తెలంగాణ ఉద్యమం నాటి పరిస్థితులు గుర్తు చేసుకుంటే ఒకనాడు చాలా కష్టాల్లో మునిగిపోయి పాలమూరు జిల్లా గంజి కేంద్రాలకు నిలయంగా ఉండేదని సిఎం కెసిఆర్ అన్నారు. మనకున్న ఆర్డీఎస్ కాల్వను మనకు కాకుండా జేసి గద్దల్లా తన్నుకుపోతే ఉద్యమంలో మొట్టమొదటి పాదయాత్ర చేపట్టింది తనే అని, జోగులాంబ తల్లికి దండం పెట్టి గద్వాల వరకు పాదయాత్ర చేపట్టాను అని కేసీఆర్ తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లాలో సోమవారం నూతన కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం మరియు బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన జోగులాంబ గద్వాల జిల్లా ప్రగతి నివేదన సభలో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
నెట్టెంపాడు, బీమా ద్వారా సాగునీరు అందుతుందని కేసీఆర్ తెలిపారు. గట్టు పునాదిరాయి వేసుకున్నాం. ఆ పనులు కూడా త్వరలోనే పూర్తవుతాయన్నారు.
కల్వకుర్తి ఎత్తిపోతల, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, బీమా అన్నింటిని పూర్తి చేసుకుని 15 నుంచి 24 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చుకుంటున్నాం. ఉచిత కరెంట్ ఇస్తున్నాం, రైతు బంధు ఇస్తున్నాం అని కేసీఆర్ వివరించారు. గద్వాలలో ఉన్నవారు ప్రాజెక్టులు పూర్తి చేయించలేదు. భయంకరమైన బాధ.. 14 రోజులకు ఒకనాడు మహబూబ్‌నగర్‌లో నీళ్లు దొరికేవి. ఇవాళ మిషన్ భగీరథ ద్వారా నీళ్లు అందిస్తున్నాం. గతంలో బతుకు లేక మనం వలసపోయాం. ఇవాళ కర్నూల్, రాయిచూర్ నుంచి మన వద్దకు వలస వస్తున్నారు. పాలమూరు జిల్లాలో అభివృద్ధి వేగంగా జరుగుతోంది. తెలంగాణ ఏర్పడితే కరెంట్ రాదు అని మాట్లాడారు. తుంగభద్ర బ్రిడ్జి దాటితే 24 గంటల కరెంట్ లేదు. ఆ విధంగా చాలా బ్రహ్మాండమైన పనులు చేసుకున్నాం అని కేసీఆర్ తెలిపారు.
జోగులాంబ గద్వాల జిల్లాపై ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. జిల్లాలోని గ్రామ పంచాయతీలకు, మండల కేంద్రాలకు, మున్సిపాలిటీలకు ప్రత్యేక నిధులు మంజూరు చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. గద్వాల జిల్లాలో 255 గ్రామ పంచాయతీలు.. 12 మండలాలు.. నాలుగు మున్సిపాలిటీలు ఉన్నాయని కేసీఆర్ తెలిపారు. ఇది వరకు ఇక్కడకు రాలేదు.. తొలిసారి వచ్చిన కాబట్టి.. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి రూ. 10 లక్షల చొప్పున ప్రత్యేక గ్రాంట్ మంజూరు చేస్తున్నాం. దాంతో బాగా చేసుకోవాలని కోరుతున్నాను. మండల కేంద్రాలను అభివృద్ధి చేయడానికి ప్రతి మండల కేంద్రానికి రూ. 15 లక్షల చొప్పున మంజూరు చేస్తున్నాను. గద్వాల మున్సిపాలిటీ చాలా పెద్ద మున్సిపాలిటీ. గద్వాల మున్సిపాలిటీ అభివృద్ధి కోసం రూ. 50 కోట్లు, మిగిలిన మూడు మున్సిపాలిటీలకు రూ. 25 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నాను. ఈ నిధులతో మున్సిపాలిటీలు బాగుపడాలి. గట్టు ఎత్తిపోతల పథకాన్ని, అలంపూర్‌లో ఆర్డీఎస్‌కు కొనసాగింపుగా ఉన్న మల్లమ్మ కుంట పథకాన్ని వీలైనంత తొందరలో పూర్తి చేస్తామని మనవి చేస్తున్నాను అని కేసీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు.