ఐపీఎల్: పంజాబ్ పై కోల్ కతా ఘనవిజయం

IPL-2022: ఐపీఎల్ లో నేడు జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ పై కోల్ కతా నైట్ రైడర్స్ ఆరువికెట్లతో ఘనవిజయం సాధించింది. కోల్ కతా స్టార్ ఆటగాడు అండీ రస్సెల్ మరోసారి తన బ్యాట్ తో ప్రతాపం చూపాడు. కేవలం31 బంతుల్లో 8 భారీ సిక్సర్లు, రెండు ఫోర్లతో 70 పరుగులతో అజేయంగా నిలిచి తన మునుపటి సత్తా ప్రదర్శించాడు. మరో ప్లేయర్ శామ్ బిల్లింగ్స్ కూడా 24 పరుగులతో అజేయంగా నిలిచి రస్సెల్ కు చక్కటి సహకారం అందించారు. ముఖ్యంగా ఓడియన్ స్మిత్ వేసిన 12వ ఓవర్లో రస్సెల్, బిల్లింగ్స్ కలిసి 30 పరుగులు బాదారు. దీనితో కోల్ కతా 14.3 ఓవర్లలోనే 141 పరుగులు చేసి తిరుగులేని విజయం సొంతం చేసుకుంది.

ముంబై వాంఖేడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో కోల్ కతా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. రెండు పరుగుల వద్ద పంజాబ్ తొలి వికెట్ (కెప్టెన్ మయాంక్ అగర్వాల్-1) కోల్పోయింది. శిఖర్ ధావన్- బానుక రాజపక్ష రెండో వికెట్ కు 41 పరుగులు జోడించారు. రాజపక్ష ధాటిగా ఆడి కేవలం 9 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 31 పరుగులు చేశాడు. రాజపక్ష జోరుకు కాసేపు కోల్ కతా బౌలర్లు నివ్వెరపోయారు. శివమ్ మావి బౌలింగ్ లో టిమ్ సౌతీ పట్టిన క్యాచ్ కు రాజపక్ష అవుట్ కావడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆ కాసేపటికే ధావన్ (16) కూడా ఔటయ్యాడు. లివింగ్ స్టోన్-19; హర్ ప్రీత్ బ్రార్-14; రాజ్ బవా-11 పరుగులు మాత్రమే చేశారు. అయితే చివర్లో రబడ 16 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్ తో 25 పరుగులు చేయడంతో పంజాబ్ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది, 18.2 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌట్ అయ్యింది. కోల్ కతా బౌలర్లలో ఉమేష్ యాదవ్ నాలుగు, సౌతీ రెండు, శివమ్ మావి, సునీల్ నరేన్, అండీ రస్సెల్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

కోల్ కతా 14 పరుగులవద్ద తొలి వికెట్ (అజింక్యా రెహానే-12); 38 వద్ద రెండో వికెట్ (వెంకటేష్ అయ్యర్-3) కోల్పోయింది, 51 పరుగుల వద్ద ఒకేసారి రెండు వికెట్లు (కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్-26; నితీష్ రానా డకౌట్) కోల్పోయింది. ఈ దశలో బిల్లింగ్స్ , రస్సెల్ కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్ది మరో వికెట్ పడకుండా విజయం సాధించి పెట్టారు. పంజాబ్ బౌలర్లలో రాహుల్ చాహర్ రెండు;  రబడ, ఓడియన్ స్మిత్ చెరో వికెట్ పడగొట్టారు.

నాలుగు వికెట్లు సాధించిన ఉమేష్ యాదవ్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ లభించింది.

Also Read : ఐపీఎల్: చెన్నైపై లక్నో విజయభేరి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *