నారా లోకేష్ కు దమ్ముంటే నెల్లూరు సిటీలో తనపై పోటీ చేయాలని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సవాల్ విసిరారు. దొడ్డిదారిన మంత్రి అయిన లోకేష్…. తాత, తండ్రి ఇద్దరూ ముఖ్యమంత్రులుగా పనిచేసినా కనీసం ఎమ్మెల్యే గా గెలవలేకపోయారని ఎద్దేవా చేశారు. తన తండ్రి, తోబుట్టువులు లేకపోయినా కేవలం జగనన్న, నెల్లూరు ప్రజలు, వైఎస్సార్ సీపీ కార్యకర్తల ఆశీస్సులతో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా పని చేసిన తాను సిల్లీ బచ్చానా… లోకేష్ బచ్చానా అని ఎదురు దాడి చేశారు. తాను సెల్ఫ్ మెడ్ మ్యాన్ అని స్పష్టం చేశారు. తాత, తండ్రి ఇద్దరూ లేకపోతే లోకేష్ కనీసం వార్డు మెంబర్ కూడా కాలేరన్నారు. ఎలాగూ టిడిపి టిక్కెట్లు ఇచ్చేది లోకేష్ కాబట్టి నెల్లూరునుంచి ఆయనే స్వయంగా పోటీ చేయాలన్నారు. ఒకవేళ తనను అసెంబ్లీలో అడుగు పెట్టకుండా ఆపగలిగితే రాజకీయాల నుంచి వైదొలుగుతానని… ఒకవేళ తాను గెలిస్తే రాజకీయాలనుంచి లోకేష్ తప్పుకుంటారా అని ప్రశ్నించారు.
గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అత్యధికంగా 110 కోట్లు తన నియోజకవర్గంలో ఖర్చుపెట్టినా… జగన్ ఆశీస్సులతో ఎమ్మెల్యేగా గెలిచానని…. వచ్చే ఎన్నికలో కూడా దాదాపు 200 కోట్లు ఖర్చు పెట్టేందుకు వారు సిద్ధమవుతున్నారని అన్నారు. లోకేష్ అయితే రావాలని… పులకేశి, పప్పు, మాలోకం అయితే తప్పుకో అని అనిల్ సూటిగా సవాల్ చేశారు. నాయుడుపేటలో తాను వంద ఎకరాలు కొన్నట్లు చేసిన ఆరోపణను అనిల్ తీవ్రంగా ఖండించారు. దానిలో తనకు పాయింట్ జీరో వన్ పర్సెంట్ కూడా భాగం లేదన్నారు.
మొత్తం స్పీచ్ లో కనీసం 50 శాతం సక్రమంగా మాట్లాడలేని లోకేష్ వెనుక ఆ పార్టీ యంత్రాంగం నడవడం అసలైన ‘ఇదేం ఖర్మరా బాబూ’ అని అనిల్ వ్యాఖ్యానించారు. ఈ ప్రపంచంలో ఎక్కడా బయోడేటాలో భయం అనే కాలమ్ ఉండదని.. ఆ విషయం కూడా తెలియకపోవడం మన దౌర్భాగ్యమన్నారు.
జగన్ ప్రాపకం కోసం తాను పాకులాడాల్సిన అవసరం లేదని, కనీసం ఎమ్మెల్యేగా గెలవని లోకేష్ ప్రాపకం కోసం ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆనం రామనారాయణరెడ్డి పాకులాడుతున్నారని దుయ్యబట్టారు. 80 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ అనుభం ఉన్న ఆనం కుటుంబానికి ఈ గతి పట్టినందుకు బాధగా ఉందన్నారు.