కోడెల శివప్రసాద్ చావుకు కారణం ముమ్మాటికీ చంద్రబాబేనని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఆ పార్టీలో బాబుకంటే కోడెల సీనియర్ అని, ఆత్మహత్యకు ముందే ఓసారి నిద్రమాత్రలు మింగితే కోడెలను కనీసం ఫోన్ లో పరామర్శించడానికి కూడా బాబు అయిష్టత చూపారని వెల్లడించారు. ఆ కుటుంబానికి ద్రోహం చేసిన వ్యక్తి బాబేనని తేల్చి చెప్పారు. కోడెల తమ రాజకీయ ప్రత్యర్థి అని, పదవిలో ఉన్నప్పుడు ఆయన అక్రమాలపై చట్టపరంగా కేసులు పెట్టామని, అంతే తప్ప ఆయన చావుకు బాధ్యత తమది కాదన్నారు.
తనను ఆంబోతు అని బాబు సంబోధించడంపై రాంబాబు ఘాటుగా స్పందిస్తూ ఆంబోతులకు ఆవులను సప్లై చేసిన చరిత్ర ఉన్న నేత బాబు అంటూ ధ్వజమెత్తారు. బాబు, లోకేష్, కోడెల కంటే తాను నిజాయితీపరుడినేనన్నారు. తన తమ్ముడు నియోజకవర్గంలో కనబడకపోవడం చిదంబర రహస్యం అంటూ బాబు చేసిన విమర్శలపై కూడా రాంబాబు సమాధానమిస్తూ బాబు తమ్ముడు, ఒకసారి ఎమ్మెల్యే కూడా అయిన రామ్మూర్తి నాయుడు ఇప్పుడు ఎక్కడ, ఎలా ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబు సైకో వ్యాఖ్యలపై అంబటి తీవ్రంగా మండిపడ్డారు. రాజకీయం కోసం ఎవరి చంక అయినా నాకే చంద్రబాబు కంటే సైకో ఎవరున్నారని నిప్పులు చెరిగారు. బాబు ఓ ముసలి సైకో అని, పదవి లేకపోతే బతకలేరని అన్నారు. 14ఏళ్ళు సిఎంగా ఉన్న చంద్రబాబు ఎంతమంది పేదవారిని ధనవంతులను చేశారో చెప్పాలని, ఇప్పుడు మాత్రం పేదవారిని కోటీశ్వరులు చేయడమే తన ధ్యేయమని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బాబు సత్తెనపల్లి సభ అట్టర్ ఫ్లాప్ అయ్యిందని, జనం లేకపోయినా బ్రహ్మాండంగా జరిగిందని చెప్పుకుంటున్నారని అన్నారు. 50 వేల మంది పట్టే మైదానంలో కేవలం 2, 3 వేల మంది వచ్చారని, వారినే ఎక్కువ చేసి చూపించి సక్సెస్ అని ఊదరగొడుతున్నారని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు పని ఇక అయిపోయిందని, ఆయన మళ్ళీ గెలిచే పరిస్థితే లేదని.. వచ్చే ఎన్నికల తర్వాత ఆయన సర్దుకోవాల్సిందేనని, అందుకే ‘సర్దుకో చంద్రబాబూ’ అని తాము చెప్పదలచుకున్నామన్నారు.