ఆర్ఆర్ఆర్ మూవీ ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఎవరూ ఊహించని విధంగా ఇంటర్నేషనల్ అవార్డులు కూడా దక్కించుకుని ఆస్కార్ బరిలో కూడా నిలిచి తెలుగు సినిమా సత్తా మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది. అయితే ‘ఆర్ఆర్ఆర్‘ లో కొమరం భీమ్ పాత్ర అద్భుతంగా పోషించిన ఎన్టీఆర్ ఆస్కార్ నామినేషన్స్ లో నిలుస్తాడని అందరూ ఆశించినా అది జరగలేదు. ఇప్పుడు ఉత్తమ నటుడుగా జాతీయ అవార్డ్ అయినా ఎన్టీఆర్ కు వస్తుందా అనేది హాట్ టాపిక్ అయ్యింది.
ఆర్ఆర్ఆర్ మూవీ కేవలం బెస్ట్ ఒరిజినల్ విభాగంలో ‘నాటు నాటు’ సాంగ్ కు మాత్రమే నామినేషన్ దక్కించుకోవడంతో ఎన్టీఆర్ అభిమానుల దృష్టి ఇప్పుడు మరో వైపు మళ్లింది. అదే నేషనల్ అవార్డ్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు నేషనల్ అవార్డ్.. ఇప్పుడు అభిమానుల్లో ఈ అంశం పై జోరుగా చర్చ జరుగుతోంది. కొమురం భీముడో పాటకు ముందు పాట సమయంలో ఎన్టీఆర్ పలికించిన హావ భావాలు ప్రతీ ఒక్కరినీ అబ్బుర పరిచాయి. ఈ సన్నివేశాలే ఎన్టీఆర్ కు నేషనల్ అవార్డ్ ని తెచ్చి పెడతాయని అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు.
అయితే.. కన్నడ హీరో రిషబ్ శెట్టి విషయంలో మాత్రం అభిమానులు టెన్షన్ పడుతున్నారని వార్తలు వస్తున్నాయి. కారణం ఏంటంటే.. కాంతార మూవీలోని చివరి 20 నిమిషాల్లో రిషబ్ శెట్టి ప్రదర్శించిన నటన ప్రతీ ఒక్కర్ని విశేషంగా ఆకట్టుకుంది. ఇటీవల ముంబాయిలో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుల వేడుక జరిగింది. ఇందులో రిషబ్ శెట్టి మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ గా కాంతార మూవీకి గానూ అవార్డుని దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా బాలీవుడ్ క్రిటిక్స్ కొంత మంది రిషబ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. అంతే కాకుండా రిషబ్ కు 2022 కు గానూ ఉత్తమ నటుడిగా పలు అవార్డులు దక్కాలంటూ కోరుకున్నారని తెలిసింది. దీంతో.. ఉత్తమ నటుడుగా జాతీయ అవార్డ్ ను ఎన్టీఆర్ దక్కించుకుంటారో..? రిషబ్ శెట్టి దక్కించుకుంటారో..? అనేది ఆసక్తిగా మారింది.