ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో తన బంధం బలమైనదని, రాజకీయాలకు అతీతమైనదని, అది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కు ఉపయోగపడాలన్నదే తన ఉద్దేశమని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ‘జగన్ పోవడం – ఎన్డీయే అధికారంలోకి రావడం’ అనే అంశంపై స్పష్టమైన వైఖరితో సంసిద్ధంగా ఉన్నామని తేల్చి చెప్పారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని, బిజెపి కేంద్ర నాయకులతో సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయని, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో కూడా కీలక విషయాలు చర్చించామని, రాష్ట్రానికి పటిష్టమైన భవిష్యత్ ఇవ్వాలని కోరామని, దీనికి సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు త్వరలోనే వెలువడతాయని పవన్ ప్రకటించారు. ఏపీ అభివృద్దే తన కమిట్ మెంట్ అని స్పష్టం చేశారు. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన విశాఖ జిల్లా నేత పంచకర్ల రమేష్ బాబు మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పవన్ ప్రసంగించారు. పదేళ్ళ కాలంలో తాను ఒక్కసారి కూడా ప్రధాని అపాయింట్ మెంట్ అడగలేదని, తన అవసరం ఉంటే వారే పిలుస్తారని, అందుకే విశాఖకు మోడీ వచ్చినప్పుడు వారి ఆహ్వానం మేరకు వెళ్లి కలిశానని వివరించారు. మోడీ తనను ఏదో తిట్టారని వార్తలు వచ్చినా వాటిపై తాను స్పందించలేదన్నారు.
వాలంటీర్ల వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి తనను ప్రాసిక్యూషన్ చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై కూడా పవన్ స్పందించారు. జగన్ ప్రభుత్వాన్ని కిందకు లాగే అంశం ఇదే అవుతుందని, మైనింగ్ అక్రమాల నుంచి అన్నింటినీ బైటకు తీస్తామని, ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. క్రూడ్ ఆయిల్ ఎంత విలువైనదో డేటా కూడా అంతే విలువైనదని అన్నారు. ఈ ప్రభుత్వం చేసే ప్రాసిక్యూషన్ లకు తాను భయపడేవాడిని కాదని, దెబ్బలు తినడానికైనా, జైలుకు వెళ్లడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.
వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రభుత్వం డేటా చోరీకి పాల్పడుతోందని, 23 అంశాలకు సంబంధించిన సమాచారం సేకరిస్తోందని, ఈ డేటా ఎక్కడికి వెళ్లిందని ప్రశ్నించారు. చేయకూడని డేటాను కూడా సేకరిస్తున్నారని, ఇది కచ్చితంగా చౌర్యం కిందకే వస్తుందని చెప్పారు. తన ప్రాసిక్యూషన్ పై పోరాటం చేసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల జన సేన కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపు ఇచ్చారు.