నారా లోకేష్ లాగా తాము దొడ్డిదారిలో మంత్రులం కాలేదని, ప్రజల నుంచి గెలిచి వచ్చామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖా మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యానించారు. ప్రజల మనసుల్లో అభిమానం సంపాదించుకున్నాం కాబట్టే మంత్రి పదవులు వచ్చాయని… కానీ మీ కుటుంబమే దొడ్డిదారి కుటుంబం అంటూ చంద్రబాబుపై విమర్శలు చేశారు. నిన్నటి ఐ-టిడిపి సమావేశంలో మంత్రులపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై జోగి ప్రతిస్పందించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
పది ఇళ్ళు కూడా కట్టలేదంటూ తనపై సెటైర్లు విసిరిన చంద్రబాబుకు గతంలోనే తాను సవాల్ విసిరానని… తాము నిర్మించిన ఇళ్ళు చూపిస్తాం రావాలని ఛాలెంజ్ విసిరితే దానికి ముందుకు రాలేదని ఎద్దేవా చేశారు. తలకిందులుగా తపస్సు చేసినా లోకేష్ ను ప్రజల నుంచి గెలిపించడం బాబుకు సాధ్యం కాదని, ఎమ్మెల్యే అయ్యే అవకాశం లోకేష్ కు లేదన్నారు. కడపలో తనతో చర్చకు రావాలంటూ సిఎం జగన్ కు లోకేష్ విసిరిన సవాల్ పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘జగన్ తో చర్చించే స్థాయి లోకేష్ లేద’న్నారు. ఐదుకోట్ల ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న మానవతావాది జగన్ అని ప్రశంసించారు.
తాను చేసిన ఆరోపణలు నిరూపించకపోతే రాజీనామా చేస్తానంటూ లోకేష్ చెబుతున్నాడని, అసలు ఆయనకు ఏం పదవి ఉందని జోగి ప్రశ్నించారు. చంద్రబాబు ఇచ్చినవన్నీ తప్పుడు హామీలేనని, అసలు ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేసిన చరిత్ర ఆయనకు లేదని జోగి మండిపడ్డారు. సంవత్సరానికి 12 సిలిండర్లు చొప్పున ఒక్కోదానిపై 100 రూపాయలు సబ్సిడీ ఇస్తామని 2014 ఎన్నికల్లో ప్రకటించారని, ఈ లెక్కన ఐదేళ్ళల్లో ఒక్కో మహిళకూ ఆరు వేల రూపాయలు అందించాల్సి ఉంటుందని.. కానీ దీనిపై ఆ తర్వాత కనీసం మాట్లాడలేదని విమర్శించారు. అలాంటి చంద్రబాబుకు తమపై కామెంట్లు చేసే హక్క్కు లేదని జోగి రమేష్ స్పష్టం చేశారు.