొనసాగించే సాన్నిహిత్యమే అతని సక్సెస్ లో ప్రధానమైన పాత్రను పోషిస్తూ వచ్చిందని చెప్పచ్చు. ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఆయన 100 కోట్ల హీరోగా ఎదగడం విశేషం.
నిఖిల్ కెరియర్ ను గమనిస్తే ‘కార్తికేయ’కి ముందు .. ఆ సినిమా తరువాత అని చెప్పుకోవచ్చు. అప్పటి నుంచి కథలను ఎంచుకునే విషయంలో ఆయన కొత్తగా ఆలోచించడం కనిపిస్తుంది. ‘కార్తికేయ’ కథ అంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆలయం చుట్టూ తిరుగుతుంది. ‘కార్తికేయ 2’ శ్రీకృష్ణుడి చుట్టూ అల్లుకున్న కథ. ఇక ప్రస్తుతం ఆయన ‘స్వయంభూ’ అనే ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా దైవసంబంధమైన విషయాల చుట్టూనే తిరుగుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
నిఖిల్ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని, నిన్న ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ ను వదిలారు. ఈ పోస్టర్ లో ఆయన వారియర్ గా కనిపిస్తున్నాడు. కానీ టైటిల్ దైవసంబంధమైనదిగా అనిపిస్తోంది. ఈ సినిమాను ఐదు భాషల్లో విడుదల చేయనున్నారు. కాన్సెప్ట్ ఏమిటనేది త్వరలో తెలిసే అవకాశం ఉంది. మొత్తానికి నిఖిల్ ఎప్పటికప్పుడు తనని తాను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అదే ఆయన సక్సెస్ సీక్రెట్ అని చెప్పుకోవాలి.