ప్రసాదరావు గారు (మదనపల్లి) వాట్సప్ లో ఓ రెండు నిముషాల వీడియో ఒకటి పంపారు. అది ఓ తమిళ పాట. సుప్రసిద్ధ గాయకులు పి. బి. శ్రీనివాస్ గారి సుపుత్రులు ఫణీందర్ పాడిన పాట. అది వాళ్ళ నాన్నగారు “సుమైతాంగి” (1962) అనే సినిమా కోసం పాడిన పాట. మనసుకి ఊతమిచ్చే పాట. “మయక్కమా కలక్కమా…” అంటూ తమిళ కవిచక్రవర్తి కణ్ణదాసన్ రాసిన పాట. ఈ పాటతోనే కణ్ణదాసన్ సమకాలిక కవి వాలికి మనోధైర్యాన్నిచ్చిన పాట. సినిమాలలో అవకాశం కోసం వచ్చి లాభం లేదనుకుని తిరిగి శ్రీరంగానికి వెళ్ళిపోవడానికి టిక్కెట్ కూడా కొనేసుకున్నారు వాలి. టీ. నగర్లో ఓ గదిలో నటులు నాగేష్, శ్రీకాంత్ లతో ఉంటున్న రోజులవి.
అయితే ఈ పాట విన్న తర్వాత మనసు మార్చుకున్న వాలిని పి.బి. శ్రీనివాస్ గారు సంగీత దర్శకుడు ఎం. ఎస్. విశ్వనాధన్ దగ్గరకు తీసుకువెళ్ళి పరిచయం చేయడం, అనంతరం వేలాది పాటలు రాసి గీత రచయితగా నిలదొక్కుకుని ఎనలేని పేరుప్రఖ్యాతులు గడించారు వాలి. ఈ విషయాన్ని వాలి స్వయంగా ఓసారి రాయడమే కాక ఆయన నోటంట విన్నానెప్పుడో. అయినా ఈ విషయాన్ని మరొక్కసారి నిర్థారించుకోవడం కోసం ముషీరాబాద్ క్రాస్ రోడ్డు దగ్గర్లో నివాసముంటున్న కంచర్ల టవర్స్ (హైదరాబాద్) నెంబర్ 501లో నివాసముంటున్న ఫణీందర్ గారింటికి వెళ్ళాను.
సాదరంగా ఆహ్వానించి మళ్ళీ నన్ను వారింటి గేటు వరకూ వచ్చి సాగనంపిన ఫణీందర్ గారింట ఓ మూడున్నర గంటలపాటు గడిపాను. వృత్తిపరంగా ఆడిటర్ అయిన ఫణీందర్ ఈ నెల 22వ తేదీన త్యాగరాయగానసభలో నిర్వహించిన పి.బి. శ్రీనివాస్ గారి 92వ జయంతి కార్యక్రమంలో కొన్ని పాటలు పాడారు. వాటి నేపథ్యంతో పాటు కొన్ని విషయాలు చెప్తుంటే మురళీధర్ గారు వచ్చారు. అడ్వొకేట్ అయిన మురళీధర్ సప్తస్వరమాలిక సాంస్కృతిక సంస్థ అధ్యక్షులు. ఈయన శ్రీనివాస్ గారికి ఏకలవ్యశిష్యుడు. 1965లో ప్రేమించిచూడు సినిమాలో ఓ పాట విని తానూ పాడాలనుకుని అందుకు కృషి చేసిన తీరుని ఆయన వివరించారు. పిఠాపురానికి చెందిన మురళీధర్ గారు బి.ఎస్సీ తర్వాత ఏలూరులో బి.ఎల్. చదివారు.
మురళీధర్ – ఫణీందర్ గారి మధ్య ముచ్చట్లు, మధ్య మధ్య పి.బి. శ్రీనివాస్ గారి పాటలు పాడటం, వాటి నేపథ్యం వింటూ నేను ప్రేక్షకపాత్ర పోషించాను. ఒకటా రెండా లెక్కపెట్టలేదు కానీ బోలెడు పాటలు పాడారు. రాముడి మీద ఓ పాటను ఫణిందర్ గారి శ్రీమతి కోరికతో మురళీధర్ గారు లేచి నిల్చుని పాడటం, ఆయనతో కలిసి ఫణీందర్ గారు నిలబడి పాటందుకోవడం, దానిని ఫోన్లో రికార్డు చేయడం జరిగిపోయాయి.
