దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత అధ్వాన్నంగా ఉంది. ఇవాళ కూడా నగరం అంతట దుమ్ము ధూళి దట్టంగా ఉన్నాయి. ఈ క్రమంలో వాయు కాలుష్యం తీవ్రమైన చర్మ సమస్యలకు దారితీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఢిల్లీ మాత్రమే కాకుండా పొల్యూటెడ్ సిటీల్లో ఉండే ఎవరైనా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు.
వాయు కాలుష్యంతో మనిషి శరీరంలో ఎక్కువగా ప్రభావితమయ్యేది చర్మమని ఢిల్లీకి చెందిన సీనియర్ డెర్మటాలజిస్ట్ దీపాలీ భరద్వాజ్ చెప్పారు. వాయు కాలుష్య ప్రభావంతో చర్మ సంబంధిత సమస్యలతో ఢిల్లీలో ఇటీవల ఎక్కువమంది వస్తున్నారని వెల్లడించారు. ముఖ్యంగా కళ్లకింద నల్లటి మచ్చలు, కళ్ల తెల్లదనం తగ్గిపోయి దుమ్ము పసుపు రంగులోకి మారడం, చర్మంపై మచ్చలు, చర్మం పొడిబారడం, చర్మంపై దురదలు, దద్దుర్లు, చర్మం ముడుతలు, స్కిన్ క్యాన్సర్ లాంటి సమస్యలు వస్తాయని ఆమె తెలిపారు.
ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో పై సమస్యలకు చెక్ పెట్టవచ్చని దీపాలీ భరద్వాజ్ చెప్పారు. అంతేగాక గదుల్లో కర్పూరం కాల్చడంవల్ల పరిసరాల్లో ఆరోగ్య వాతావరణం నెలకొంటుందని తెలిపారు. ప్రతిరోజు నిద్రకు ముందు బెడ్‌రూమ్‌లో ఐదు నుంచి పది నిమిషాలపాటు కర్పూరం కాల్చాలని సూచించారు. అలా చేయడం వల్ల గాలిలో ఆక్సిజన్ అణువుల సంఖ్య పెరిగి శ్వాస సులువుగా ఉంటుందని చెప్పారు. అదేవిధంగా కొన్ని రకాల ఇండోర్ మొక్కలను పెంచడంవల్ల కూడా శ్వాసవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుందని తెలిపారు.
ప్రతిరోజు సమృద్ధిగా నీరు తాగాలని, దానివల్ల చర్మం డీహైడ్రేషన్‌కు గురై పొడిబారకుండా ఉంటుందని డాక్టర్ దీపాలీ చెప్పారు. అయితే, వాయు కాలుష్యంతో వచ్చే అనారోగ్య సమస్యలు అందరిలో ఒకేలా ఉండవని, వ్యక్తిని బట్టి సమస్య వేరువేరుగా ఉంటుందని ఆమె తెలిపారు. ఈ రకమైన చర్మ సమస్యలకు సొంత వైద్యం మంచిది కాదని, సంబంధిత వైద్యులను సంప్రదించి సరైన మెడికేషన్ తీసుకోవాలని సూచించారు.