Luxury Peaks: కథలన్నీ ఎన్ని మలుపులు తిరిగినా…చివరికి కంచికే చేరాలి. అలా వ్యాసాలన్నీ ఎన్ని విషయాలను తడిమినా…చివరికి ఆవునే చేరాలి. ఆవు వ్యాసం సకల వ్యాసాలకు స్ఫూర్తి.
ఒకప్పుడు ఆవు వ్యాసానికే పరిమితమై ఉండేది. ఇప్పుడు ఆ ఆవు మిగతా అన్ని సృజనాత్మక రచనల్లోకి కూడా వచ్చి కూర్చుంది.
అడుగడుగునా అన్ని రాతల్లో ఆవులే ఉంటాయి. ఎంత ఎగతాళిగా అనిపించినా…ఆవు వ్యాసం ఒక కాదనలేని నిజం. నిజమెప్పుడూ నిష్ఠురంగానే ఉంటుంది
ఉదాహరణ కావాలంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ అత్యంత విలాసమయిన ఆకాశ హర్మ్యం అపార్ట్ మెంట్ ప్రాజెక్టుకు ఇచ్చిన ప్రకటన చూడండి. నింగిని తాకే అపార్ట్ మెంట్లలో ఒక్కో ఇంటి సైజ్ ఎనిమిది నుండి పదమూడు వేల అడుగుల ఎస్ ఎఫ్ టీ అట. జూబ్లీ హిల్స్ లో కట్టబోయే ఈ అపార్ట్ మెంట్లో ఉండాలనుకున్నవారు పన్నెండు నుండి ఇరవై కోట్ల వరకు ఖర్చు పెడితే- చాలు. పిండీ కొద్దీ రొట్టె. డబ్బు కొద్దీ ఇల్లు.
ఎకనమిక్ టైమ్స్ పేపర్ మొదటి, రెండో పేజీల నిండా ఈ అల్ట్రా లగ్జరీ ఇళ్ల ప్రకటన మహిళా దినోత్సవానికి ముడిపడి ఉండేసరికి ఆసక్తిగా చూశా. బహుశా సంపన్న మహిళలలెవరయినా మహిళా దినోత్సవం రోజు తమ పేరుతో ఈ ఇల్లు కొంటే…కొంత డిస్కౌంట్ ఇస్తారేమో! అనుకున్నా. ఉన్నవారయినా, లేనివారయినా…ఎవరయినా మహిళలే.
తీరా… ప్రకటన అంతా చదివాక…ప్రకటనను ఎలా అర్థం చేసుకోవాలో తెలియక అయోమయంలో పడ్డా. ఇంతకూ ఈ ప్రకటన-
1. మహిళలను గౌరవిస్తోందా?
2. పురుషులను అవమానిస్తోందా?
3. మహిళకు- విలాసవంతమయిన అపార్ట్ మెంట్ కు లంకె ఏమిటి?
4. “వనితల్లారా! మీలాగా ఈ ఇల్లు చాలా ప్రత్యేకమై…మీకు స్వాగతం పలుకుతోంది…” అంటే ఆ ఇంటి కప్పు కింద ఉండబోయే మగవారి మనోభావాల సంగతి?
5. “మేము కట్టబోయే ఈ ఇళ్లు…దైవస్వరూపాలైన సకల స్త్రీ మూర్తులకు నివాళి” అనే అర్థం కాకుండా ఇక్కడున్న టెక్స్ట్ కు ఇంకేదయినా అర్థం ఉంటే…కనుక్కునేదెలా?
అయినా…
ఇదేమీ ప్రభుత్వం పేదలకు ఉచితంగా కట్టించే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాదు గదా!
అత్యంత సంపన్నులకు…అందులోనూ ప్రత్యేకించి బాగా డబ్బు చేసిన మహిళకు మాత్రమే కేటాయించిన ప్రకటన. దైవస్వరూపాలైన వారికి అర్థమయితే చాలు.
మనకెందుకు?
“సకల స్త్రీ మూర్తులు” ఈ బ్యూటిఫుల్ పై కప్పు కిందే ఉంటూ వారు చెబుతున్నట్లు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనుకోవాలంటే… సకల పురుష మూర్తులు ఏమవుతారో?
-పమిడికాల్వ మధుసూదన్
[email protected]
Also Read :