రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారుల్లో చాలామంది అత్యంత సాధారణమైన నేపధ్యం నుంచే వచ్చారని, వారి నుంచి స్ఫూర్తి పొంది, ఎస్సీ, ఎస్టీ గురుకులాల విద్యార్ధులు కూడా ఆ స్థాయికి చేరుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. ప్రభుత్వ ఎస్టీ, ఎస్సీ గురుకులాల్లో చదువుతూ ఐఐటీలో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులు క్యాంపు కార్యాలయంలో సిఎం జగన్ ను కలుసుకున్నారు. వారికి సిఎం ల్యాప్ టాప్ లు బహూకరించారు.
ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ విద్యారంగం మీద ప్రభుత్వం చూపించే శ్రద్ధ, ధ్యాస పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతుందని అభిప్రాయపడ్డారు. అమ్మ-ఒడి, నాడు-నేడు సహా అనేక కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందన్నారు. “మీ ముందే ఇద్దరు ఐఏఎస్ అధికారులు కాంతిలాల్ దండే, సునీతలు ఇద్దరూ మాట్లాడారు. వీళ్లుకూడా మీలాంటి వాళ్లే. షెడ్యూల్ కులాలకు చెందినవారు… ఐఏఎస్ అధికారులు అయ్యారు. మీరంతా కూడా వీరి నుంచి స్ఫూర్తి పొందాలి. ఇది అసాధ్యం కానేకాదు. ఐఐటీ వరకూ మీరు చేరుకోగలిగారు. ఇది దాటితే.. ప్రపంచం మీకు మెరుగైన అవకాశాల రూపంలో ద్వారాలు తెరుస్తుంది. ఆ ప్రపంచంలో ఇప్పటికే మీరు ఒక స్థాయికి చేరుకున్నారు. మొట్టమొదటి అడుగు వేసినట్టే భావించండి” అని సిఎం విద్యార్థులనుద్దేశించి అన్నారు. బాగా కష్టపడుతున్నారని, బాగా చదవగలుగుతున్నారని, దీన్ని ఇలాగే కొనసాగిస్తే, దృష్టి కేంద్రీకరిస్తే.. కచ్చితంగా ఈ ఐఏఎస్‌ల స్థానాల్లో కూర్చుంటారన్నారు.
ఐఏఎస్‌ల్లో చాలామంది నేపథ్యాలు అత్యంత సాధారణమైనవని, సీఎంఓలో అదనపు కార్యదర్శిగా ఉన్న ముత్యాలరాజే దీనికి ఉదాహరణ అంటూ ఆయన్ను పరిచయం చేశారు. “ఇదంతా మీకు మంచి స్ఫూర్తినిస్తుంది. ముత్యాలరాజు జీవితం… హృదయాలను కదిలిస్తుంది. వాళ్ల ఊరికి పోవాలంటే బోటులో పోవాలి. మనకు స్ఫూర్తినిచ్చే కథలు ఎక్కడో లేవు… ఇదే గదిలో ముగ్గురు ఐఏఎస్ అధికారుల రూపంలో ఉన్నాయి. మీరు ఇదే కృషి కొనసాగిస్తే.. కచ్చితంగా మీరు ఈ స్థాయికి చేరుకుంటారు. నా పక్కనున్న స్థానాల్లో మీరుకూడా కనిపిస్తారు.’’ అని సీఎం అన్నారు.
ముత్యాలరాజు మీకు అందుబాటులో ఉంటారని, ఫోన్ నంబరు ఇస్తారని, ఎప్పుడు అవసరమున్నా, ఏం కావాలన్నా సహాయంగా నిలుస్తారంటూ విద్యార్థులకు భరోసానిచ్చారు. ఎలాంటి క్లిష్ట పరిస్థితులున్నా నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం, ప్రభుత్వం మీకు అండగా ఉంటుందన్నారు. ఈ అధికారులంతా మీ స్థాయినుంచే వచ్చారు కాబట్టి, ఎలాంటి సమస్యలు వస్తాయి? వాటిని ఎలా పరిష్కరించాలి? ఏరకంగా మీకు తోడుగా నిలవాలనే విషయాలు వీరికి బాగా తెలుసని సీఎం వారికి చెప్పారు.
గిరిజన ప్రాంతాలనుంచి, అలాగే కర్నూలులోని ఎమ్మిగనూరు లాంటి ప్రాంతాలనుంచి ఐఐటీలు సాధించారంటే ఇది నిజంగా గర్వించదగ్గ విషయమంటూ విద్యార్థుల ప్రతిభను సీఎం కొనియాడారు. “పాదయాత్ర చేసినప్పుడు కూడా కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని ఎంత వెనకబడి ఉన్నాయో చూశాను. వెనకబడ్డ ప్రాంతాల్లో ఇది ఒకటి. అలాంటి ప్రాంతం నుంచి కూడా ఇద్దరు, ముగ్గురు కలెక్టర్లు వస్తే మొత్తం వ్యవస్థే అక్కడ మారిపోతుంది. అక్కడి ప్రజల ఆశలు, ఆకాంక్షలు పెరుగుతాయి. పెద్ద పెద్ద చదువులు చదవాలన్న తపన పెరుగుతుంది. మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని, మార్గదర్శకంగా భావించి ఇంకా కొంతమంది మెరుగైన చదువులు చదివే పరిస్థితి వస్తుంది. మొత్తం మార్పే కనిపిస్తుంది. ఇది జరగాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నాను” అంటూ సిఎం ఉద్బోధించారు. మిమ్మల్ని అభినందిస్తూ ప్రభుత్వం తరఫు నుంచి మీకు ల్యాప్‌టాప్స్ కూడా అందించాం. మీరు ఇంకా పై స్థానంలోకి వెళ్లాలని సిఎం ఆకాంక్షించారు.
రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ, గిరిజన గురుకులాలనుంచి ఇప్పటివరకూ 179 మంది వివిధ ఐఐటీలు, ఐఐటీల్లో ప్రిపరేటరీ కోర్సులు, ఎన్‌ఐటీలు, ఐఐఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో సీట్లు సాధించారు. ఎస్టీ విద్యార్థుల్లో 9 మంది ఐఐటీలకు ఎంపికకాగా, 21 మంది ప్రిపరేటరీ కోర్సులకు, 59 మంది ఎన్‌ఐటీ, ఐఐఐటీ, ఇతర కేంద్ర విద్యాసంస్థలకు ఎంపికయ్యారు.
ఎస్సీలనుంచి 13 మంది ఐఐటీలకు, 34 మంది ప్రిపరేటరీ కోర్సులకు, 43 ఎన్‌ఐటీ, ఐఐఐటీ, కేంద్ర విద్యాసంస్థలకు ఎంపికయ్యారు. ఇంకా కౌన్సిలింగ్ జరుగుతున్నందన మరింతమందికి ర్యాంకులు వచ్చే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. వీటితోపాటు ఇంకా నీట్, ఇతర వైద్య సంస్థల ఫలితాలు వెల్లడి కావాల్సి ఉందని, వీటిలో కూడా ర్యాంకులు సాధిస్తారని అధికారులు వెల్లడించారు.