Saturday, November 23, 2024
HomeTrending NewsBhim Army: దళితుల కోసం... పథకాలు భేష్ - చంద్ర శేఖర్ ఆజాద్

Bhim Army: దళితుల కోసం… పథకాలు భేష్ – చంద్ర శేఖర్ ఆజాద్

దళితుల అభ్యున్నతి, సంక్షేమం కోసం రాష్ట్రంలో అమలవుతున్న దళితబంధు సహా పలు పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ప్రశంసించారు. ఎస్సీ కులాలను సామాజిక, ఆర్థిక వివక్ష నుండి ఆత్మ గౌరవం దిశగా సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పతకాలు ఉపయోగపడతాయాన్నారు.  ఇది యావత్ దళిత జాతి గర్వించదగ్గ సందర్భమని భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ తెలిపారు.

హైదరాబాద్ పర్యటన సందర్బంగా శుక్రవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు తో చంద్ర శేఖర్ ఆజాద్ మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సాగిన సుధీర్ఘ చర్చలో దేశంలో దళితుల పరిస్థితి, దళితుల పట్ల పాలకులు అనుసరిస్తున్న వైఖరులు, కులం పేరుతో మనుషులను విభజిస్తూ, సామాజిక వివక్షకు గురిచేస్తూ, ఆహార నియమాలను నియంత్రిస్తూ, దళితుల పై దేశంలో అమలవుతున్న దమనకాండను ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ తో ఆజాద్’ చర్చించారు.

చర్చ సందర్భంగా చంద్రశేఖర్ ఆజాద్ మాట్లాడుతూ …. తెలంగాణలో అమలవుతున్న దళిత అభివృద్ధి కార్యాచరణ భవిష్యత్ లో దేశంలోని దళితుల సమస్యల పరిష్కారానికి బాటలు వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దళితబంధు పథకం దేశ చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో అమలవుతున్న పథకమని స్పష్టం చేశారు. దళితబంధు విజయగాథలను తాను తెలుసుకున్నానని, వారి జీవితాల్లో గుణాత్మక మార్పు ప్రారంభమైందని, ఇది ఎంతో గొప్ప విషయమని ఆజాద్ అన్నారు. అట్టడుగు స్థాయిలో పనిచేసే దళితుల సాధికారతకు తోడ్పడుతూ, వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతున్న దళితబంధు పథకం అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కొనసాగుతున్నదన్నారు.

 

ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ నడిగడ్డ పై 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించడం సీఎం కేసీఆర్ గారికి అంబేద్కర్ పట్ల ఉన్న అభిమానానికి, వారి ఆశయాల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలిచిందన్నారు. అదే సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డా. బిఆర్ అంబేద్కర్ పేరుతో సచివాలయాన్ని నిర్మించడం దేశ చరిత్రలోనే మొట్టమొదటిదన్నారు.

రాష్ట్రంలో అమలవుతున్నంత గొప్పగా గురుకుల విద్య దేశంలో మరెక్కడా అమలు కావట్లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ బిడ్డలను ప్రతిభావంతులుగా తీర్చిదిద్ది ప్రపంచానికి అందించే మహోన్నత లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న వందలాది గురుకులాలు ప్రపంచ జ్నాన కేంద్రాలుగా పనిచేస్తున్నాయన్నారు.

 

మహాసభలకు ఆహ్వానం:

రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ లో ఆగష్టు 26 న జరిగే భీమ్ ఆర్మీ మహాసభలకు ముఖ్య అతిథిగా రావాల్సిందిగా సీఎం కేసీఆర్ ను చంద్రశేఖర్ ఆజాద్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రులు హరీష్ రావు, జి. జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు గ్యాదరి కిషోర్, చిరుమర్తి లింగయ్య, తెలంగాణ ఫుడ్స్ కార్పోరేషన్ ఛైర్మన్ రాజీవ్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్