Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

(అన్నమయ్య జయంతి ప్రత్యేకం)

జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతుందో ఎవరికీ తెలియదు. అనుకోకుండా జరిగే కొన్ని సంఘటనలు జీవితాన్ని మరో మలుపు తిప్పేస్తుంటాయి. అప్పటివరకూ ఏది ముఖ్యమని అనుకుంటామో .. ఏది సర్వస్వమని భావిస్తామో దానికి అసలు ఎలాంటి ప్రాధాన్యత లేకుండా పోతుంది. ఆశలు .. కోరికలు జీవితాన్ని చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నప్పుడు, ఒక్కసారిగా మనసు ఆ ఊబిలో నుంచి బయటపడి, వ్యామోహాలను పటాపంచాలు చేసుకుని ఆధ్యాత్మిక మార్గంలో అడుగులు వేస్తుంది .. పరుగులు తీస్తుంది.

ఆశలు పక్కన పెట్టేస్తే అనంతమైన ఆనందం ఎక్కడ ఉందో అర్థమవుతుంది .. కోరికలు కొడిగడితే జీవితానికి పరమార్థం  ఏమిటో గోచరిస్తుంది. బంధాలు .. అనుబంధాలనే సంకెళ్లను తెంచుకుంటే, ఏది సత్యమో .. ఏది శాశ్వతమో  బోధపడుతుంది. అప్పుడే మనిషి మాయను దాటుకుని భగవంతుడి సన్నిధిలో అడుగుపెట్ట గలుగుతాడు.  భక్తి పుష్పాలను భగవంతుడి పాదాల చెంత సమర్పించగలుగుతాడు. మహాభక్తుల కథలు అందుకు నిలువెత్తు నిదర్శనంగా అనిపిస్తాయి. తమ కీర్తనలతో ఆధ్యాత్మిక ప్రపంచాన భక్తిభావ పరిమళాలను వెదజల్లిన ఆ భక్తాగ్రేసరులలో ‘తాళ్లపాక అన్నమాచార్యులు’ ముందువరుసలో కనిపిస్తాడు.

కడప జిల్లా .. రాజంపేట మండలంలోని తాళ్లపాక గ్రామంలో నారాయణ సూరి .. లక్కమాంబ అనే దంపతులు ఉండేవారు. ఆయన మంచి పండితుడైతే .. ఆమె మహాభక్తురాలు. శ్రీవేంకటేశ్వరుడి అనుగ్రహం కారణంగా ఆ దంపతులకు ‘వైశాఖ పౌర్ణమి’ రోజునఅన్నమయ్య జన్మిస్తాడు. స్వామి ధరించే ఆయుధమైన ఖడ్గం (నందకం) అంశతో, జన్మించిన అన్నమయ్య, బాల్యం నుంచి అల్లరివాడేకాదు … ఆదర్శవంతమైన వ్యక్తిత్వం కలిగినవాడు కూడా. యవ్వనంలోకి అడుగుపెట్టిన దగ్గర నుంచే ఆయన మూఢాచారాల పట్ల తన నిరసనను తెలియజేసేవాడు.

ఒకసారి ఆయన గడ్డి కోసుకు రావడానికి అడవికి వెళతాడు .. ఆయన ఏదో ఆలోచన చేస్తూ గడ్డి కోస్తూ ఉండగా, వ్రేలు తెగుతుంది. అదే సమయంలో అటుగా కొంతమంది భక్తులు ‘గోవిందా’ అంటూ తిరుమల కొండల దిశగా సాగుతూ ఉంటారు. అంతే .. ఏదో తెలియని శక్తి వాళ్ల వెంట ఆయనను ‘తిరుమల’కు చేరుస్తుంది. అంతకాలంగా ఆయన చూస్తూ వచ్చిన ఏడుకొండలు వేరు .. ఇప్పుడు చూస్తున్న ఏడుకొండలు వేరు. ఆ కొండలతో తనకు ఏదో తెలియని బంధం ఉందన్నట్టుగా, ఇకపై తన అడుగులు మోసేది .. ఆశ్రయం ఇచ్చేది ఆ కొండలేనన్నట్టుగా అనిపిస్తుంది.

