Friday, November 22, 2024
HomeTrending Newsఅమెరికా గన్ కల్చర్

అమెరికా గన్ కల్చర్

American Gun Culture : పిచ్చోడి చేతిలో రాయెట్లాగో… అమెరికా పౌరుల చేతుల్లో ఇప్పుడు తుపాకీ అట్లా! ప్రపంచంలో అన్నిదేశాలకూ పెద్దన్న పాత్ర పోషిస్తున్న అగ్రరాజ్యమంటే ఏంటని ఇంతకాలం ఊహించుకున్న ప్రపంచానికి… ఆ కీర్తి ఆ అగ్రరాజ్యానికెందుకు దక్కిందో ఇప్పటికిగాని మెల్లిమెల్లిగా అర్థమవుతున్న పరిస్థితి!

ఓ సర్టైన్ ఏజ్ వస్తే డ్రైవింగ్ లైసెన్సే కాదు…. గన్ లైసెన్సూ ఇచ్చే సంప్రదాయం మనం పెద్దన్నగా పిల్చుకునే అగ్రరాజ్యానిది. ఎవడైనా పంచ్ డైలాగులు వేస్తే… స్పాంటేనియస్ గా స్పందిస్తూ కౌంటర్సిస్తే… అబ్బ వీణి మాటలు తూటాల్లా పేలుతున్నాయిరా అనంటుంటాం! కానీ అమెరికాలో మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండానే ఉన్మాదులు తూటాలు పేల్చేసే కల్చర్ ఓ ప్రత్యే’కథ’!!

చదువు సంస్కారాన్ని నేర్పుతుంది. అనుభవం పరిణతినిస్తుంది. అయితే అప్పుడప్పుడే ఉన్నత చదువుల వైపు అడుగులేసే వారికి, అనుభవమన్నదప్పటికింకా ఆరంభమే కానివారికి గన్నులిస్తే… భావోద్వేగాల నియంత్రణ ఏ స్థాయిలో ఉంటుందో అగ్రరాజ్యాధిపతులకు తెలియందని ఈ ప్రపంచం మాత్రం ముమ్మాటికీ నమ్మదు. కానీ, ఏ పాలకుడు వచ్చినా.. కాల్పుల ఘటనలు జరిగినప్పుడు దానిపై టాట్ టూట్ అనడం… ఆ తర్వాత వదిలేయడం.. వెరసి లక్షల మంది ప్రాణాలు ఇప్పటికే బలి! అందుకే తమది అగ్రరాజ్యమని గొప్పలు కాబోలు!! సదరు మనిషే భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోలేని స్థితిలో… ఆ మనిషే తయారు చేసిన ఓ ఆయుధం… వేలు పెట్టి నొక్కితే దూసుకుపోయే బుల్లెట్… ఎలా కంట్రోలవుతాయన్న ఇంగితం అగ్రరాజ్యానికి మిస్సైనట్టుంది బహుశా! ఎందుకంటే చిన్న చిన్న ఇంగితాల గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకునే ఆషామాషీ దేశం కాదు గనుక! ప్రపంచ దేశాలన్నింటికీ పెద్దన్నగనుక!!

అయితే ప్రపంచమంతా ఇప్పుడు గ్లోబల్ విలేజ్ గా మారిపోయింది. అగ్రరాజ్యమైన అమెరికాకు వెళ్లడమంటే… ఎవరికైనా ఆసక్తే! చాలామంది యువతకు అదో కల! కొందరికి నిజమయ్యే కలైతే… మరికొందరికి కలలానే మిగిలిపోయే నిజం!! సరే ఎవరెవరి కలలు నిజమైతున్నాయన్న విషయాలిక్కడ అప్రస్తుతం. కానీ, కలలు నిజమై అమెరికా బాట పట్టి.. సప్తసముద్రాలు దాటిపోయిన యువత గురించే ఇప్పుడు ఆయా కుటుంబీకుల టెన్షన్! అందుకే అమెరికాలో పేలే తుపాకీ శబ్దానికి… ఇండియాలోని ఓ మారుమూల పల్లె ఉలిక్కిపడుతోంది. ఏ ఉన్మాదో కాల్పులు జరిపిన చోట తమ పిల్లలాపట్టణాల్లో ఉండుంటేగనుక… క్షేమ, సమాచారమందేవరకూ ఆ తల్లిదండ్రులకిక… నిద్రలేని రాత్రుల కలవరింతలే! ఆ కలలుగన్న కలర్ ఫుల్ అమెరికా లైవ్స్ గురించి!!

అయితే అంత సాంకేతికత.. అంత అన్నేసి ఆర్థికవనరులు… ఇన్ఫ్రాస్ట్రక్చర్… ఒక్క మాటలో చెప్పాలంటే ఓ భూతలస్వర్గంలా భావించే అమెరికాలో… ఈ జాఢ్యమింకెన్నాళ్లు…? ఈ ప్రశ్నే మళ్లీ మరో పదేళ్లు… ఇరవై ఏళ్ల తర్వాత కూడా మనం బాగుంటే వేసుకోవచ్చు! ఎందుకంటే ఆయుధాల మాఫియాదే అక్కడ శాసనం. అదంతా బిలియన్ డాలర్ల బిజినెస్సు. ఆ వ్యాపారులే పాలకులనైనా, మీడియానైనా, ఇంకేవ్యవస్థలనైనా శాసించే సమాంతర సర్కార్లు. అలాంటప్పుడు సర్కారువారి పాటకెదురేముంటుంది…? అందుకే అక్కడ జనాభా కంటే ఆయుధాల సంఖ్యే ఎక్కువ! సగటున రోజుకు యాభై మంది అమెరికాలో తుపాకీ తూటాలకు బలైపోతున్నట్టు ఓ లెక్క! అందుకే జనం పిట్టల్లా రాలి సంఖ్య తగ్గిపోతుంటే… తుపాకులదే సంఖ్యాబలమై… అనగనగా ఒకరోజు అనే ఓ సినిమాలో ఇదేమన్నా పెన్ననుకున్నావా గన్ను అంటూ రఘువరన్ ను బ్రహ్మానందం బెదిరించే కామెడీ సీన్ కు భిన్నంగా… నిజమైన గన్లు పేలుతూ.. కామన్ సిటిజన్ ప్రాణాలకు భద్రత కొరవడటం అగ్రరాజ్యమనే ఓ విషాద సినిమా!

-రమణ కొంటికర్ల

Also Read :

అమెరికా విషాదం

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్