Silly Idea: “శివారెడ్డిని చంపితే నువ్ జైలు కెళతావు కానీ…ముఖ్యమంత్రి ఎలా అవుతావు? చిన్న లాజిక్ మిస్సయ్యావు!”
అని అతడు సినిమాలో త్రివిక్రమ్ మార్క్ డైలాగ్ ఏదో ఉంది.

“నిజం చెప్పే ధైర్యం లేని వాడికి అబద్ధం చెప్పే హక్కు లేదు. 
నిజం చెప్పకపోవటం అబద్ధం….అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం”  లాంటి మాటలతో ఒకప్పుడు త్రివిక్రమ్ నిజంగానే మాటల మాంత్రికుడు అన్న ప్రశంసకు అర్హుడిగా వెలిగాడు. ఇంగ్లీషు సినిమాల్లో, తెలుగు నవలల్లో దేనికి ఏది త్రివిక్రమ్ కాపీ అని సోషల్ మీడియాలో జరిగే చర్చను పట్టించుకోవాల్సిన పని లేదు. నెమ్మదిగా మాటల మాంత్రికుడు కాస్త సగటు తెలుగు దర్శకుడిలా హీరో ఆరాధన వైపు మళ్లడంతో ఆయన మాటల్లో మంత్రస్థాయి పోయిందనే విమర్శను కూడా పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు.

“అప్పాలా! చెప్పాలా!” లాంటి టేక్ హోమ్ పంచ్ డైలాగుల కోసమే రాసే ప్రాసలు కొంతకాలానికి కృతకంగా తయారై చెవి దాకా కూడా చేరవని త్రివిక్రమ్ కు తెలియక కాదు. ఆ చర్చ ఇక్కడ అనవసరం.

త్రివిక్రమ్ అన్నట్లు-
అమెరికా అధ్యక్షుడిని చంపితే జైలు కెళతాడు కానీ అమెరికా అధ్యక్షుడు ఎలా అవుతాడు? చిన్న లాజిక్ మిస్సయ్యాడు తెలుగు సంతతి యువకుడు కందుల సాయి వర్షిత్. అతడి మానసిక స్థితి ఎలా ఉందో కానీ…ఒక ట్రక్కు తీసుకుని అమెరికా అధ్యక్షుడి వైట్ హౌస్ లోకి చొరబడి…అధ్యక్షుడు బైడెన్ ను హత్య చేయాలనుకున్నాడు. మొదటి కంచె దగ్గర బ్యారికేడ్లకు డ్యాష్ ఇవ్వగానే పోలీసులు పట్టుకుని…అరెస్ట్ చేసి జైల్లో పడేశారు. విచారణ తరువాత కఠినాతి కఠినమయిన శిక్ష పడవచ్చు. లేక భారత్ లో ఉన్నట్లు తుపాకీతో తూటాలను ఎదుటివాడి పొట్టలో దించినా మానసిక స్థితి బాగా లేదన్న సర్టిఫికేట్ ఉండడంతో సెలెబ్రెటీగా వెలుగొందుతున్నట్లు...అక్కడ కూడా మెంటల్ సర్టిఫికేట్ ఉంటే ఎంతటి తీవ్ర నేరమయినా క్షమించి…వదిలేయాల్సి రావచ్చు.

దాదాపు పాతికేళ్ల కిందటి మాట. ప్రింట్ మీడియా నుండి టీ వీ మీడియాకు వచ్చిన కొత్తల్లో నాకో వ్యక్తి పరిచయమయ్యాడు. అతనో సెలెబ్రిటీ అని అతడి నమ్మకం. తెలుగు, సంస్కృతంతో పాటు నాకు వాస్తు, జ్యోతిషంలో కూడా పరిచయం ఉందని అతను అనుకున్నప్పుడే అతడి అజ్ఞానం మీద నాకు ఒక అవగాహన ఏర్పడింది.

ఒకరోజు సడెన్ గా-
నా ఖర్మ కాలి ప్రస్తుతానికి ఇలా ఉన్నాను కానీ…మరో ఎనిమిదేళ్లలో నేను ఉపరాష్ట్రపతి కాబోతున్నాను. ఆ తరువాత గ్రహాలు అనుకూలిస్తే…రాష్ట్రపతి కూడా అవుతాను. శుక్ర మహర్దశలో నన్ను పట్టుకోవడానికి శని, రాహు, కేతులకు అసాధ్యం. అప్పుడు రవి ఒక్క ఇంట్లో కాకుండా నా జాతక చక్రంలో అన్ని ఇళ్లల్లో మధ్యందిన మార్తాండుడిలా వెలిగిపోతూ ఉంటాడు…”
అని నా నెత్తిన అయిదారు హిరోషిమా నాగసాకీల మీద వేసినవి కలిపి ఒకే సారి వేశాడు. అప్పుడు నా నెల జీతం నాలుగు వేల అయిదు వందలు. పిఎఫ్ కటింగులు పోను చేతికి నాలుగు వేలా వంద రూపాయలు వచ్చేది. హైదరాబాద్ లో తొక్కలో ఉపసంపాదకుడి ఉద్యోగం కంటే…దేశ రాజధాని ఢిల్లీలో ఉపరాష్ట్రపతి దగ్గర ఉప పిఆర్ఓ పోస్ట్ ఎలా ఉంటుందో ఊహించుకొమ్మని నాకో కలల ఆఫర్ కూడా ఇచ్చాడు!