కొండపై కొలువైన వేంకటేశ్వరుడు … తన కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్టుగా అన్నమయ్య మనసుకు తోస్తుంది. అంతకాలంగా తాను స్వామికి దూరంగా ఉండటం బాధను కలిగిస్తుంది. అంతే సాధ్యమైనంత త్వరగా స్వామిని చేరుకోవాలనే ఉద్దేశముతో వడివడిగా అడుగులు వేస్తాడు. తల్లి దగ్గరికి పరిగెత్తుకు వెళుతున్న బిడ్డలా ఆత్రుతగా ఉన్న ఆయనకి అమ్మవారు మారువేషంలో దర్శనమిస్తుంది. ఆ కొండలన్నీ సాలగ్రామమయం అనే విషయాన్ని గుర్తుచేస్తుంది. దాంతో ఆయన అప్పటివరకూ పట్టించుకోని పాదరక్షలను పారేసి .. నడుస్తాడు. వేంకటేశ్వరస్వామి దర్శనభాగ్యం కలగగానే, ఆ దివ్యమోహన సౌందర్యాన్ని చూసి భక్తి పారవశ్యంతో సొమ్మసిల్లిపోతాడు.

ఆ రోజు నుంచి ఆ కొండల్లో ఓంకారంతో కలిసి ఆయన ‘తంబూర’ మోగుతుంది. స్వామిని దర్శించడం .. ఆయన ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొనడం .. సేవలో తరించడం .. కీర్తనా మాలికను సమర్పించడం ఆయన దినచర్యగా మారిపోతుంది. అన్నమయ్య తల్లిదండ్రులు ఆయనను వెతుక్కుంటూ అక్కడికి వచ్చి ఇంటికి తీసుకువెళతారు. తిమ్మక్క – అక్కమ్మలతో ఆయన వివాహాన్ని జరిపిస్తారు. వారిద్దరూ కూడా భక్తి మార్గంలో ఆయనను అనుసరిస్తారు. అన్నమయ్య ఆశువుగా కీర్తనలు పాడుతూ ఉండగా, శిష్యులు వాటిని తాళపత్రాలపై రాసేవారు. అలా అన్నమయ్య 32 వేల కీర్తనలు రాయగా, వాటిలో కొంతవరకూ మాత్రమే లభ్యమయ్యాయి.

‘అదివో .. అల్లదివో’ అంటూ తిరుమల కొండలను పరిచయం చేసిన అన్నమయ్య, ‘ఇప్పుడిటు కనుగొంటి .. ‘ అంటూ స్వామివారి దివ్యమైన సౌందర్యాన్ని .. ఆ తేజస్సును కళ్ల ముందుంచుతాడు. ‘అన్ని మంత్రములు ఇందే ఆవహించెను’ .. ‘ఇతనికంటే మరి దైవము గానము’ .. ‘అన్నిటికీ నిది పరమౌషధము’ అంటూ వేంకటేశ్వరస్వామికి మించిన దైవము లేదనీ, అన్ని మంత్రాలు ఆ స్వామి నామాన్నే ఆవహించి ఉన్నాయనీ .. ఆ నామమే అన్ని వ్యాధులనూ .. బాధలను తొలగించే పరమౌషధమని చాటి చెబుతాడు.

