Sunday, January 19, 2025
HomeTrending NewsHail Storm; వానా కాలం పంట ఒక నెల ముందుకు - మంత్రి హరీష్

Hail Storm; వానా కాలం పంట ఒక నెల ముందుకు – మంత్రి హరీష్

రైతులు ఆత్మ విశ్వాసం కోల్పోవద్దని రైతుల పక్షపాతి అయిన నాయకుడు కేసీఆర్ ఉన్నారని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. కాబట్టి ఎవరూ కూడా ఆత్మ విశ్వాసం కోల్పోవద్దని వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను కోరారు. నోటికాడి బుక్క జారిపోయిందని ఎంతో బాధతో ఉన్న రైతులను ఓదార్చడానికి గ్రామాలలో పర్యటించి రైతులకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే వడగండ్ల వాన పడ్డ ప్రాంతాల్లో మొదటి దశలో పర్యటించి దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు ప్రతీ ఎకరానికి రూ.10 వేలు ఆర్థిక సాయం అందిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారని మంత్రి వెల్లడించారు. జిల్లాలోని సిద్ధిపేట అర్బన్ మండలం, దుబ్బాక, తొగుట మండలాల్లో రాత్రి కురిసిన అకాల వడగండ్ల వానతో ఎంతో పంట నష్టం వాటిల్లిన ప్రాంతాలలో పర్యటిస్తూ.. రైతులను ఓదార్చారు. సిద్ధిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, వ్యవసాయ శాఖ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

గ్రామాలలో నష్టపోయిన ఏ ఒక్కరైతు మిస్ కాకుండా వ్యవసాయ, రెవెన్యూశాఖ అధికారులు ఫీల్డ్ లో పర్యటించి వివరాలన్నీ ప్రభుత్వానికి వెంటనే పంపాలని మంత్రి ఆదేశించారు. వాస్తవానికి యాసంగిలో ఎంతో నాణ్యమైన కరెంటు కోసం ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేసి, ప్రయివేటు ఎక్చేంజ్ లో కొని రైతులకు ఉచితంగా నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేసింది. కానీ దురదృష్టం రైతుబంధు ఇచ్చి, నాణ్యమైన కరెంటు ఇచ్చి నోటి కాడికి వచ్చిన బుక్క జారిపోయినట్లు ఈ ప్రకృతి వైపరీత్యం వడగండ్ల వాన రూపంలో చాలా నష్టం జరిగిందని తెలిపారు.

సిద్ధిపేట జిల్లాలోనే ఇప్పటికే 35 వేల ఎకరాల పంట నష్టం జరిగినట్లు వివరాలు వచ్చాయి. నిన్నరాత్రి జరిగిన ప్రకృతి వైపరీత్యంలో ఎంత నష్టం జరిగిందనే వివరాలు సాయంత్రం వరకు తెలుస్తాయన్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ కి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని, ఈ దరిమిలా అన్ని జిల్లాల్లో మంత్రులు వడగండ్ల వాన పడ్డ ప్రాంతాల్లో పర్యటించి ప్రభుత్వం పక్షాన రైతులకు ధైర్యం కల్పించే ప్రయత్నం చేస్తున్నదన్నారు.

రైతులు అధైర్యపడొద్దు. ప్రభుత్వం అండగా ఉంటుంది. డిసెంబరు నెలలో రైతులు వరినాట్లు వేసిన దరిమిలా శ్రీరామ నవమి పండుగలోపు చాలా చోట్ల పంట కోతలు పూర్తయ్యాయన్నారు. భవిష్యత్తులో నెలముందే పంట కోత తెచ్చుకోగలిగితే ఈ ప్రకృతి వైపరీత్యం నుంచి తప్పించుకునే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. వానా కాలం పంట ఒక నెల ముందు జరుపుకుంటే ఈ ప్రకృతి వైపరీత్యం వల్ల నష్టపోకుండా ఉంటామని రైతులకు మంత్రి హితవు పలికారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్