పి. బి. శ్రీనివాస్ గారు తమిళంలో పాడి తెలుగులో డబ్ కాని పాటలను రాజశ్రీ సుధాకర్ గారితో రాయించీ పాడాలనుందని మురళీధర్ గారు చెప్పిన వెంటనే ఫణీందర్ గారు మద్రాసువాసి సుధాకర్ తో ఫోన్లో మాట్లాడారు. ఓ రెండు నిముషాలపాటు నేనూ రాజశ్రీ సుధాకరుతో మాట్లాడాను. మద్రాసులో నేనున్న రోజుల్లో ఓ తమిళ సీరియల్ డబ్ చేసే అవకాశాన్నిచ్చారు కానీ అది నేను అందిపుచ్చుకోలేకపోయాను. అందుకు కారణం లేకపోలేదు. తమిళ రాతప్రతి ఇచ్చే పక్షంలో దానిని తెలుగులోకి అనువదిద్దామనుకున్నాను. కానీ క్యాసెట్ ఇచ్చారు. అది విని తెలుగులో రాయాలి. కానీ నాదగ్గర టేప్ రికార్డరు లేకపోవడంతో ఆ క్యాసెట్ తిరిగిచ్చేయడానికి సుధాకర్ గారింటికి వెళ్ళానప్పట్లో.
ముప్పై ఏళ్ళ క్రితమే హైదరాబాదుకొచ్చి స్థిరపడిన ఫణిందర్ గారు తన తండ్రిగారి విషయాలు చెప్తూ మద్రాస్ ఉడ్ ల్యాండ్ హోటల్లో (శ్రీనివాస్ గారికోసం ఈ హోటల్లో ఎప్పుడూ ఓ సీట్ ఉండేది. ఆయన అక్కడకెళ్ళి రాసుకోవడం, మిత్రులెవరైనా కలిస్తే కబుర్లు చెప్పడం చేసేవారు) ఓ మారు శ్రీనివాస్ గారు ఓ పాట రాస్తుండగా బెంగుళూరుకు చెందిన ఓ అభిమాని ఆయన ముందు నిల్చున్నారు. రాస్తున్న పాట మధ్యలో ఓసారి శ్రీనివాస్ గారు తల పైకెత్తారు కానీ అభిమానిని గమనించలేదు. మళ్ళీ ఆయన పాట రాయడంలో ఉండిపోయారు. ఆయన పాట పూర్తి చేసేంత వరకూ అక్కడే నిరీక్షించిన ఆ అభిమాని శ్రీనివాస్ గారికి నమస్కరించి తనను పరిచయం చేసుకుని వెళ్ళిన విషయాన్ని ఫణీందర్ గారు గుర్తు చేసుకున్నారు.
కన్నడంలో రాజ్యమేలి విశేష ఆదరభిమానాలు సంపాదించిన శ్రీనివాస్ గారు మా నాన్నగారైన యామిజాల పద్మనాభస్వామిగారి వద్దకు వచ్చిపోతుండేవారు. అప్పుడే ఆయనతో నా పరిచయం. ఒకటి రెండుసార్లయితే ఆయనతో పాటలు పాడించుకున్నాంకూడా.
ఇంతలో ఫణిందర్ గారి పక్కింట్లో ఉంటున్న సోముగారు మా ముచ్చట్లలో కలిసారు. ఈయన సిరిధాన్యాల మనిషి. ఆయన ఆరేళ్ళ కుమార్తె ఓ పాట వినిపించగా చిరుకాన్కతో ఆశీర్వదిస్తూ తాము నిర్వహించే కార్యక్రమంలో ప్రార్థనా గీతం ఆలపించే అవకాశమిస్తానని మాటిచ్చారు మురళీధర్ గారు.
అద్వైతం, విశిష్టాద్వైతం గురించి చెప్తూ పరమాత్మ, జీవాత్మలగురించి ప్రస్తావించిన ఫణీందర్ గారు చెప్పిన విషయం నన్నెంతో ఆకట్టుకుంది. పరమాత్మ బెల్లంలాంటి వారైతే మనం బెల్లాన్ని రుచి చూసే చీమల్లాటి జీవాత్మలమని అన్నారు. ఈ సందర్భంలోనే కణ్ణదాసన్ రాసిన ఓ పాటను గుర్తు చేశారు. అలాగే శివాజీగణేశన్ నటించిన తిరువరూట్ సెల్వర్ (1967) సినిమాలో రాజు ఎలా సన్న్యసించారో ఉదహరించారు.
ఫణీందర్ గారి కుమారుడు ఆనందవర్థన్ వెండితెరనటుడు. బాలనటుడిగా మన్ననలందుకున్నారు.
– యామిజాల జగదీశ్