Mini Review: సంతోష శోభన్ – మాళవిక నాయర్ జంటగా నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘అన్నీ మంచి శకునములే’ సినిమా నిన్ననే థియేటర్లకు వచ్చింది. స్వప్న సినిమా బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ సంగీతాన్ని సమకూర్చాడు. ప్రేమకథలను కుటుంబ సభ్యుల మధ్య గల అనుబంధంతో కలిపి చెప్పడం నందినీ రెడ్డి ప్రత్యేకత. అలాగే ఈ సినిమా కూడా ఉంటుందని థియేటర్ కి వెళ్లిన ప్రేక్షకులకు నిరాశే ఎదురవుతుంది.
ఈ కథలోని హీరో .. హీరోయిన్ ఒకే హాస్పిటల్లో .. ఒకే సమయంలో పుడతారు. ఒక కాఫీ ఎస్టేట్ కి సంబంధించిన ఆస్తుల విషయంలో గొడవలు పడి, పూర్వీకుల నుంచి కోర్టుల చుట్టూ తిరుగుతున్న రెండు కుటుంబాలలో హీరో .. హీరోయిన్ పుడతారు. అయితే ఒక తాగుబోతు లేడీ డాక్టర్ చేసిన పొరపాటు కారణంగా పురిటిలోనే పిల్లలు మారిపోతారు. ఒకరింట్లో మరొకరు పెరుగుతారు. స్కూల్ రోజుల నుంచి ఆ ఇద్దరూ ప్రేమలో పడతారు. అప్పటి నుంచి వాళ్ల మధ్య కూడా అలకలు .. గొడవలు మామూలే.
ఇలా ఆస్తుల గొడవలు .. పురిటిలోనే పిల్లలు మారిపోవడం .. వాళ్ల ప్రేమలో అలకలు .. ఒకరిని ఒకరు ఉడికించడం .. వీటిలో ప్రేక్షకులు ఇంతకుముందు చూడనివి ఏవి? ఒకవేళ కథ పాతదే అయినా ట్రీట్మెంట్ కొత్తగా ఉండాలి. స్క్రీన్ ప్లేతో మేజిక్ చేయాలి. ఇలాంటివేమీ ఈ సినిమా విషయంలో జరగలేదు. ఆల్రెడీ ఒకసారి చూసేసిన సినిమానే మళ్లీ చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. క్వాలిటీ పరంగా .. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం పరంగా వంకబెట్టవలసిన అవసరం లేదు. ఎటొచ్చి అసలు కథనే అసలు సమస్య. బలమైన ఆర్టిస్టులు బలహీనమైన పాత్రలలో కనిపించడం ప్రేక్షకులకు కలిగే మరో అసంతృప్తి.