Friday, March 29, 2024
HomeTrending Newsఅమర్ నాథ్ యాత్ర ప్రారంభం

అమర్ నాథ్ యాత్ర ప్రారంభం

భారతీయులు పవిత్రంగా భావించే అమర్ నాథ్ యాత్ర ఈ రోజు ప్రారంభం అయింది. జమ్ము కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా యాత్ర ప్రారంభిస్తూ శ్రీనగర్ లోని రాజ్ భవన్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలిదశలో 4890 మంది యాత్రికులు బోలేనాథ్ దర్శనం కోసం పయనమయ్యారు. భక్తుల బృందం  పహల్గాం, బల్తాల్ రెండు పట్టణాల నుంచి 14 కిలోమీటర్ల దూరంలోని అమర్నాథ్ గుహకు చేరుకుంటుంది. హిమాలయాల్లో 3880 మీటర్ల ఎత్తుల్లో ఉన్న మహాదేవుడి దర్శనం కోసం దేశ, విదేశాల నుంచి భక్తులు తరలివస్తారు.  యాత్రికుల కోసం ఈ దఫా భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. 43 రోజుల పాటు సాగే అమరనాథ్ యాత్ర భద్రతను CRPF బలగాలు డేగ కన్నుతో పర్యవేక్షిస్తున్నాయి. ఈ దఫా మహాదేవుడి దర్శనం కోసం శ్రీనగర్ నుంచి హెలికాప్టర్ సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. దీంతో ఒక రోజులోనే దర్శనం చేసుకోవచ్చు. కరోనా నేపథ్యంలో గత రెండేళ్లుగా అమర్ నాథ్ యాత్ర జరగలేదు. అంతకు ముందు 370 ఆర్తికాల్ రద్దు దృష్ట్యా యాత్ర కాలపరిమితి కుదించారు.

అమరనాథ్ విశిష్టత

శ్రీనగర్ నుంచి 145 కి. మీ ల దూరంలో ఉన్న అమర్ నాథ్, భారతదేశంలో ప్రధాన తీర్థ యాత్రా ప్రదేశాలలో ఒకటి గా పరిగణించబడుతుంది.సముద్ర మట్టానికి 4175 మీటర్లో ఎత్తులో ఉన్న ఈ ప్రదేశం శివ భక్తులలో బాగా ప్రాచుర్యం పొందింది.మంచుతో సహజంగా ఏర్పడిన దైవ రూపమైన “శివ లింగం”,ఇక్కడి ముఖ్య ఆకర్షణ. ఈ తీర్థానికి పేరు రెండు హిందీ పదాల కలయిక వల్ల వచ్చింది. అమర్ అనగా అమరమైన.నాథ్ అనగా దేవుడు. హిందూ మత పురాణాల ప్రకారం, శివుడి దేవేరి అయిన పార్వతీదేవి తనకు అమరత్వం యొక్క రహస్యాలు బహిర్గతం చేయమని అభ్యర్థించింది. ప్రతిస్పందనగా, శివుడు ఎవరి చెవినా ఆ రహస్యం పడకూడదు అనే ఉద్దేశ్యం తో ఆమెను హిమాలయాల ఏకాంతంలో ఉన్న ఈ గుహలకు తీసుకు వెళ్ళి జీవిత రహస్యాలు వెల్లడించాడు. హిమాలయాలకు వెళ్ళే దారిలో, పరమశివుడు తన తలపై ఉన్న చంద్రున్నిచందన్వారి వద్ద, తన వృషభం నందిని పహల్గాం వద్ద వదిలి వెళ్ళాడని ప్రతీతి. పిదప, శివుడు, తన తనయుడు, గజ దేవుడైన గణేశునిమహగుణాస్ పర్వతం పైన మరియు సర్పాన్ని శేష్ నాగ్ వద్ద విడిచి పెట్టాడు. తర్వాత, మహా శివుడు, పంచ భూతాలని పంచ్ రత్ని వద్ద వదిలి గుహ లోకి వెళ్ళాడని నమ్మిక. అప్పడు శివుడు, తన మాటలను ఎవరూ వినకుండా ఉండేందుకు గానూ, గుహ లో మంట వెలిగించి అక్కడి సమస్త జీవులను నాశనం చేశాడని నమ్ముతారు.

