Monday, May 20, 2024
HomeTrending Newsకెసిఆర్ ను వదిలి పెట్టం - బండి సంజయ్

కెసిఆర్ ను వదిలి పెట్టం – బండి సంజయ్

కేసీఆర్ అహంకారంతో గర్వం తలకెక్కి మాట్లాడుతుండటాన్ని దేశమంతా చూస్తోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించారు. కేసీఆర్… మీకెందుకింత అహంకారం?  బరితెగించి మాట్లాడుతూ ఇంకా సమర్ధించుకోవడం సిగ్గుచేటన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్దనున్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఎదుట ‘బీజేపీ బీమ్ దీక్ష’ చేసిన అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. కర్నాటక ఎంపీ మునుస్వామి, రాష్ట్ర ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయం బాబూరావు, పార్లమెంటరీ పార్టీ కార్యాలయ కార్యదర్శి కామర్సు బాలసుబ్రమణ్యం, కేంద్ర జలవనరుల శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి,  సమన్వయకర్త నూనె బాలరాజ్ తదితరులు ఈ మీడియాతో సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడిన వ్యాఖ్యల్లోని ముఖ్యాంశాలు…..

టీఆర్ఎస్ నేతలు కూడా బలుపెక్కి అడ్డగోలుగా మాట్లాడుతున్నరు. కేసీఆర్ కు సీఎం పదవి బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పెట్టిన భిక్షే. దేశంలో కల్వకుంట్ల రాజ్యాంగాన్ని తీసుకురావాలని చూస్తున్న నీచుడు కేసీఆర్. ఆ రాజ్యాంగం ప్రకారం…. సీఎం, మంత్రులు సచివాలయానికి వెళ్లొద్దనుకుంటున్నడు. గడీలు నిర్మించుకోవాలనుకుంటున్నడు. రారాజును నేనే అని కేసీఆర్ భావిస్తున్నడు.

అంబేద్కర్ రాజ్యాంగం వద్దు… కల్వకుంట్ల రాజ్యాంగమే ముద్దు అని చెబుతున్నడు. నేనే దోచుకోవాలని, నా అవినీతిని, కుటుంబ పాలనను  ఎవరూ ప్రశ్నించొద్దని కేసీఆర్ అనుకుంటున్నడు. హామీలను నెరవేర్చకూడదు… నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వను…దళితులకు మూడెకరాలు ఇవ్వనంటున్నడు. అంబేద్కర్ స్థానంలో తన విగ్రహం పెట్టుకోవాలని కేసీఆర్ చూస్తున్నడు. కేసీఆర్… ఇంకా నీ నియంత పాలనను భరించాలా?

కేసీఆర్ విశ్వాసఘాతకుడు… దేశ ద్రోహి. ప్రధాని పదవి నాకు అంబేద్కర్ పెట్టిన భిక్ష అని సాక్షాత్తు పార్లమెంట్ లో ప్రకటించిన గొప్ప వ్యక్తి నరేంద్రమోదీ. అంబేద్కర్ స్పూర్తితోనే శక్తివంతమైన దేశ రూపకల్పనలో మోదీ అహర్నిశలు కృషి చేస్తున్నారు. అంబేద్కర్ జయంతి, వర్దంతులకు ఏనాడు హాజరు కాని నీచుడు కెసిఆర్. తెలంగాణ సమాజం కేసీఆర్ ను భరించడానికి సిద్ధంగా లేరు. రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలను మార్చాలనుకున్న ఇందిరాగాంధీకి దేశ ప్రజలు చుక్కలు చూపిన సంగతి గుర్తుంచుకో….

కేసీఆర్ వ్యాఖ్యలన్నీ… స్ట్రాటజీలో భాగమేనని ఆ పార్టీ నేతలే చెప్పుకోవడం సిగ్గు చేటు. ఇలాంటి స్ట్రాటజీలతో ఇంకా ఎంతమందిని అవమానిస్తావ్ కేసీఆర్. జాతీయ జెండాను మార్చాలంటాడేమో.. సనాతన ధర్మాన్ని పక్కనపెట్టాలంటాడేమో. కేసీఆర్… ఆనాడు బ్రిటీషర్లకు పట్టిన గతే నీకు పడుతుంది. కేసీఆర్ ఈ అంశంపై స్పందించేదాకా వదిలిపెట్టే ప్రసక్త లేదని బండి సంజయ్ హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్