తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు నేడు ఢిల్లీ లో పర్యటిస్తున్నారు. ఈ మధ్యాహ్నం బయల్దేరి వెళ్లనున్న బాబు సాయంత్రం 6 గంటలకు కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా తో భేటీ కానున్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలు, బిజెపి-తెలుగుదేశం- జనసేన పొత్తు ఉంటుందనే వార్తల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. గత మోడీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి, ఆ తర్వాత బైటకు వచ్చిన తరువాత బాబు తొలిసారి అమిత్ షా తో ముఖాముఖి సమావేశమవుతున్నారు.
గతంలో రెండు సార్లు ఢిల్లీలో జాతీయ స్థాయి సమావేశాల్లో పాల్గొన్న చంద్రబాబు… ప్రధాని మోడీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. కానీ రాజకీయ పరమైన అంశాలు వారి మీటింగ్ లో చోటు చేసుకోలేదు.
కానీ నేటి బాబు పర్యటన పూర్తిగా రాజకీయపరమైనదే నని చెప్పవచ్చు. సిఎం జగన్ ఓటమే లక్ష్యంగా, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా అవసరమైన అన్ని ప్రయత్నాలూ చేస్తామని స్పష్టం చేసిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ … ఎన్నికల్లో మూడు పార్టీలూ కలిసి పోటీ చేసేలా బిజెపి పెద్దలపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో భాగంగానే బాబు- అమిత్ భేటీ ఏర్పాటైందని తెలుస్తోంది,