ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూలై 14న పోలవరం ప్రాజెక్టును సందర్శించ నున్నారు. ప్రాజెక్టు పనుల పురోగతిని క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్నారు. అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ప్రాజెక్టు సహాయ, పునరావాస పనులపై కూడా సిఎం అరా తీయనున్నారు. 14న ఉదయం పది గంటలకే అయన ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారని అధికార వర్గాలు వెల్లడించాయి. సిఎం తన సమీక్ష సందర్భంగా కాపర్ డ్యాం పనులు ఎప్పటిలోగా పూర్తి చేస్తారనేదానిపై నిర్మాణ సంస్థ ప్రతినిధులను అడిగి తెలుసుకుంటారు.
జూన్ 12న పోలవరం అప్రోచ్ ఛానల్ గుండా స్పిల్ వేకు నీరు మళ్లింపును శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలతో నిర్వహించారు. గోదావరిలో నీటిని అప్రోచ్ కెనాల్‌కు విడుదల చేయడం ద్వారా ఆ నీరు స్పిల్ వే.. రివర్ స్లూయిజ్ గేట్ల ద్వారా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్‌కు చేరి అక్కడి నుంచి మధ్య డెల్టాతో పాటు తూర్పు.. పశ్చిమ కాల్వల ద్వారా గోదావరి డెల్టా మొత్తాన్ని సస్య శ్యామలం చేస్తుంది.
పశ్చిమ గోదావరి జిల్లా యంత్రాంగం సిఎం పర్యటన ఏర్పాట్లు ప్రారంభించింది. జూన్ 2న నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ పోలవరం సందర్శించారు, అనంతరం జూన్ ౩౦న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వ చీఫ్ విప్, విప్ లు, ఎమ్మెల్యేలు ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఇటీవల ఏపి, తెలంగాణా రాష్ట్రాల మధ్య కృష్ణా నీటి వివాదం తలెత్తిన నేపధ్యంలో సిఎం జగన్ పోలవరం పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.