Allu Ramalingaiah :
తెలుగు తెరపై మొదటి నుంచి కూడా హాస్య నటుల సందడి ఎక్కువే. ప్రేక్షకులపై వారు చూపిన ప్రభావం ఎక్కువే. తెలుగులో హాస్యనటుల జాబితాను తయారు చేయాలనుకుంటే ముందుగా అందరికి గుర్తుకు వచ్చేది రేలంగి – రమణా రెడ్డి. ఈ ఇద్దరిలో రేలంగి కాస్త లావుగా ఉండి పెద్దగా కదలకుండానే నవ్వించేవారు. రమణ రెడ్డి మాత్రం బక్కపల్చని పర్సనాలిటీతో స్ప్రింగులా కదిలిపోతూ తదైనా హాస్యాన్ని పలికించారు .. ఒలికించారు. ఆ తరువాత ప్రేక్షకులకు బాగా పరిచయమైన పేరు అల్లు రామలింగయ్య.
అల్లు రామలింగయ్య .. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించారు. చిన్నప్పటి నుంచే అల్లు చాలా చురుకైనవారు. మొదటి నుంచి ఆయనలో సమయస్ఫూర్తి ఎక్కువే. ఊళ్లో అందరినీ సరదాగా ఆటపట్టిస్తూ … నవ్విస్తూ ఉండేవారు. చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడ నాటక ప్రదర్శనలున్నా తప్పకుండా వెళుతూ ఉండేవారు. ఆ నాటకాలు చూస్తూ అందరూ చప్పట్లు కొడుతూ ఉండటంతో, తాను కూడా నటించాలనే ఆసక్తి ఆయనలో మొలకెత్తింది. ఇక అప్పటి నుంచి ఆయనకి చదువుపై శద్ధ తగ్గడం .. నాటకాలపై శ్రద్ధ పెరగడం ఒకేసారి జరిగిపోయాయి.
అప్పట్లో నాటకాలలో మంచి పేరు సంపాదించుకున్నవారందరి దృష్టి సినిమాలపైనే ఉండేది. అందరూ మద్రాసు చేరుకుని ఎవరి ప్రయత్నాలు వారు చేసేవారు. అలా అల్లు కూడా మద్రాసు చేసుకుని సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించడం మొదలుపెట్టారు. గరికపాటి రాజారావు దర్శకత్వం వహించిన ‘పుట్టిల్లు’ సినిమాలో ఆయనకి తొలి అవకాశం దక్కింది. హాస్యనటుడిగా కుదురుకునేవరకూ ఇబ్బందులు పడినప్పటికీ, ఆ తరువాత తనదైన బాడీ లాంగ్వేజ్ .. డైలాగ్ డెలివరీతో ఆకట్టుకుంటూ, అల్లరి పెంచుతూ ముందుకు వెళ్లారు.
రేలంగి .. రమణా రెడ్డి బరిలో ఉండగానే అల్లు రంగంలోకి దిగారు. ఆ తరువాత రాజబాబు … పద్మనాభం వంటి హాస్య నటుల నుంచి ఆయనకి గట్టిపోటీ ఉండేది. అయినా అల్లు తనదైన హాస్యాన్ని ఆవిష్కరిస్తూ ప్రేక్షకుల మనసులను పొలోమంటూ దోచేశారు. రాజబాబు .. పద్మనాభం వంటివారితో కలిసి నటించేటప్పుడు ఆయన తన పట్టు జారిపోకుండా చూసుకునేవారు. ఇక కామెడీతో కూడిన రొమాంటిక్ సీన్స్ లోను అల్లు తన మార్కు చూపించేవారు. రమాప్రభతో కలిసి ఆయన చేసిన సందడి అంతా ఇంతాకాదు. ‘ముత్యాలు వస్తావా .. ‘ అనే పాటనే అందుకు నిలువెత్తు నిదర్శనం .. కొండంత కొలమానం.
