ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. 2021-22 వార్షిక బడ్జెట్ తో పాటు ఏడు బిల్లులను సభ ఆమోదించింది. నేటి ఉదయం సభ సమావేశం కాగానే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వర్చువల్ పద్ధతిలో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. అనతరం సభ వాయిదా పడింది. బిఏసి సమావేశం జరిగింది. ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో ఈ ఒక్కరోజే సభను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
తిరిగి సభ సమావేశం కాగానే రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ను…. తరువాత వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అనంతరం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీరానంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడారు. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ కు సభ ధన్యవాదాలు తెలిపింది.
బడ్జెట్ తో పాటు మరో ఏడు బిల్లులను కూడా సభ ఏ విధమైన చర్చా లేకుండానే ఆమోదించింది. అనంతరం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ సభ ఏకగ్రీవ తీర్మానం చేసింది. కర్నూల్ సమీపంలోని ఓర్వకల్ లో నిర్మించిన ఏర్ పోర్ట్ కు తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పేరు పెట్టాలని పౌర విమాన యాన శాఖను కోరుతూ మరో తీర్మానాన్ని చేసింది. తరువాత స్పీకర్ తమ్మినేని సీతారాం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.