అమరావతి రాజధాని అసైన్డ్ భూముల కుంభకోణం కేసులో సీఐడీ విచారణ వేగవంతం చేసింది. నేడు ఐదుగురిని అదుపులోకి తీసుకుంది. కొల్లి శివరాం, గట్టెం వెంకటేష్, చిక్కాల విజయసారథి, బడే ఆంజనేయలు, కొట్టి దొరబాబు అరెస్టు చేసింది. 1100 ఎకరాల అసైన్డ్‌భూముల వ్యవహారంలో అక్రమాలు జరిగాయని అభియోగం నమోదైంది. ఇందులో 169.27 ఎకరాలకు సంబంధించిన విచారణలో వీరిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసులో మాజీ మంత్రి నారాయణ ప్రధాన ముద్దాయిగా ఉన్నారు. గత వారమే ఈ కేసులో నారాయణ హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. అనంతవరం, కృష్ణాయపాలెం, కూరగల్లు, లింగాయపాలెం, మందడం, నెక్కల్లు, నవులూరు, రాయపూడి, తుళ్లూరు, ఉద్దండరాయుని పాలెం, వెంటకపాలెం గ్రామాల్లో వేర్వేరు సర్వే నంబర్లలో సుమారు 89.8 ఎకరాల భూమిని మాజీ మంత్రి నారాయణ తన బంధువులు, పరిచయస్తుల పేరుతో అక్రమంగా కొనుగోలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
రామకృష్ణా హౌసింగ్ డైరెక్టర్ ఖాతాలద్వారా పేమెంట్లు చేసి ఈ వ్యవహారాలు చేశారని సిఐడి నిర్ధారించింది. ఈ కేసులో ఇతర నిందితులు, వారి తరఫు మనుషులు మరో 79.45 ఎకరాల అసైన్డ్ ల్యాండ్స్‌ను అక్రమంగా కొనుగోలు చేశారని వెల్లడైంది. ఈ వ్యవహారానికి సంబంధించి మాజీ మంత్రి నారాయణ – రామకృష్ణా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య రూ.15 కోట్ల లావాదేవీలు జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయినట్లు సిఐడి వర్గాలు వెల్లడించాయి.
Also Read : అమరావతి స్కాంలో ఐఏఎస్ లు: ఆర్కే