Ap Cm Conducted Video Conference With Cyclone Affected District Oficials :
భారీ వర్షాల దృష్ట్యా తమిళనాడు సరిహద్దు జిల్లాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనావేస్తూ వివరాలను ఎప్పటికప్పుడు పంపాలని సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు, తాము నిరంతరం ఫోన్‌కాల్‌కు అందుబాటులో ఉంటామని, ఎలాంటి సహాయం కావాలన్నా వెంటనే తెలియజేయాలని సూచించారు. నెల్లూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు, అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇప్పటికే నెల్లూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాలకు రెండేసి చొప్పున ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయని తెలిపారు. మంగళగిరిలో కూడా అదనపు బృందాలను సిద్ధంచేశామన్నారు. పరిస్థితులను బట్టి వారి సేవలను వినియోగించుకోవచ్చని సూచించారు
భారీ వర్షాలపై ప్రకాశం, ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు, చిత్తూరు, వైయస్సార్ కడప జిల్లాల కలెక్టర్లు, అధికారులతో క్యాంపు కార్యాలయం నుంచి సీఎంవీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు, వాతావరణ శాఖ అధికారులు కూడా ఈ సమీక్షలో పాల్గొన్నారు. వాతావరణ పరిస్థితులు, భారీ వర్షాలపై వాతావరణశాఖ అధికారులనుంచి సమాచారం తీసుకున్న జగన్ తదనుగుణంగా జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు.
ఈ సాయంత్రం చెన్నై వద్ద వాయుగుండం తీరం దాటుతుందని. ప్రస్తుతం చెన్నై ప్రాంతంలో 60–70 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నాయని, ఎస్‌పిఎస్‌ఆర్ నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, వైయస్సార్ కడప జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయని అధికారులు తెలిపారు. వ బంగాళాఖాతంలో ఏర్పడ్డ మరో అల్పపీడనం తుపానుగా మారి దక్షిణకోస్తాంధ్రాలో తీరందాటే అవకాశాలు ఉన్నాయని అధికారులు సిఎం దృష్టికి తెచ్చారు. ఈనెల 17న ఈ అల్ప పీడనం తీరం దాటే అవకాశాలున్నాయని ప్రాథమిక అంచనాగా ఉందని అధికారులు వివరించారు. దీనివల్ల దక్షిణ కోస్తాంధ్రలో మరో విడత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
వాతావరణ అధికారుల సమాచారం మేరకు తడ, సూళ్లూరుపేట, మరికొన్ని ప్రాంతాల్లో 20 సెం.మీ కన్నా ఎక్కువ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని సిఎం జగన్ అధికారులను అప్రమత్తం చేశారు. సహాయ పునారావాస కేంద్రాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై కూడా సిఎం జగన్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
Also Read : తమిళనాడు, ఏపీల్లో రేపటి నుంచి భారీ వర్షాలు