హాస్యంలో కూడా అల్లు ఎంచుకున్న పాత్రలు ఆయన తెలివి తేటలకు .. ఆయనకు ప్ర్రత్యేకతకు నిదర్శనంగా నిలుస్తాయి. మిగతా హాస్య పాత్రలు హీరో పక్కన గానీ, సెపరేటు ట్రాకులో గాని కనిపిస్తూ ఉండేవి. కానీ అల్లు పాత్ర హాస్యంతో కూడినదే అయినా, విలన్ ను అంటిపెట్టుకుని ఉండేది. హీరోను దెబ్బకొట్టేందుకు విలన్ పన్నే పన్నాగాలకు తన వంతు సలహాలిస్తూ .. సాయపడే పాత్రల్లో అల్లు జీవించారు. నాగభూషణం .. రావు గోపాలరావు విలనిజంలో తాను కూడా ఒక చేయి వేస్తూ, అందులోనే హాస్యాన్ని పండిస్తూ నవ్వులు పూయించారు. అప్పట్లో రావు గోపాలరావు కాంబినేషన్లో అల్లు లేని సినిమా ఉండేది కాదు.
తెలుగు తెరపై ‘చిత్రగుప్తుడు’ అంటే అల్లూనే. ఆ పాత్రను అంత అద్భుతంగా పండించినవారు మరొకరు లేరు. ‘మూగమనసులు’లో ‘తస్సాదియ్యా’ అంటూ పడవ నడిపే అప్పన్న పాత్ర, ‘మనవూరి పాండవులు’లో ‘దేవుడికి దేవుడి ఉద్యోగం ఇచ్చిందే మా దొరవారు’ అంటూ విలన్ ను వెనకేసుకొచ్చే కన్నప్ప పాత్ర, ‘ముత్యాలముగ్గు’లో నాయకా నాయికలను విడగొట్టి .. ఆ పాపానికి పిచ్చివాడైపోయే జోగినాథం పాత్ర .. ఇలా ఒకటేమిటి? అల్లు వారి గురించి చెప్పుకోవాలంటే, వెయ్యికి పైగా ఆయన చేసిన విభిన్నమైన పాత్రల విన్యాసం గురించి చెప్పుకోవాలి. హాస్యంలో ఇన్ని కోణాలు చూపిన నటుడు అల్లూ మాత్రమే అనే విషయాన్ని ఒప్పుకోవాలి.
పంచె పైకి పట్టుకుని .. ఒక కాలును ఎగరేస్తూ .. కాస్త వంకరగా నడుస్తూ ఏ బాడీ లాంగ్వేజ్ తో అల్లు కడుపుబ్బా నవ్వించారో, పాటల్లో కూడా అదే బాడీ లాంగ్వేజ్ తో అలరించారు. పాటల్లోను ఆయన తన ఊతపదాలు ఉండేలా చూసుకున్నారు. ‘రామసామి సెప్పింది రాసుకోండయా’ .. ‘అల్లరి పెడతారే పిల్లా’ వంటి పాటలు అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆ పాటల్లో ఆయన ఎక్స్ ప్రె షన్స్ ఇప్పటికీ హాయిగా నవ్విస్తాయి .. మనసును ఆహ్లాదం వైపు నడిపిస్తాయి.
కథ పల్లెలో నడిచినా .. పట్నంలో పరిగెత్తినా విలన్ కి కుడి భుజంలా ఉంటూ, తమ పాచికలు పారేలా చేసిన హాస్య నటుడు అల్లూనే. ఆ తరహా పాత్రలలో ఆయన దరిదాపుల్లోకి వెళ్లే ప్రయత్నం మరొకరు చేయకపోవటం కూడా ఆయన ప్రత్యేకతనే. ఇలా ఆయన తెలుగు తెరను తెరచాపగా చేసుకుని, తన పాత్రల పడవను హాస్య తీరాలకు చేర్చారు. తెలుగు తెరపై వెలిసిపోని హాస్యపు హరివిల్లై విరిశారు. పద్మశ్రీ .. రఘుపతి వెంకయ్య వంటి పురస్కారాలను అందుకున్నారు. హాస్యానికి భాష్యం చెప్పిన అల్లు రామలింగయ్య వర్ధంతి నేడు. ఈ సందర్భంగా మనసారా ఆయనను ఓ సారి స్మరించుకుందాం.
– పెద్దింటి గోపికృష్ణ
Also Read : ఆమె పాటలు వింటుంటే… తేనెవానలో తడిసినట్టు……