‘ఆర్ఎక్స్ 100’తో తెలుగులో కొత్త ట్రెండుకు శ్రీకారం చుట్టిన దర్శకుడు అజయ్ భూపతి. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘మంగళవారం’. ముద్ర మీడియా వర్క్స్ పతాకం పై స్వాతి గునుపాటి, సురేష్ వర్మ .ఎం, ‘A’ క్రియేటివ్ వర్క్స్ పతాకం పై అజయ్ భూపతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నిర్మాతగా అజయ్ భూపతి తొలి చిత్రమిది. దీంతో ఆయన ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోరూపొందుతున్న చిత్రమిది. ఈ రోజు టైటిల్ వెల్లడించడంతో పాటు కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు అజయ్ భూపతి మాట్లాడుతూ… ”కాన్సెప్ట్ బేస్డ్ చిత్రమిది. ఇప్పటి వరకు ఇండియాలో ఎవరూ ప్రయత్నించనటువంటి కొత్త జానర్ సినిమా. ‘మంగళవారం’ టైటిల్ ఎందుకు పెట్టామనేది సినిమా చూస్తే తెలుస్తుంది. సినిమాలో 30 పాత్రలు ఉన్నాయి. ప్రతి పాత్రకూ కథలో ప్రాముఖ్యం ఉంటుంది. ప్రతిదీ ఇంపార్టెంట్ క్యారెక్టరే” అని అన్నారు.
నిర్మాతలు స్వాతి గునుపాటి, సురేష్ వర్మ .ఎం మాట్లాడుతూ… ”మాది పాన్ ఇండియా సినిమా కాదు, సౌత్ ఇండియన్ సినిమా. ‘ఆర్ఎక్స్ 100’తో అజయ్ భూపతి ఆడియన్స్‌ను ఎలా సర్‌ప్రైజ్ చేశారో, ఈ సినిమాతోనూ అదే విధంగా సర్‌ప్రైజ్ చేస్తారు. కాన్సెప్ట్ & కంటెంట్ అంత స్ట్రాంగ్‌గా ఉంటాయి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. చిత్రీకరణ ఇటీవల ప్రారంభించాం. నటీనటుల వివరాలు త్వరలో వెల్లడిస్తాం” అని చెప్పారు.