Actor Govindarajula Subba Rao Live For Ever With His Characters :
గోవిందరాజుల సుబ్బారావు .. అలనాటి నటులలో ప్రముఖంగా వినిపించిన పేరు. మూకీల నుంచి ముక్తిని పొందినట్టుగా తెలుగుసినిమా టాకీల దిశగా అడుగులు వేస్తున్న రోజులవి. అలాంటి పరిస్థితుల్లోనే ఆయన తెనాలి నుంచి మద్రాసు వెళ్లి నటుడిగా ఉన్నతమైన శిఖరాలను అధిరోహించారు. అప్పట్లోనే ఆయనది ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీ .. బాడీ లాంగ్వేజ్. తెరపై ఆయన నటిస్తున్నట్టుగా ఉండేది కాదు. సన్నివేశం మన కళ్లముందు జరుగుతుందా అన్నంత సహజంగా ఆయా పాత్రలలో జీవించేవారు. చేసినవి తక్కువ సినిమాలే అయినా, ‘గంగిగోవు పాలు గరిటెడైనను చాలు’ అన్నట్టుగా ఆ సినిమాలు నిలుస్తాయి.
అసలు ఆయన ఇంటిపేరు గోవిందరాజు .. కానీ అంతా కూడా గోవిందరాజుల అనే పిలిచేవారు. అందుకు ఆయన పెద్దగా అభ్యంతరం చెప్పేవారు కాదు. దాంతో గోవిందరాజుల అనే జనానికి తెలుసు. మొదటి నుంచి కూడా ఆయనకి నాటకాల పట్ల ఆసక్తి ఉండేది. హైస్కూల్ విద్యార్థిగా ఉన్నప్పుడే నాటకాల్లో నటించడం మొదలుపెట్టారు. ఆ తరువాత నాటకాల పట్ల తనకి గల మక్కువ వయసుతో పాటు పెరుగుతూ పోయింది. అప్పట్లో ఆయన వేసిన నాటకాల్లో ‘ప్రతాప రుద్రీయం’, ‘కన్యాశుల్కం’ మంచి పేరు తెచ్చిపెట్టాయి.
ఫలానా ఊరిలో ఫలానా నాటకం ఆడుతున్నారంటే అందులో గోవిందరాజుల ఉన్నారా? అని ఆరా తీసి, ఉన్నారంటే ఎంత దూరమైనా నడిచివెళ్లేవారట. అంతటి పేరు ప్రతిష్ఠలతో ఆయన ప్రభ వెలిగిపోయింది. ఒక వైపున వైద్య వృత్తిని కొనసాగిస్తూనే, మరో వైపున రాత్రి వేళలో నాటక ప్రదర్శనలు ఇస్తుండేవారు. అలాంటి పరిస్థితుల్లోనే ఆయన గురించి గూడవల్లి రామబ్రహ్మం గారికి తెలిసింది. అప్పుడు ఆయన ‘మాలపిల్ల’ సినిమా చేయడానికిగాను తగిన నటీనటుల కోసం వెతుకుతున్నాడు. గోవిందరాజుల గురించి తెలిసి వెంటనే ఆయన కోసం కబురుచేశారు.
గోవిందరాజులను .. ఆయన తీరు తెన్నులను చూడాగానే, ‘మాలపిల్ల’ సినిమాలో తాను అనుకున్న ‘సుందరరామశాస్త్రి’ పాత్రకి ఆయన బాగా సెట్ అవుతారని గూడవల్లికి నిపించింది. దాంతో వెంటనే ఆ పాత్రకి ఆయనను ఓకే చేసేశారు .. త్వరలో ‘మీసాలు’ తీసేసి తనని కలవమని చెప్పారు. గోవిందరాజులవారివి గుబురు మీసాలు .. ఆ మీసాలు అంటే ఆయనకి ఎంతో ఇష్టం. తాను నిండుగా .. గంభీరంగా కనిపించేలా చేసేవి ఆ మీసాలే. అలాంటి మీసాలు తీయడానికి ఆయన మనసు ఒప్పుకోలేదు. కానీ ఆ తరువాత ఆయన అయిష్టంగానే అందుకు అంగీకరించారు. అలా ఆయన 1938లో ‘మాలపిల్ల’ సినిమాలో అవకాశాన్ని సంపాదించుకున్నారు.
ఆ సినిమా ఆయనకి తీసుకొచ్చిన పేరు అంతా ఇంతా కాదు. ఇక నటుడిగా ఆయన అప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. “కులం చాలా గొప్పది .. దాని గొప్పతనం కొత్తగా ఇంగ్లిషు చదువులు చదువుకొచ్చినవారికి అర్థం కాదులే” అంటూ ‘మాలపిల్ల’లో కులాభిమానం చూపించే ఆ పాత్రలో ఆయన జీవించారు. ఆ పాత్రను అంతకంటే గొప్పగా ఎవరూ చేయలేరనే ప్రశంసలు అందుకున్నారు. అదే ఏడాది వచ్చిన ‘బాలనాగమ్మ’లో మాయల ఫకీరుగా ఆయన అద్భుతంగా మెప్పించారు. తెలుగు తెరపై తొలి మాంత్రికుడిగా మార్కులు కొట్టేశారు.
