తిరుపతిలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ (ఎన్‌ఎఫ్‌ఎస్‌యు) ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర హోం శాఖ అమిత్ షాకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సిఎం నేడు ఉదయం అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చి వాటి పరిష్కారానికి కృషి చేయాల్సిందిగా కోరారు.
నిన్న ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్రయాదవ్‌కు విన్నవించిన అంశాల సహా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ఆయనతో చర్చించారు.
ప్రపంచ స్ధాయి విద్యను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్ కేంద్రంగా నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడంతో పాటు ఢిల్లీ, గోవా, త్రిపురలలో క్యాంపస్‌లు కూడా స్ధాపించిన విషయాన్ని గుర్తు చేస్తూ జాతీయ ప్రాముఖ్యత దృష్ట్యా ఫోరెన్సిక్ సైన్స్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్, సెక్యూరిటీ బిహేవియరల్ సైన్స్ మరియు క్రిమినాలజీ రంగాల్లో పరిశోధనలు నిర్వహిస్తూ ఫోరెన్సిక్ నిపుణుల కోసం పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఉన్న కొరతను సైతం తీరుస్తూ… కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా క్రిమినల్ జస్టిస్ ఇనిస్టిట్యూట్‌లను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టిందని సిఎం జగన్ అన్నారు. ఈ నేపధ్యంలో దక్షిణ భారత దేశంలో ఫోరెన్సిక్ రంగంలో సేవలందించే అటువంటి సంస్ధ లేని లోటు, దానిని ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను కేంద్ర మంత్రికి వివరించారు.
అందులో భాగంగా ఇప్పటికే ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంటూ, విద్యారంగంలోనూ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తిరుపతిలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ క్యాంపస్ ఏర్పాటు అంశాన్ని పరిశీలంచాలని కేంద్ర హోంమంత్రిని సిఎం కోరారు. ఈ యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన భూమిని ఉచితంగా అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
కోవిడ్ సంనద్ధత, విభజన హామీలు, కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు, పోలవరం ప్రాజెక్టు, తెలంగాణ డిస్కంల నుంచి రావాల్సిన రూ.6,886 కోట్ల కరెంటు బకాయిలు, జాతీయ ఆహార భద్రతా చట్టంలో నిబంధనల వల్ల రాష్ట్రానికి జరిగిన అన్యాయం, ప్రత్యేక హోదా, కొత్త జిల్లాలకు మెడికల్ కాలేజీలు, కడప స్టీల్ ప్లాంట్, విశాఖ మెట్రో రైల్, రాయలసీమ లిఫ్ట్‌ఇరిగేషన్ స్కీమ్, పాలమూరు ఎత్తిపోతల, భావనపాడు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు అనుమతులు… తదితర అంశాలపై అమిత్ షాకు జగన్ విజ్ఞాపన పత్రం అందించారు.