కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నిన్న చేవెళ్ల సభలో అన్ని అబద్దాలు చెప్పారని, దీనికి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఎంత మోసం చేస్తుందో బీజేపీ రాష్ట్ర నాయకులకు ఎందుకు కనిపించడం లేదో అర్ధం కావడం లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ లెక్కలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి, బండి సంజయ్ కి పంపిస్తానని వారు, దీనిపై కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలని సవాల్ చేశారు. హైదరాబాద్‌లో సోమవారం మంత్రుల నివాస సముదాయం వద్ద ఆయన బీఆర్‌ఎస్ నేతలు రాజారాంయాదవ్, గొట్టి ముక్కుల వెంకటేశ్వర్‌రావుతో కలిసి మీడియాతో మాట్లాడారు.
బీజేపీకి మతాల మధ్య చిచ్చుపెట్టడం తప్ప ఇతర ఏ పని లేదని విమర్శించారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధి దేశంలో బిజెపి పాలిత రాష్ట్రాలలో కానీ, ఏ రాష్ట్రంలోనైనా ఉంటే చూపాలన్నారు. ఫలానా రాష్ట్రం బాగుందని మీరు చూపిస్తానంటే తానుకూడా వస్తానన్నారు. రాజకీయాలు, అభివృద్ధి వేర్వేరు అంశాలని, ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని, ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమన్న విషయాన్ని మరువద్దని వినోద్ హితవు పలికారు. స్వల్పకాలంలో తెలంగాణ అభివృద్ధి చెందిన విషయాన్ని గమనించాలని, ఇతర దేశాలు, రాష్ట్రాల వాళ్ళు హైదరాబాద్ కి వచ్చి సింగపూర్ కి వచ్చామా అంటూ ఆశ్చర్య పోతున్నారని వినోద్ కుమార్ వ్యాఖ్యానించారు.
రోడ్ సెస్ కింద తెలంగాణ రాష్ట్రం రూ. 39,189 కోట్లు కేంద్రానికి చెల్లిస్తే, కేంద్రం మాత్రం రాష్ట్రానికి చెందిన రోడ్లకు రూ.34 వేల కోట్లు మాత్రమే ఇచ్చిందని వెల్లడించారు. రాష్ట్రానికి వివిధ గ్రాంట్ల కింద రూ. ఒక లక్షా 20 వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని కేంద్ర మంత్రి అమిత్ షా చేవెళ్ల సభలో చెప్పారని, కానీ వాస్తవానికి అందులో నాలుగో వంతు నిధులు కూడా ఇవ్వలేదని తెలిపారు. 2014-15 లో రాష్ట్రానికి రూ. 30,000 వేల కోట్లు ఇచ్చినట్లు అమిత్ షా చెబితే, వాస్తవానికి ఇచ్చింది రూ. 15,307 కోట్లు మాత్రమేనన్నారు. అమిత్ షా పచ్చి అబద్ధాలు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రానికి మోసం చేసే లెక్కలను అమిత్ షా వెంటనే సరి చేసుకోవాలని వినోద్ కోరారు. గణాంక లెక్కలపై చర్చకు రావాలని, వారు చెప్పిన లెక్కలు తప్పు అని తాను నిరూపిస్తానంటూ ఛాలెంజ్ విసిరారు.