నేడు తెలుగుదేశం ఐటి విభాగం ఐ-టిడిపి సమావేశంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మంత్రులపై ఘాటైన పదజాలంతో విమర్శలు చేశారు. తెల్లారి నుంచి సాయంత్రం వరకో తనను తిట్టడం తప్ప మంత్రులకు వేరే పని లేదని వ్యాఖ్యానించారు. తాను ఏం అభివృద్ధి చేశానో అందరికీ తెలుసనీ, అమరావతిని హైదరాబాద్ కు ధీటుగా అభివృద్ధి చేయాలని సంకల్పిస్తే దాన్ని నాశనం చేశారని, అయితే అమరావతి ఎక్కడికీ పోదని ఆయన స్పష్టం చేశారు.
మంత్రులపై విమర్శలు సంధిస్తూ…
- కాంట్రాక్టులు, అక్రమ మైనింగ్ చేసేవాడు మైనింగ్ మంత్రి
- పంచాయతీరాజ్ కాంట్రాక్టులు చేసేవాడు ఆ శాఖ మంత్రి
- తన ఊళ్ళో, నియోజకవర్గంలో పిల్ల కాల్వ తవ్వలేనివాడు ఇరిగేషన్ మంత్రి
- నియోజకవర్గంలో 10 ఇళ్ళు కూడా కట్టలేనివాడు హౌసింగ్ మంత్రి
- ఇండస్ట్రీస్ గురించి చెప్పమంటే కోడిగుడ్డు కథ చెప్పేవాడు పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి
- బాబాయ్ హత్య కేసునుంచి సిఎంను తప్పించడానికి పూజలు చేసేవాడు దేవాదాయ మంత్రి
- అప్పుల మంత్రి, చివరకు రైతు బజారు కూడా తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చిన ఆర్ధిక మంత్రి
- పిల్లల జీవితాలు నాశనం చేసిన వ్యక్తి విద్యా శాఖ మంత్రి
అంటూ బాబు వ్యాఖ్యలు చేశారు.
అన్ని అస్త్ర శాస్త్రాలు సిద్ధం చేసుకొని ఎన్నికలకు సిద్ధం కావాలని, సామాజిక మాధ్యమాలు వినియోగించుకొని ఈ ప్రభుత్వం చేసున్న పనులను ఎండగట్టాలని, తెలుగుదేశం పార్టీ ఇటీవల ప్రకటించిన మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్ళి మద్దతు కూడగాట్టాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారు.