Harikatha Pitamahudu: విశాఖపట్నం విమానాశ్రయంలో సెక్యూరిటీ చెకింగ్ కౌంటర్ల వైపు వెళుతుంటే పెద్ద స్తంభానికి ఆనించిన హరికథా పితామహుడు శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు నిలువెత్తు విగ్రహం కనిపించి…ఒళ్లు పులకించిపోయింది. అంతకు ముందు కూడా అక్కడెక్కడన్నా ఉందో? లేక ఈమధ్యే పెట్టారో? తెలియదు కానీ…ఆ విగ్రహం అక్కడ పెట్టించినవారికి శిరసు వంచి నమస్కరించాలి. తెలుగు, ఇంగ్లిష్, హిందీలో ఆయన పేరు, రెండు వాక్యాలు ఆయన గురించి రాసి పెడితే ఇంకా బాగుంటుంది.
సాధారణంగా సెల్ఫీలు తీసుకువడం నాకు ఇష్టం ఉండదు. జనం ఉన్న చోట అసలు సెల్ఫీల జోలికే వెళ్లను. అలాంటిది చేయి చాచి నన్నే పిలుస్తున్నట్లున్న ఆదిభట్ల విగ్రహం చూడగానే నిగ్రహించుకోలేక ఒక సెల్ఫీ తీసుకుని…ఆదిభట్ల గురించి నేను చదివినవి, విన్నవి నెమరువేసుకుంటూ లోపలికి వెళ్లాను. విమానం గంటన్నర ఆలస్యం అని మూడు భాషల్లో విరిచి విరిచి చెబుతుంటే…ఆదిభట్ల అమ్మవారి గురించి రాసిన అచ్చ తెలుగు కావ్యానికి సామవేదం షణ్ముఖ శర్మగారు చెప్పిన అనితరసాధ్యమయిన భాష్యం చెవుల్లో మారుమోగుతోంది.
నాకు పాతికేళ్ల కిందటివరకు ఆదిభట్ల అంటే హరికథలు చెప్పడంలో పేరు సంపాదించిన వ్యక్తిగానే తెలుసు. 1998 లో సద్గురు శివానందమూర్తి గారు సికింద్రాబాద్ లో ఒక సాహిత్య కార్యక్రమానికి అతిథిగా వచ్చారు. నాలుగు లైన్ల వార్త రాయడానికి రిపోర్టర్ గా నేను ఆ కార్యక్రమానికి వెళ్లాను. భారతీయ సాహిత్యం, సంగీతం, కళల్లో ఉన్న పారమార్థిక దృక్కోణం; వాటి లోతుల గురించి వారు నెమ్మదిగా మొదలు పెట్టి హిమాలయాల ఎత్తుకు తీసుకెళుతూ…ఆదిభట్లలో దాగిన రచయిత, కవి, పండితుడు, గాయకుడు, బహుభాషా కోవిదుడిని చెప్పీ చెప్పకుండా చెప్పారు. అచ్చ తెలుగులో ఆయన రచనల గురించి కొన్ని ఉదాహరణలు చెప్పారు. ఆ క్షణం నుండీ ఆదిభట్లను చదువుతూనే ఉన్నాను. ప్రతిసారీ తొలిసారిలా మైమరచి పోతుంటాను. కొన్నేళ్ల తరువాత ఆదిభట్ల అచ్చతెలుగు అమ్మవారి రచన గురించి సామవేదం వారి వ్యాఖ్య వినే అదృష్టం కలిగింది. అప్పటినుండి ఆదిభట్ల మీద అభిమానం కాస్త ఆరాధనగా మారింది.
ఆదిభట్ల విజయనగరం దగ్గర అజ్జాడ గ్రామంలో పుట్టాడు. గౌరవవాచకం శ్రీమత్; ఊరిపేరు అజ్జాడ కలిపి శ్రీమదజ్జాడ; ఇంటిపేరు ఆదిభట్ల- మొత్తం “శ్రీమదజ్జాడ ఆదిభట్ల” అయ్యింది. తెలుగు హరికథను ప్రపంచ యవనిక మీద రెపరెపలాడించినవాడు కనుక హరికథా పితామహుడు. తెలుగు, సంస్కృతం, తమిళం, హిందీ, బెంగాలీ, ఉర్దూ, ఇంగ్లీషు, అరబ్బీ, పారశీక భాషల్లో ప్రావీణ్యం సంపాదించినవాడు. అష్టావధానాలు చేసినవాడు. అచ్చతెలుగులో, సంస్కృతంలో, సంస్కృతభూయిష్టమైన తెలుగులో వివిధ విషయాలపై వందకు పైగా గ్రంథాలు రాసినవాడు.
గొంతెత్తి పాడి ప్రపంచాన్ని ఇక్షుసాగరంలో ముంచి తేల్చిన గాయకుడు. గద్యం, పద్యం, శ్లోకం, జానపదం ఎలా పాడాలో తెలిసినవాడు. ఆశువుగా పద్యాలు, శ్లోకాలు అల్లి శ్రోతలను ఊపేసినవాడు.
అసాధారణమయిన జ్ఞాపకశక్తి ఉన్నవాడు. ధారణకు తోడు అమృతతుల్యమయిన కవితా ధార ఉన్నవాడు.
ఆయన్ను కేవలం హరికథకుడిగా చూస్తే తెలుగు సాహితీ లోకం తనను తాను తక్కువ చేసుకున్నట్లు.
“ఇలాంటివాడొకడు ఉండేవాడా?” అని ఆశ్చర్యపోవాల్సిన అద్భుతమైనవాడు ఆదిభట్ల. ఆయన గురించి నాకు తెలిసింది గోరంత. తెలుసుకోవాల్సింది కొండంత.
జననం:
31-08-1864
మరణం:
02-01-1945
అసలు పేరు:
సూర్యనారాయణ
ప్రావీణ్యం:
పది భాషల్లో
ఇతర విషయాలు:
సంగీతంలో అభినివేశం, అష్టావధాని
ప్రత్యేకత:
ప్రాథమిక విద్యాభ్యాసం తరువాత హై స్కూల్ మెట్లెక్కకపోయినా… సొంతంగా ఇష్టం కొద్దీ చదువుకున్నవాడు. తెలుగు హరికథను ఉత్తరభారతంలో చెప్పి శ్రోతల ప్రశంసలు పొందడం.
రాసిన గ్రంథాలు:
వందకు పైగా
రచనలో ప్రత్యేకత:
అచ్చ తెలుగులో అనన్యసామాన్యమయిన అల్లిక
కీర్తి:
సంగీత సాహిత్య నాట్యాల మేళవింపుతో తెలుగు హరికథను హిమాలయం మీద ప్రతిష్ఠించడం. ఇప్పటిలా మైకులు, సౌండ్ బాక్సులు, ఎల్ ఈ డి స్క్రీన్లు లేని రోజుల్లో ఆదిభట్ల హరికథ కంచు కంఠంతో మారుమోగడం. ఇసుక వేస్తే రాలనంత జనం వచ్చి ఆ హరికథలను వినడం.
అంతటి ఆదిభట్ల విగ్రహాన్ని ఒడిలో పెట్టుకుని విశాఖ విమానాశ్రయం ధన్యత పొందింది.
హరికథలు దాటి ఆదిభట్ల రచనల్లోకి తొంగి చూడండి. అప్పుడు నా ఆరాధన ఎంత చిన్నదో మీకే తెలుస్తుంది.
-పమిడికాల్వ మధుసూదన్
[email protected]
Also Read :
Also Read :