“గ్రహం” అంటే పట్టుకునేది, పట్టి ఉంచేది అని పద వ్యుత్పత్తి అర్థం. గ్రహణం, గ్రాహ్యం, గ్రహీత, సంగ్రహించు, నిగ్రహం, విగ్రహం…ఈ మాటల వ్యుత్పత్తి అర్థాలు; ఉపసర్గలు చేరి వచ్చే వేరు వేరు అర్థాలు…ఇలా నా వానాకాలం చదువుల మిడి మిడి అవగాహనకు…ఆ క్షణం గ్రహచారం గట్టిగా పట్టినట్లు అనిపించింది. నా జాతకంలో శని ప్రభావం మొదలయినట్లు స్పష్టంగా తెలుస్తోంది. నాకు యోగకారకులుగా ఉండాల్సిన రవి చంద్రులు…శత్రువుతో చేతులు కలిపి రోగకారకులు అయినట్లు అర్థమయ్యింది. నా జాతకం నట్టింట్లో కూర్చుని నాకు బుద్ధి చెప్పాల్సిన బుధుడు…ఇల్లు వదిలి బయట పచ్చటి లాన్ లో పచ్చి గడ్డి తింటున్నట్లు కనిపించింది.

జాతకంలో అంతటి శుక్ర మహర్దశే ఉంటే…ఏకంగా రాష్ట్రపతే కావచ్చు కదా? ఉప ఉపసర్గ ముందు చేరి ఉపరాష్ట్రపతి ఎందుకు? అని నేను చదవని జ్యోతిశ్శాస్త్రం చదివినట్లుగా పరిభాషతో చర్చించాల్సి వచ్చింది. కీలకమయిన స్థానానికి దగ్గరగా కీలకమయిన స్థానంలో ఉండడానికి మాత్రమే అతడి గ్రహాలు అనుమతిస్తాయట. ఇప్పటిదాకా రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులు అయిన వారి జాతకాల్లో ఏయే గ్రహాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామని ఆ క్షణాన అనుకున్నాను కానీ…నా గ్రహచారం అనుమతించక…కుదరలేదు.

కట్ చేస్తే…పాతికేళ్లు కాలగర్భంలో దొర్లిపోయాయి. ఆయన వంటింట్లో ఆయన భార్య పెనం మీద అట్లు వేస్తుంటే…పక్కనే ఆయన గ్రయిండర్లో చట్నీ రుబ్బుతుండగా చూశాను. ఆయనకు ఎవరు జాతక చక్రం విప్పి చెప్పారో కానీ…నిజానికి అది నూటికి నూరు పాళ్లు నిజమయ్యింది. ఎటొచ్చి...”కీలకం” అన్న మాటను ఆయన సరిగ్గా అర్థం చేసుకోలేక…అపార్థం చేసుకున్నాడు. ఆయనకు భార్య కీలకం. ఆమెకు వంటిల్లు కీలకం. అత్యంత కీలకమయిన స్థానానికి ఆయన అత్యంత దగ్గరగా చేరాడు. ఆయన జాతకంలో “ఉపసతి” గ్రహచారం సరిగ్గా సరిపోయింది.

ఏమాటకామాట…
ఉపరాష్ట్రపతి కాలేనందుకు ఆయన ఏమాత్రం బాధపడకుండా…ఆ విషయాన్ని పూర్తిగా మరచిపోయి… “ఉప సమీపే” అన్న అర్థం ప్రకారం భార్యోపగతుడై...ఉప్మాలోకి వేయాల్సిన జీడి పప్పును ఒలుచుకుంటూ హాయిగా కాలం గడుపుతున్నాడు. అమెరికాలో కందుల సాయి వర్షిత్ లా ట్రక్కు తీసుకుని ఉపరాష్ట్రపతి భవనం మీదికి దండెత్తలేదు. ఉపరాష్ట్రపతిని చంపి…తాను ఉపరాష్ట్రపతిని కావాలనుకోలేదు!

-పమిడికాల్వ మధుసూదన్
[email protected]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *