ఆనందయ్య మందు పంపిణీ మరోసారి వివాదాస్పదమైంది. వాస్తవానికి మందు పంపిణీ రేపటి నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. కానీ కోవిడ్ తో బాధపతుడున్న కొంటామని రోగుల బంధువులు ఈ రోజు ఉదయం నుంచే పంపిణీకి ఒత్తిడి తేవడం ప్రారంభించారు. ఆనందయ్య తమ్ముడు నాగరాజు వారికి మందు ఇచ్చి పంపించాలని భావించారు. పంపిణీ మొదలు పెట్టిన విషయం తెలుసుకున్న పరిసర గ్రామాల ప్రజలు పెద్దఎత్తున ఒక్కసారిగా కృష్ణపట్నం చేరుకోవడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. కోవిడ్ నిబంధనలు పాటించకుండా, ముందస్తు సమాచారం లేకపోడంతో పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేసి పంపిణి నిలిపి వేశారు.
ఎక్కడో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు బతిలాడితే వారి వరకు ఇచ్చి పంపుదామని అనుకున్నామని, కానీ తాకిడి ఎక్కువ కావడంతో పోలీసుల సూచనల మేరకు పంపిణీ నిలిపి వేశామని ఆనందయ్య వెల్లడించారు. మొదట కృష్ణపట్నంలో, సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రతి ఇంటికీ పంపిణీ మొదలు పెడతామని, ఆ తర్వాత నియోజక వర్గ కేంద్రాలకు మందు పంపుతామని చెప్పారు.
మందుకు కావాల్సిన ముడి సరుకులు అన్నీ సమకూర్చుకున్నామని. కాకపోతే మిక్సీలు, గ్రైండర్లు అవసరమని వాటికోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. ఇవి అందుబాటులోకి వస్తే వెంటనే మందు తయారీ మొదలవుతుందని ఆనందయ్య వివరించారు. మందును ఎలా పంచాలనేదానిపై జిల్లా అధికారులకు లేఖ రాస్తామని, వారి సూచనల మేరకు ముందుకు వెళ్తామన్నారు.