Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

న్యూ ఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) కొత్త డైరెక్టర్‌గా మహారాష్ట్ర కేడర్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి సుబోధ్‌ కుమార్‌ జైశ్వాల్‌ నియమితులయ్యారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సారథ్యంలో సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ, లోక్‌సభలో విపక్షనేత అధీర్‌రంజన్‌ చౌధురిలతో కూడిన త్రిసభ్య కమిటీ 109 మంది జాబితా నుంచి వడపోసి జైశ్వాల్‌ను ఎంపిక చేసింది. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ మంగళవారం తెలిపింది. ఫిబ్రవరిలో రిషికుమార్‌ శుక్లా పదవీ విరమణ చేయటంతో మూడునెలలుగా సీబీఐ పూర్తిస్థాయి డైరెక్టర్‌ లేకుండానే నడుస్తోంది.

సుదీర్ఘ అనుభవం

1962 సెప్టెంబర్‌ 22న జన్మించిన జైశ్వాల్‌(1985 బ్యాచ్‌ ఐపీఎస్‌) ప్రస్తుతం కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్‌ఎఫ్‌) డైరెక్టర్‌ జనరల్‌గా వ్యవహరిస్తున్నారు. కేంద్రంలో అత్యంత కీలకమైన రీసర్చ్‌ అండ్‌ అనాలిసిస్‌ వింగ్‌ (రా)లో కూడా జైశ్వాల్‌కు 9 సంవత్సరాల అనుభవం ఉంది. ఈ ఏడాది జనవరిలో డిప్యుటేషన్‌ మీద కేంద్ర సర్వీసులకు వచ్చారు. సీబీఐ డైరెక్టర్‌ పదవికి షార్ట్‌ లిస్టు చేసిన బిహార్‌ కేడర్‌కు చెందిన ఎస్‌ఎస్‌బీ డైరెక్టర్‌ జనరల్‌ కుమార్‌ రాజేష్‌చంద్ర, ఏపీ కేడర్‌ అధికారి వీఎస్‌కే కౌముదికంటే జైశ్వాలే అత్యంత సీనియర్‌ కావడంతో కేంద్ర ప్రభుత్వం ఆయన నియామకానికే మొగ్గు చూపింది. గతంలో ఆయన మహారాష్ట్ర డీజీపీగా, దేవేంద్ర ఫడణవీస్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముంబయి పోలీసు కమిషనర్‌గా పనిచేశారు. ఎస్‌పీజీ, ముంబయి యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌, మహారాష్ట్ర స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీం, స్టేట్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌లోనూ సేవలందించారు. అప్పట్లో సంచలనం సృష్టించిన తెల్గీ స్కామ్‌ను ఈయనే దర్యాప్తు చేశారు. మహారాష్ట్రలో వామపక్ష తీవ్రవాద ప్రభావం అధికంగా ఉన్న గడ్చిరోలి జిల్లాలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. వివాదాస్పద ఎల్గార్‌ పరిషద్‌, బీమా కోరెగావ్‌ కుట్ర కేసులను కూడా సీబీఐకి అప్పగించకముందు ఈయనే పర్యవేక్షించారు.

సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావించిన చీఫ్‌ జస్టిస్‌ రమణ

సుప్రీంకోర్టు గతంలో విధించిన ఓ నిబంధన సీబీఐ డైరెక్టర్‌ పదవికి ఇద్దరు అధికారులను దూరం చేసింది. మరో ఆరు నెలల్లోపు పదవీ విరమణ చేయబోయే అధికారుల పేర్లను ఈ పదవికి పరిశీలించకూడదని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు గురించి తాజాగా ప్రధానమంతి నేతృత్వంలో జరిగిన సీబీఐ డైరెక్టర్‌ ఎంపిక కమిటీ సమావేశంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ ప్రస్తావించారు. దాంతో జులై 31న పదవీ విరమణ చేయబోయే 1984 బ్యాచ్‌ గుజరాత్‌ కేడర్‌ ఐపీఎస్‌ అధికారి, సీబీఐ మాజీ స్పెషల్‌ డైరెక్టర్‌ రాకేష్‌ ఆస్థానా, ఈ నెలాఖరులోపు పదవీ విరమణ చేయబోయే అదే బ్యాచ్‌కు చెందిన అస్సాం-మేఘాలయ కేడర్‌కు చెందిన మరో ఐపీఎస్‌ అధికారి వైసీ మోదీల పేర్లను పక్కన పెట్టాల్సి వచ్చింది. ఇందులో వైసీ మోదీ ప్రస్తుతం ఎన్‌ఐఏ చీఫ్‌గా పనిచేస్తుండగా, రాకేష్‌ ఆస్థానా బీఎస్‌ఎఫ్‌కు నేతృత్వం వహిస్తున్నారు. ఇద్దరికీ గతంలో సీబీఐలో పనిచేసిన అనుభవం ఉంది. ఆరు నెలల నిబంధన కారణంగా వారిద్దరినీ పక్కన పెట్టడంతో సీనియారిటీ ప్రాతిపదికన అంతిమ లిస్ట్‌లో మహారాష్ట్ర మాజీ డైరెక్టర్‌ జనరల్‌ సుబోధ్‌ కుమార్‌ జైశ్వాల్‌, సశస్త్ర సీమా బల్‌ డైరెక్టర్‌ జనరల్‌ కుమార్‌ రాజేష్‌ చంద్ర, హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి వీఎస్‌కే కౌముది పేర్లకు చోటు దక్కింది.

సమావేశం ప్రారంభమైన తర్వాత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ- ‘ఆరునెలల నిబంధన’ను ప్రస్తావించారని, గతంలో జరిగిన ఇలాంటి సమావేశాల్లో ఎన్నడూ, ఎవ్వరూ గుర్తుచేయలేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఆరు నెలల లోపు సర్వీసు ఉన్నవారిని పోలీస్‌ చీఫ్‌ పోస్టులకు పరిగణలోకి తీసుకోకూడదని సుప్రీంకోర్టు చెప్పిందని, అందువల్ల ఎంపిక కమిటీ కచ్చితంగా దానికి కట్టుబడి ఉండాలని ఆయన అభిప్రాయపడినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆరునెలల కనీస పదవీకాల నిబంధనను తెరమీదికి తేవటం ద్వారా జస్టిస్‌ ఎన్‌వీరమణ- సీబీఐ డైరెక్టర్ల ఎంపికలో కొత్త సంప్రదాయాన్ని సృష్టించారన్న అభిప్రాయం ఐపీఎస్‌ అధికారుల్లో వ్యక్తమవుతోంది.

సుప్రీంకోర్టు గతంలో ప్రకాశ్‌సింగ్‌ కేసులో ఇచ్చిన తీర్పులో డీజీపీల పదవీకాలం గురించి చెప్పింది. వినీత్‌ నారాయణ్‌ తీర్పులో సీబీఐ, సీవీసీ, లోక్‌పాల్‌ చట్టాల కింద చేపట్టే నియామకాల గురించి స్పష్టత ఇచ్చింది. జస్టిస్‌ ఎన్‌వీ రమణ సూచనకు ప్రాధాన్యం ఇచ్చిన నేపథ్యంలో ఈ ఆరునెలల కనీస పదవీకాల నిబంధన ఐబీ, రా చీఫ్‌ల నియామకాలకూ వర్తిస్తుందని సీనియర్‌ అధికారులు పేర్కొంటున్నారు. సీబీఐ, ఐబీ, రా చీఫ్‌లకు రెండేళ్ల కనీస పదవీకాలం ఉండాలన్న నిబంధన ఉన్నప్పటికీ, వారి నియామకాల సమయంలో కనీసం ఆరు నెలల సర్వీసు ఉండాలన్న నిబంధనను అనుసరించలేదని అధికారవర్గాలు పేర్కొన్నాయి. ఇప్పుడు జస్టిస్‌ ఎన్‌వీ రమణ సూచనతో అది తెరమీదికి వచ్చిందని అభిప్రాయపడ్డాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com