మేనమామ-మేనల్లుడు ద్వయం పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ మొదటిసారి కలిసి నటించిన చిత్రం ‘బ్రో’. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై జీ స్టూడియోస్ తో కలిసి టి.జి. విశ్వప్రసాద్ నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి పి. సముద్రఖని దర్శకత్వం వహించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన ఈ సినిమాకి ఎస్. థమన్ సంగీతం సమకూర్చారు. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ కథానాయికలుగా నటించారు. జూలై 28న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
హాస్యబ్రహ్మ బ్రహ్మానందం మాట్లాడుతూ.. “ఈ సినిమాలో నేనొక పాత్ర చేశాను. పవన్ కళ్యాణ్ గారితో కలిసి నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. 18-20 సంవత్సరాల వయసు నుంచే నేను ఆయనను చూస్తున్నాను. ఆయన నవ్వు ఎంత స్వచ్ఛంగా, ఎంత అందంగా ఉంటుందో.. ఆయన కూడా అంతే అందమైన మనిషి. సరదాగా నవ్విస్తూ ఉంటారు. మనిషి అంతా మంచితనం, మనిషి అంతా హాస్యం. ఏ రకంగా ఆయన దగ్గరకు వెళ్తే ఆ రకంగా దర్శనం ఇవ్వగల దైవాంశసంభూతుడు మా పవన్ కళ్యాణ్. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిర్మాత విశ్వప్రసాద్ గారు పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ సినిమాలు తీస్తాను అన్నారు. ఇంతటి గట్స్ ఉన్న నిర్మాత విశ్వప్రసాద్ గారి ఆల్ ది బెస్ట్” అన్నారు.