Saturday, November 23, 2024
HomeTrending NewsTDP: అమలు చేసింది 25 శాతమే: అచ్చెన్నాయుడు

TDP: అమలు చేసింది 25 శాతమే: అచ్చెన్నాయుడు

వైసీపీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో  కనీసం 10 శాతం కూడా అమలు చేయలేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. జగన్ ఇచ్చిన హామీల్లో ఒకే ఒకటి సంపూర్ణంగా చేశారని అది పెన్షన్ వయసును 65 నుంచి 60 తగ్గిస్తూ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 650 హామీలు ప్రజలకు ఇచ్చారని, చివరకు ప్రజలను మైమరపించి  నవ రత్నాలు పేరుతో మేనిఫెస్టో ఇచ్చారని, దానికి బైబిల్ అంటూ కూడా చెప్పారని గుర్తు చేశారు. ఈ తొమ్మిది హామీల్లో నలభై అంశాలు పొందుపరిచారని చెప్పారు. వీటిలో 25 శాతం మాత్రమే పూర్తి చేశారని కానీ, సిఎం మంత్రులు, 99శాతం పూర్తి చేశామని చెప్పుకోవడానికి సిగ్గుండాలని ఘాటుగా వ్యాఖ్యానించారు.  నిబంధనల పేరుతో పథకాల్లో కోత విధిస్తున్నారని విమర్శించారు.  మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ‘జగన్ నవరత్నాల వాస్తవాలు’ పేరిట ఓ పత్రాన్ని విడుదల చేశారు.

  • రైతు రుణమాఫీ  పూర్తి చేయలేదని, పెట్టుబడి సాయం కింద ఏటా 12,500 ఇస్తామని చెప్పి 7,500 మాత్రమే ఇచ్చారని,
  • వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ వర్తింప జేస్తామని చెప్పి విస్మరించారని
  • అమ్మ ఒడి పథకంలో ఇచ్చేది తక్కువ ప్రచారం ఎక్కువ చేస్తూ ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని
  • పెన్షన్ ను మూడు వేలకు పెంచుతానని హామీ ఇచ్చి నాలుగేళ్ల తరువాత 750 రూపాయలు పెంచారని, తమ హయాంలో 74 లక్షల మందికి పెన్షన్లు ఇస్తే  ఇప్పుడు 62 లక్షల మందికే ఇస్తున్నారని….
  • సంవత్సరానికి ఐదు లక్షల ఇళ్ళు కట్టిస్తానని హామీ ఇచ్చి నాలుగేళ్ల ఒక నెల హయంలో 865 ఇళ్ళు కట్టారని, ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్ లో చెప్పిందని
  • 16 లక్షల మంది విద్యార్థుల్లో కేవలం 10 లక్షల మందికే ఫీజు రీఇంబర్స్ మెంట్ ఇస్తున్నారని  అచ్చెన్నాయుడు వివరించారు.

ఇరిగేషన్ రంగాన్ని నిర్లక్ష్యం చేశారని, పోలవరం ప్రాజెక్టును కనీసం ఒక్క శాతం కూడా అదనంగా పూర్తి చేయలేదని… మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పి హామీ ఇచ్చి ఇప్పుడు ఏటా 26 వేల కోట్లు మద్యం ద్వారా ఆదాయం సంపాదిస్తున్నారని దుయ్యబట్టారు. జగన్ అబద్ధాలు చెబుతున్నారని, హామీల అమలుపై చర్చకు సిద్ధంగా ఉన్నామని సవాల్ చేశారు.

భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో తాము ఇచ్చిన హామీలన్నీ అధికారంలోకి రాగానే అమలు చేసి తీరుతామని అచ్చెన్న స్పష్టం చేశారు. ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్, ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు, మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పార్టీ నేతలు వర్ల రామయ్య, బొండా ఉమా తదితరులు ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్