Monday, January 20, 2025
HomeTrending Newsచిరుధాన్యాల వినియోగం పెర‌గాలి: కోల‌గ‌ట్ల

చిరుధాన్యాల వినియోగం పెర‌గాలి: కోల‌గ‌ట్ల

మ‌న ఆరోగ్యం కోసం ఆహారంలో చిరుధాన్యాల వినియోగాన్నిపెంచాల‌ని, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి కోలగట్ల వీరభద్ర స్వామి కోరారు. చిరుధాన్యాల వినియోగాన్ని పెంచి, త‌ద్వారా పోషకాహార లోప రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న‌ అధికార యంత్రాంగాన్ని ఆయ‌న అభినందించారు. ఈ నెల 21,22 తేదీల్లో జ‌ర‌గ‌నున్న చిరుధాన్యాల మ‌హోత్స‌వంలో భాగంగా, ప్ర‌జ‌ల్లో చిరుధాన్యాల వినియోగం ప‌ట్ల అవ‌గాహ‌న పెంచేందుకు, ఎపిఎఫ్‌పిఎస్ ఆధ్వ‌ర్యంలో విజయనగరం ప‌ట్ట‌ణంలోని ఆర్‌టిసి కాంప్లెక్స్ నుంచి ఆనంద‌గ‌జ‌ప‌తి ఆడిటోరియం వ‌ర‌కు 2 కిలోమీట‌ర్ల ర‌న్‌ను శుక్ర‌వారం నిర్వ‌హించారు. ఈ ర‌న్‌ను కాంప్లెక్స్ వ‌ద్ద కోల‌గ‌ట్ల ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా  వీర‌భ‌ద్ర‌స్వామి మాట్లాడుతూ, చిరుధాన్యాలతో కూడిన ఆహార పదార్థాల వినియోగం, దాని ద్వారా కలిగే ప్రయోజనాలు, పిల్లలలో రక్తహీనత తగ్గించడమే లక్ష్యంగా మిల్లెట్స్‌ ఫుడ్ ఫెస్టివల్ ను నిర్వహించడం అభినందనీయం అని అన్నారు. గ‌త కొన్నేళ్లుగా చిరుధాన్యాల వాడ‌కం త‌గ్గింద‌ని, దీనివల్ల అనారోగ్యం బారిన పడుతున్న‌వారి సంఖ్య పెరిగింద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. చిరుధాన్యాల వాడ‌కాన్ని పెంచాల్సిన ఆవ‌శ్య‌క‌త ఎంతైనా ఉంద‌న్నారు. జ‌గ‌న‌న్న గోరుముద్ద, వైఎస్ఆర్ సంపూర్ణ పోష‌ణ త‌దిత‌ర‌ కార్య‌క్ర‌మాల‌ ద్వారా ప్ర‌భుత్వం ఒకవైపు పిల్లలు, గర్భిణీలు, బాలింత‌ల‌కు మంచి పోషకాహారాన్ని అందించడమే కాకుండా, మరోవైపు చిరుధాన్యాల ఆవశ్యకతను రైతులకు తెలియజేయాలన్న లక్ష్యంతో ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం శుభ పరిణామంగా పేర్కొన్నారు.

చిరుధాన్యాలు, వాటి ద్వారా చేకూరే ప్రయోజనాలతో పాటు సాగుకు అనువైన భూములు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రైతులకు క‌లిగే లాభాలు వంటి అంశాలప‌ట్ల రైతుల‌కు, ప్ర‌జ‌ల‌కు మ‌రింత అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని సూచించారు. ఆరోగ్యకరమైన సమాజాన్ని అందించాలని లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు కృత నిశ్చయంతో ఉందని ఆయ‌న కోల‌గ‌ట్ల స్ప‌ష్టం చేశారు. జిల్లాప‌రిష‌త్ ఛైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్