6వ శతాబ్దానికి చెందిన సంస్కృత రచన, నీలమాత పురాణం లో ఈ ప్రసిద్ధ యాత్రా స్థలాన్ని పేర్కొన్నారు. ఈ పురాణం కాశ్మీరీల కర్మకాండ ను మరియు వారి సాంస్కృతిక జీవన శైలులను వివరిస్తుంది. క్రీ. పూ 34 లో కాశ్మీర్ సింహాసనాన్ని అధిరోహించిన రాజర్షి ఆర్యరాజ తో కూడా అమర్ నాథ్ ముడిపడి ఉంది. కాలక్రమంలో ఈ రాజు, తన రాచరిక హక్కును విసర్జించాడు. వేసవుల్లో అతను ఇక్కడికి చేరుకొని సహజ రీతిన మంచుతో తయారయినశివ లింగాన్ని పూజించాడని నమ్ముతారు. రాజతరంగిణి లో కూడా అమర్ నాథ్ అమరేశ్వర గా పేర్కొనబడింది. 1420 మరియు 1470 ల మధ్య జరిగిన తన అమర్ నాథ్ యాత్రా కాలం లో సుల్తాన్ జైన్లబిదిన్, షా కోల్ అనే కాలువ నిర్మించాడు. అమర్ నాథ్ యాత్రలో, ప్రయాణికులు 3888 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్ నాథ్ గుహను తప్పక చూడాలి. ఈ గుహ లో సహజసిద్ధంగా ఏర్పడిన మంచు “శివ లింగం” ఉంటుంది. చంద్ర చక్రం ఆధారంగా మంచు శివ లింగం పెరగటం తరగటం జరుగుతుంది. మే నుంచి ఆగష్టు మధ్యలో గరిష్ట ఎత్తును చేరుకుంటుంది.ఈ గుహ 5000 ఏళ్ల నాటిదిగా చెప్పబడుతుంది.ఇది శివుడు పార్వతి దేవి కి అమరత్వ రహస్యం ఉపదేశించిన ప్రదేశంగా నమ్మబడుతుంది. గణేశునికి,పార్వతి దేవి కి కూడా ఇక్కడ రెండు మంచు లింగాలు ఉన్నాయి.

భారతీయ సైన్యం, భారతీయ పారామిలటరీ దళాలు, సి.ఆర్.పి.ఎఫ్, ఈ ప్రదేశానికి గస్తీ కాస్తూ ఉంటాయి. అందువల్ల, అమర్ నాథ్గుహ ను సందర్శించాలంటే ఉన్నత అధికారుల నుంచి ముందే అనుమతి తీసుకోవాలి. శేష్ నాగ్ సరస్సు అమర్ నాథ్ లోని మరొక ప్రసిద్ధ ఆకర్షణ. ఇది పహల్గాం కి 27 కి.మీ ల దూరంలో ఉంది. ఈ సరస్సు, సముద్ర మట్టానికి 3658 మీటర్ల ఎత్తులో ఉండటం వల్ల, జూన్ దాకా మంచుతో కప్పబడి ఉంటుంది. వేసవి కాలంలో అమర్ నాథ్ యాత్రికులు , పర్యాటకులు ఈ సరస్సు కి భారీ సంఖ్యలో వస్తారు. అమర్ నాథ్ సందర్శించేవారు, విమానంలో గానీ రైలు లో గానీ ఇక్కడికి చేరుకోవచ్చు. ఇక్కడికి అత్యంత దగ్గరలో ఉన్న విమానాశ్రయం శ్రీనగర్ విమానాశ్రయం. ఇది ఢిల్లీ లోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంతో అనుసంధానించబడింది. అమర్ నాథ్ ని రైలులో చేరగోరే వారు జమ్మూ రైల్వే స్టేషన్ కు చేరుకోవచ్చు. ఇక్కడికి దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల నుంచి రైళ్లు ఉన్నాయి. వేసవి లో సరాసరి ఉష్ణోగ్రత 15 డిగ్రీలు ఉంటుంది. అయితే, శీతాకాలం చలిగా ఉంటుంది. కనిష్ఠ ఉష్ణోగ్రత -5 డిగ్రీల దాకా పడిపోతుంది. అమర్ నాథ్ సాధారణంగా నవంబర్ నుంచి మార్చి/ఏప్రిల్ దాకా మంచు తో కప్పబడి ఉంటుంది. ఏడాదిలో ఏ సమయంలోనైనా వర్షాలు పడవచ్చు. వర్షాలు అమర్ నాథ్ యాత్రకు అడ్డంకి గా మారతాయి. అమర్ నాథ్ దర్శించడానికి మే నుంచి అక్టోబర్ మధ్యనెలలు సరైన సమయం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్