‘ఇందరికీ నభయమ్ము నిచ్చు చేయి’ .. ‘ ఈ పాదమేకదా ఇలయెల్ల గొలిచినది’ అంటూ స్వామివారి పాదాలను ఆశ్రయిస్తే, ఆయన అభయము అన్ని వేళలోను లభిస్తూ ఉంటుందని చెబుతాడు. ‘ఆకటివేళల .. అలపైన వేళల’ .. ‘ఎంతమాత్రమున ఎవ్వరు దలచిన’ అంటూ, ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఆ స్వామిని పిలిచినా, కరుణతో కరిగిపోయి ప్రవాహం కంటే వేగంగా తన భక్తుల దగ్గరకి ఆయన చేరుకుంటాడని సెలవిస్తాడు. ‘వినరో భాగ్యము విష్ణు కథ’ అంటూ ఆ స్వామి కథలను వినడం కంటే మరో భాగ్యం లేదనే విషయాన్ని స్పష్టం చేస్తాడు. స్వామి కొంటె చూపులు .. అమ్మవారి సిగ్గు దొంతరలపై ఆయన రాసిన కీర్తనలు ఆ దృశ్యాలను కళ్లకు కడుతుంటాయి.

ఇలా తిరుమల కొండలు .. అక్కడి శిలలు .. స్వామివారి దివ్యమంగళ రూపం .. అమ్మవారి సౌందర్య శోభ .. స్వామి వైభవం .. ఆయన లీలావిశేషాలు .. స్వామికి జరిగే సేవలు .. ఉత్సాహంతో జరిపే ఉత్సవాలు .. స్వామివారి వివాహ వేడుక ఘట్టాలు .. అందరిపట్ల ఆ కోనేటిరాయుడు చూపే సమానమైన కరుణ .. అన్నమయ్య కీర్తనల్లో ఒదిగిపోయాయి. ఒకసారి  ‘పెనుగొండ’ ప్రభువైన సాళ్వ నరసింగరాయలు, తనపై ‘పదాలు’ పాడమని అన్నమయ్యను కోరతాడు. శ్రీహరిని తప్ప ఇతరులను కీర్తించనని అన్నమయ్య తేల్చిచెబుతాడు. తన కోరికను తిరస్కరించినందుకుగాను ఆ రాజు సంకెళ్లతో బంధిస్తే, కీర్తనతోనే భగవంతుడిని ప్రసన్నం చేసుకుని సంకెళ్లు తెగిపడేలా చేసుకోవడం అన్నమయ్య అసమాన భక్తికి నిదర్శనం.

‘తొలి వాగ్గేయకారుడు’గా .. ‘పదకవితా పితామహుడు’గా భక్తుల హృదయ పీఠాలను అన్నమయ్య అధిష్టించాడు. అన్నమయ్య కీర్తనల్లో వ్యావహారిక తెలుగులోని సరళత .. జానపద సొగసులు .. సంస్కృత పదాల సుగంధాలు భక్తులను పరవశులను చేస్తూ ఉంటాయి. భక్తిరసం తొణికసలాడే మనసు పాత్రతో ఆయన ఆ స్వామికి చేసిన సంకీర్తనా అభిషేకాన్ని నేటికీ భక్తులు దర్శిస్తూనే ఉన్నారు. ఆ అభిషేక తీర్థాన్ని సేవించి తరిస్తూనే ఉన్నారు.

ఉగ్గుపాల కీర్తన .. ఊయల కీర్తన నుంచి పవళింపు సేవ వరకూ ఆయన రాసిన అన్ని కీర్తనలు కలియుగ దైవం పాదపద్మాలను కమనీయంగా పెనవేసుకుపోయాయి. ఆ దేవదేవుడి అంతరంగాన్ని అందంగా అల్లుకుపోయాయి. అందుకే యుగాంతం వరకూ అవి మోగుతూనే ఉంటాయి .. తరతరాలను దాటుకుని తన్మయత్వంతో సాగుతూనే ఉంటాయి. అన్నమయ్య ప్రతి కీర్తన అమృత ప్రవాహమే .. ఆ కీర్తనల్లోని పదాల్లో .. పాదాల్లో .. రాగాల్లో .. భావాల్లో ఆయన ఒదిగిపోయి కనిపిస్తూనే ఉంటాడు. మనసు మనసులో చేరి మధుర కీర్తనలను పలికిస్తూనే ఉంటాడు.

— పెద్దింటి గోపీకృష్ణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com