Sunday, January 19, 2025
HomeTrending Newsప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయండి: సిఎం ఆదేశం

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయండి: సిఎం ఆదేశం

alternative plan: కోర్టు వివాదాల్లో ఉన్న ఇళ్ల స్థలాల విషయంలో వెంటనే ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కేసుల పరిష్కారం ఆలస్యమయ్యే పరిస్థితి ఉన్న చోట వేరేచోట్ల స్థలాలను గుర్తించే కార్యక్రమం చేపట్టాలని సూచించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో హౌసింగ్‌పై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు.

కోర్టు వివాదాలు తీరడంతో విశాఖలో 1.43 లక్షల మందికి పట్టాలు ఇచ్చేందుకు సర్వం సిద్ధం చేశామని,  పంపిణీ పూర్తికాగానే వాటికి సంబంధించిన ఇళ్ల నిర్మాణ పనులు జూన్‌నాటికి ప్రారంభం అవుతాయని అధికారులు వెల్లడించారు. దాదాపు 63 లే అవుట్లలో ఇళ్ల నిర్మాణంకోసం చర్యలు చేపడుతున్నామన్నారు. ఇళ్లకు ఇచ్చే కరెంటు సామగ్రి బల్బులు, ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు అన్నీకూడా నాణ్యతతో ఉండాలని, లేకపోతే చర్యలు తప్పవని సిఎం హెచ్చరించారు.  పేదల ఇళ్ల నిర్మాణంలో చురుగ్గా పాలుపంచుకుంటున్న ప్రజాప్రతినిధులను సత్కరించాలని సమావేశంలో నిర్ణయించారు. మండలానికి ఒక సర్పంచ్‌ని, మున్సిపాల్టీకి ఒక కౌన్సిలర్, జిల్లాకు ఒక ఎంపీపీ, జిల్లాకు ఒక జడ్పీటీసీ చొప్పున అవార్డులు ఇవ్వాలని తీర్మానించారు. జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే నాటికి తాగునీరు, డ్రైనేజీ, కరెంటు లాంటి కనీస మౌలిక సదుపాయాలు ఉండాలని సీఎం ఆదేశించారు.

ఇళ్లపట్టాలు కోసం చేసిన ఖర్చు కాకుండా కేవలం నిర్మాణం కోసమే గడచిన ఆర్థిక సంవత్సంలో సుమారు రూ.3,600 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేశామని, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.13,105 కోట్లు గృహ నిర్మాణం కోసం ఖర్చు బోతోందని అధికారులు వివరించారు.  ఈ ఏడాది 35 లక్షల మెట్రిక్‌ టన్నుల సిమెంటు, 3.46 లక్షల మెట్రిక్‌టన్నుల స్టీల్‌ను ఇళ్ల నిర్మాణం కోసం వినియోగించనున్నట్లు సమావేశంలో తెలిపారు.

జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకాన్ని ఇప్పటివరకూ 10.2 లక్షలమంది వినియోగించుకున్నారని, వీరిలో 6.15 లక్షల మందికి రిజిస్ట్రేషన్‌ పూత్రయిందని అధికారులు తెలిపారు. పట్టణాలు, నగరాలు ఉన్న 116 నియోజకవర్గాల్లో ఎంఐజీ ప్లాట్ల పథకానికి ముందు ప్రాధాన్యత ఇవ్వాలని సిఎం సూచించారు.  ఇప్పటికే 41 నియోజకవర్గాల్లో 4127.5 ఎకరాల భూములను గుర్తించామని తెలిపిన అధికారులు.

ఈ సమీక్షా సమావేశంలో ఎనర్జీ, అటవీ, పర్యావరణ, భూగర్భ గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, గృహనిర్మాణశాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, ఎనర్జీ సెక్రటరీ బి శ్రీధర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Also Read : ఓటీఎస్‌ లబ్ధిదారులకు మరింత మేలు

RELATED ARTICLES

Most Popular

న్యూస్