ఇక ‘పల్నాటి యుద్ధం’ సినిమాలో ‘బ్రహ్మనాయుడు’ పాత్రలో ఆయన చూపించిన హావభావ విన్యాసానికి అంతా ఆశ్చర్యపోయారు. బ్రహ్మనాయుడు అలాగే ఉండేవారేమోనని అనుకున్నారు. సాత్మికమైన పాత్రలను మాత్రమే కాదు, ఆవేశపూరితమైన .. రౌద్రరస భరితమైన పాత్రలను కూడా ఆయన అద్భుతంగా చేయగలరనే విషయం స్పష్టమైంది.
ఆ తరువాత ఆయన చేసిన మరో జానపద చిత్రమే ‘గుణసుందరి కథ’. ఈ సినిమాలో ఉగ్రసేన మహారాజు పాత్రలో ఆయన ఆవిష్కరించిన అభినయం అసమానం. ఒక వైపున అసమర్థులైన అల్లుళ్లు .. మరో వైవున అనురాగం లేని కూతుళ్లు. తనని ఎంతగానో ప్రేమించే చిన్న కూతురుని దూరం చేసుకున్నానే అనే బాధ. మంచంలో మరణయాతన .. ఏమీ చేయలేని ఆ నిస్సహాయతను ఆయన ఆవిష్కరించిన తీరు చూస్తే, గోవిందరాజుల ఇప్పటికీ గుర్తుండిపోవడానికి గల కారణం ఆయన నటనలోని సహజత్వమేకదా అనిపిస్తుంది. ఇక ఆ తరువాత ఆయన చేసిన సినిమానే ‘షావుకారు’. తెలుగు సినిమా గొప్పతనాన్ని చాటి చెప్పే చిత్రాలలో .. గోవిందరాజుల సుబ్బారావు నట వైభవాన్ని చాటిచెప్పే చిత్రాలలో ‘షావుకారు’ ఒకటిగా కనిపిస్తుంది.
ఈ సినిమాలో ‘షావుకారు’ గోవిందరాజులవారే. కథ అంతా కూడా ఆయన పాత్ర చుట్టూనే తిరుగుతుంది. తాకట్టు వ్యాపారం చేసే మహాలోభిగా ‘చెంగయ్య’ పాత్రను ఆయన పండించిన తీరును అభినందించకుండా ఉండలేం. డబ్బు తప్ప మరీ ఏదీ ముఖ్యమైనదీ కాదనీ .. అంతకంటే ప్రాధాన్యతను ఇవ్వలసినది ఏదీ లేదని బలంగా నమ్మే ఈ పాత్రకి ఆయన ప్రాణప్రతిష్ఠ చేశారు. కథాకథనాలతో పాటు ప్రధానపాత్రధారి అయిన ఆయన నటన ఆ సినిమాను నిలబెట్టేసింది. ఇప్పటికీ ఆ సినిమాను గురించి మాట్లాడుకునేలా చేసింది.
ఇక వీటితో పాటు గోవిందరాజుల కెరియర్లో చెప్పుకోదగిన సినిమాల జాబితాలో చేరిపోయిన మరో ఆణిముత్యమే ‘కన్యాశుల్కం’. ఆనాటి సాంఘిక దురాచారాలపై ‘గురజాడ అప్పారావు’ ఎక్కుపెట్టిన అస్త్రమే కన్యాశుల్కం. ఆ నాటకాన్ని సినిమాగా తెరపై ఆ ఆవిష్కరించారు. అంతకుముందు నాటకాలలో ‘గిరీశం’ పాత్రను పోషించిన గోవిందరాజుల, ఈ సినిమాలో ‘లుబ్ధావధానులు’ పాత్రను చేశారు. పడుచుదనం రాని పిల్లను పెళ్లి చేసుకోవడానికి తహతహలాడే ముదుసలి పాత్రలో ఆయన నటన చూసితీరవలసిందే. ఇలా ఎన్నో విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను పోషించి, జన హృదయాలపై చెరగని స్థానాన్ని సంపాదించుకున్న ఆయన వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఆయనను ఒకసారి స్మరించుకుందాం.
Must read : తెలుగుసినిమా
(గోవిందరాజుల సుబ్బారావు వర్ధంతి ప్రత్యేకం)
– పెద్దింటి గోపీకృష్ణ