Ap Cm Jagan To Meet Odisha Cm On November 9th At Bhuvaneshwar :
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 9న ఓడిశా రాజధాని భువనేశ్వర్ లో పర్యటించనున్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో జగన్ భేటీ కానున్నారు.
ఈ సమావేశంలో….
పోలవరం ప్రాజెక్టుపై ఓడిశా వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలు
ఆంధ్ర ప్రదేశ్ – ఓడిశా సరిహద్దులోని కోటియా ప్రాంతానికి చెందిన 21 గ్రామాలు, అక్కడి ప్రజల ఆందోళనలు
వంశధారపై ట్రైబ్యునల్ తీర్పు- నేరడి వద్ద వంశధారపై బ్యారేజీ నిర్మాణం
ఏపీ- ఓడిశా సరిహద్దు గ్రామాల్లో గంజాయి సాగు అరికట్టడం…
లాంటి అంశాలపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించే అవకాశం ఉంది. సమావేశంలో తీసుకోబోయే నిర్ణయాలపై అవసరమైతే వెంటనే ఒప్పందాలు కుదుర్చుకోవడానికి వీలుగా ఉన్నతాధికారులు, అధికార యంత్రాంగం కూడా ఈ సిఎంల భేటీలో పాల్గొంటుందని తెలియవచ్చింది.
నేరడి వద్ద బ్యారేజీ నిర్మాణానికి అనుమతి మంజూరు చేస్తూ జూన్ 21, 2021న వశదార ట్రిబ్యునల్ తీర్పు చెప్పింది. ఏపీ అవసరాలకోసం 8వేల క్యూసెక్కుల సామర్థ్యంతో కుడి స్లూయిస్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనితో పాటుగా ఒడిశా అవసరాలకోసం ఎడమవైపున కూడా స్లూయిస్ నిర్మాణానికి ట్రైబ్యునల్ ఒకే చెప్పింది. ఎంత సామర్థ్యంతో ఎడమ స్లూయిస్ కావాలో గెజిట్ విడుదల చేసిన 6 నెలల్లోపు ఏపీకి ఒడిశా తెలియజేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఎడమ స్లూయిస్‌కోసం అయ్యే ఖర్చును ఒడిశా భరించాలన్న ట్రైబ్యునల్, జూన్ నుంచి నవంబర్ వరకూ నీటిని తరలించు కునేందుకు ఏపీకి అనుమతిచ్చింది. నేరడి బ్యారేజీ కోసం ఒడిశాలో ముంపునకు గురవుతున్న 106 ఎకరాల భూమిని ఒడిశా సేకరించి ఇవ్వాలని, దీనికోసం అయ్యే ఖర్చును ఏపీ భరించాలని తీర్పులో పేర్కొంది. తీర్పును అమలు చేసేందుకు అంతర్‌రాష్ట్ర నియంత్రణ కమిటీని ఏర్పాటుచేయాలంటూ సూచించింది.
ఈ తీర్పు దృష్ట్యా ఓడిశా ప్రభుత్వంతో చర్చలు జరపాలని సిఎం జగన్ నిర్ణయించారు. ఈ మేరకు ఓడిశా సిఎం కు లేఖ రాశారు. అయితే కరోనా, తదనంతర పరిణామాలతో ఈ భేటీ ఆలస్యమైంది. చివరకు ఈనెల 9న ఇద్దరు ముఖ్యమంత్రులూ సమావేశమై వంశధార తీర్పుతో పాటు పలు కీలక అంశాలపై చర్చలు జరపనున్నారు.
Must Read :కొళాయిల్లో శుద్ధ జలం