విశాఖలో ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని బిజెపి, టిడిపి డిమాండ్ చేశాయి. ఈ ఘటనపై సిబిఐ లేదా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ)తో విచారణ జరిపించారని మాజీ ఎమ్మెల్యే, బిజెపి నేత విష్ణు కుమార్ రాజు డిమాండ్ చేశారు. దీనిపై ఎన్నో అనుమానాలు వస్తున్నాయని, కిడ్నాప్ చేసేందుకు వచ్చేవారు ఎత్తుకుని వెంటనే వెళ్లిపోతారని, కానీ వారి ఇంట్లోనే రెండ్రోజుల పాటు తిష్ట వేయరని వ్యాఖ్యానించారు. దీని వెనుక పెద్ద కుట్ర కోణం ఉందని, సెటిల్మెంట్ అంశం కూడా ముడిపడి ఉందని, ఇంత ధైర్యంగా ఈ తంతు నడిపించారంటే వెనుక ఎవరో కొందరు పెద్దల హస్తం ఉండి ఉంటుందని, లేకపోతే ఇంత సాహసానికి వారు ఒడిగట్టరని విష్ణు కుమార్ రాజు అన్నారు. కడప, పులివెందుల బ్యాచ్ ల పాత్ర ఉందన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు.
విశాఖలో 60వేల కోట్ల రూపాయల భూ కుంభకోణం జరిగిందని, దీనిలో వాటాల కోసమే కిడ్నాప్ డ్రామా జరిగిందని టిడిపి ఉత్తరాంధ్ర ఇన్ ఛార్జ్ బుద్దా వెంకన్న ఆరోపించారు. దీనిపై సిబిఐ విచారణ జరిపిస్తేనే అసలైన దోషులు బైట పడతారని అన్నారు. విశాఖలో విలువైన భూములపై సిఎం జగన్, వైసీపే నేతలు కన్నేశారని అందుకే సెప్టెంబర్ నుంచి అక్కడ మకాం పెడుతున్నట్లు జగన్ చెప్పారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ విషయమై స్పందించాలని విజ్ఞప్తి చేశారు.