Saturday, January 18, 2025
Homeసినిమాఅమ్మాయి అందంగానే ఉంది కానీ .. !

అమ్మాయి అందంగానే ఉంది కానీ .. !

Movie Review: సాధారణంగా ఒక అబ్బాయి గురించి చెబుతానంటే ఎవరూ వినిపించుకోరు .. పెద్దగా పట్టించుకోరు. కానీ ఒక అందమైన అమ్మాయి గురించి చెబుతానంటే మాత్రం వయసులో ఉన్నవాళ్లంతా చుట్టూ చేరిపోతారు. ఆ అమ్మాయి జీవితంలో చోటు  చేసుకున్న సంఘటనలను గురించి తెలుసుకోవడానికి ఉత్సాహాన్ని చూపిస్తారు. అందువల్లనే ఇంద్రగంటి మోహన్ కృష్ణ ‘ఆ అమ్మాయి గురించి మీకు చెబుతాను‘ అనే టైటిల్ ను వదలగానే అందరిలో ఆసక్తి పెరిగింది. వాళ్లందరి ఎదురుచూపులకు  తెరదించుతూ ఈ సినిమా ఈ శుక్రవారమే థియేటర్లకు వచ్చింది.

సుధీర్ బాబు – కృతి శెట్టి జంటగా నటించిన ఈ సినిమాను బెంచ్ మార్క్ – మైత్రీ వారు సంయుక్తంగా నిర్మించగా, వివేక్ సాగర్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ కథలో సక్సెస్ ఫుల్ సినిమా డైరెక్టర్ గా నవీన్ గా సుధీర్ బాబు నటిస్తే, కంటి డాక్టర్ అలేఖ్యగా కృతి శెట్టి కనిపిస్తుంది. తన నెక్స్ట్ సినిమాలో అలేఖ్యను హీరోయిన్ గా తీసుకోవాలనేది నవీన్ కోరిక. కానీ ఆమెతో పాటు ఆమె పేరెంట్స్ కి కూడా సినిమా ఫీల్డ్ అంటే ఎంతమాత్రం ఇష్టం ఉండదు. అందుకు ఒక బలమైన కారణం ఉంటుంది. అదేమిటి? అది తెలుసుకున్న నవీన్ ఏం చేస్తాడు? అనే మలుపులతో ఈ కథ ముందుకు వెళుతుంది.

ఇంద్రగంటి తన కథలను చాలా సహజంగా .. క్లారిటీతో చెబుతాడనే పేరు ఉంది. తెరపై ఆయన కథలు అంత హడావిడి అవసరం లేదు అన్నట్టుగా నిదానంగానే నడుస్తూ ఉంటాయి. ఈ సినిమా కూడా అదే తరహాలో నడిచింది. సాధారణ ప్రేక్షకులు కొంత కథ నడవగానే హీరో  హీరోయిన్స్ కలిసిపోయి, అక్కడి నుంచి తమని అలరించాలని కోరుకుంటారు. కానీ ఈ కథలో హీరో –   హీరోయిన్ మధ్య సెకండాఫ్ లో కొంత దూరం  వెళ్లిన తరువాత గానీ లవ్ పుట్టదు. అందువలన ఈ గ్యాప్ లో ఆడియన్స్ ఆశించే  రొమాన్స్ మిస్సయ్యింది .. వాళ్ల నుంచి కోరుకునే సాంగ్స్ మిస్సయ్యాయి.

కథాకథనాలు అంత  కొత్తగా కనిపించవు .. గొప్పగా అనిపించవు. తెరపై అలా సాఫీగా కథ నడిచిపోతూ టుంది. సంగీతం –  ఫొటోగ్రఫీ మాత్రం సినిమాకి చాలా హెల్ప్ అయినట్టుగా అనిపిస్తాయి. అప్పుడప్పుడు పెద్దగా పేలని ట్వీస్టులు పలకరించి వెళుతుంటాయి. మధ్యలో కొన్ని కొత్త పాత్రలు ఎంట్రీ ఇస్తుంటాయి. కానీ అలాంటివేవీ పెద్దగా ప్రభావం చూపలేకపోతుంటాయి. సుధీర్ బాబు – కృతి శెట్టి ఇద్దరూ బాగానే చేశారు. అమ్మాయి అందంగానే ఉంది .. కానీ ఆమె జీవితంలో ఎవరూ ఊహించని అంశాలైతే లేవని అనిపిస్తుంది.

Also Read:  ఆడియన్స్ కి కావాల్సినంత కథనే లేదు!

RELATED ARTICLES

Most Popular

న్యూస్