టాలీవుడ్ దర్శకులలో క్రిష్ కి ప్రత్యేకమైన స్థానం ఉంది. అటు సందేశాత్మక చిత్రాలను .. ఇటు చారిత్రక చిత్రాలను ఆయన చాలా సమర్థవంతంగా తెరకెక్కించగలడు. చాలా తక్కువ బడ్జెట్ లో మంచి అవుట్ పుట్ ను తీసుకురాగల దర్శకుడిగా ఆయనకి పేరుంది. ‘గమ్యం’ .. ‘వేదం’ .. ‘కంచె’ వంటి సున్నితమైన ఎమోషన్స్ తో ఆడియన్స్ ను మెప్పించిన ఘనత ఆయన ఖాతాలో ఉంది. ‘మణికర్ణిక’ .. ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ వంటి భారీ చారిత్రక చిత్రాలకు పనిచేసిన అనుభవం ఆయన సొంతం.
అలాంటి క్రిష్ ‘హరి హర వీరమల్లు’ ప్రాజెక్టును భుజాలకెత్తుకున్నాడు. ఎ.ఎం. రత్నం ఈ సినిమాకి నిర్మాత. పవన్ కల్యాణ్ కి హీరోగా ఇది తొలి చారిత్రక చిత్రం. భారీ సెట్స్ తో .. భారీ ఖర్చుతో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకుని వెళ్లారు. 50 శాతం వరకూ చిత్రీకరణ సాఫీగానే సాగింది. ఆ తరువాత నుంచి షూటింగు విషయంలో జాప్యం జరుగుతోంది. కొన్ని రోజులు షూటింగ్ చేస్తే, చాలా రోజుల పాటు మళ్లీ ఎలాంటి అప్ డేట్ ఉండటం లేదు. పోనీ పవన్ బిజీగా ఉండటమే దీనికి కారణమా? అనుకుందామా అంటే, ఆయన మిగతా సినిమాల సెట్స్ పై కనిపిస్తూనే ఉన్నారు.
గతంలో ఒకసారి ‘వీరమల్లు’ షెడ్యూల్ కి గ్యాప్ వస్తేనే, ఆ గ్యాప్ లో క్రిష్ ‘కొండపొలం’ అనే సినిమాను అలా సెట్స్ పైకి తీసుకెళ్లి, ఇలా థియేటర్స్ కి తీసుకొచ్చాడు. ఆ సినిమా సరిగ్గా ఆడలేదనుకోండి .. అది వేరే విషయం. అలా సమయాన్ని వృథా చేయకుండా ప్రాజెక్టులను ప్లాన్ చేసుకునే క్రిష్, ‘వీరమల్లు’ను గురించి తప్ప, మరో ప్రాజెక్టును గురించిన ఆలోచన చేస్తున్నట్టుగా కనిపించడం లేదు. మొత్తానికి ‘వీరమల్లు’ విషయంలో ఆయన లాకైపోయినట్టుగా అనిపిస్తోంది. ఆయన ఇబ్బందిపడుతున్నాడనే టాక్ వినిపిస్తోంది.