Jabardasth Chance: బుల్లితెరపై గ్లామర్ టచ్ ఇచ్చిన యాంకర్ గా అనసూయ ముందువరుసలో కనిపిస్తుంది. ఇక వెండితెరపై కూడా ఆమె భారీ సౌందర్యానికి మంచి క్రేజ్ లభించింది. సిల్వర్ స్క్రీన్ పైకి అనసూయ ఎంట్రీ ఇచ్చిన తీరు చూసి, ఆమె ఇక స్పెషల్ సాంగ్స్ మాత్రమే చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఆమె ఆ వైపు నుంచి ముఖ్యమైన .. కీలకమైన పాత్రల వైపు టర్న్ తీసుకుంది. ‘రంగస్థలం’ సినిమాలో రంగమ్మత్త పాత్ర .. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆమె ముందుకు వెళ్లడానికి ఊతాన్ని ఇచ్చింది. అప్పటి నుంచి ఆమె అదే మార్గంలో ముందుకు వెళుతోంది.
ఇక ఇటీవల వచ్చిన ‘పుష్ప’ సినిమాలో ‘దాక్షాయణి’గా అనసూయ కొత్తగా కనిపించింది. నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలను కూడా అనసూయ చేయగలదని నిరూపించుకుంది. అనసూయ గ్లామరస్ గా కనిపిస్తుందని అనుకున్నామే అంటూ అసంతృప్తికి లోనైనవారి ముచ్చట తీర్చడానికి వెంటనే ‘ఖిలాడి’లో చంద్రకళగా మెరిసింది. ఈ సినిమాలో చీరకట్టులో అనసూయ గ్లామర్ ముందు హీరోయిన్లు తేలిపోయారని చెప్పుకున్నవారు ఎక్కువమందే ఉన్నారు. అంతలా ఆమె గ్లామర్ కి మార్కులు పడిపోయాయి.
ఇక ‘ఆచార్య‘ సినిమాలోను అనసూయ ఒక కీలకమైన పాత్రను పోషించింది. ప్రమోషన్స్ పరంగా ఆమె పాత్ర ప్రేక్షకుల ముందుకు వచ్చేలోగా సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఏప్రిల్ 29వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదలకు ముస్తాబవుతూ ఉండగానే, ఆమె మరోసారి చిరంజీవి సినిమాలో ఛాన్స్ కొట్టేసిందని అంటున్నారు. చిరంజీవి కథానాయకుడిగా మెహర్ రమేశ్ ‘భోళాశంకర్’ సినిమాను రూపొందిస్తున్నాడు. తమన్నా కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి మహతి స్వరసాగర్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం అనసూయను తీసుకున్నారట. వెండితెరపై అనసూయ జోరు మామూలుగా లేదు .. అందానికి అదృష్టం తోడైతే ఇలాగే ఉంటుందేమో!
Also Read : భీమ్లా నాయక్ బాటలో ఆచార్య