Sunday, November 24, 2024
HomeTrending NewsPerni Nani: పచ్చ పువ్వుల చెప్పుడు మాటలు వినొద్దు: పేర్ని సలహా

Perni Nani: పచ్చ పువ్వుల చెప్పుడు మాటలు వినొద్దు: పేర్ని సలహా

మనసు చంద్రబాబుతో, మనువు బిజెపితో ఉన్న సిఎం రమేష్, సుజనా చౌదరి, సత్యకుమార్ లాంటి నేతలు చెప్పే మాయ మాటలు విని విమర్శలు చేయడం తగదని బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు మాజీ మంత్రి పేర్ని నాని సూచించారు. నిన్న శ్రీకాళహస్తిలో జరిగిన సభలో జగన్ ప్రభుత్వంపై నడ్డా చేసిన విమర్శలపై నాని తీవ్రంగా స్పందించారు. విశాఖ ప్లాంట్ ను అమ్మకానికి పెట్టి దానికి సంబంధించిన అత్యంత విలువైన భూముల కోసం జరుగుతున్నది ల్యాండ్ స్కామ్ అవుతుందని, దీనికి ఎవరు సమాధానం చెబుతారని సూటిగా నిలదీశారు. గతంలో అమరావతిలో భూ కుంభకోణం జరిగిందని ఆరోపించి, ఈ భూ ఆక్రమణలపై విచారణ జరిపిస్తామని, కర్నూలులో హైకోర్టు పెడతామని 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన బిజెపి నేతలు ఇప్పుడెందుకు అమరావతిని సమర్ధిస్తున్నారో, టిడిపి పాట ఎందుకు పాడుతున్నారో అయోధ్య రాముడికే తెలియాలని ఎద్దేవా చేశారు. ఢిల్లీ నుంచి ఇక్కడకు వచ్చి ఎవరో ఏదో చెబితే దాన్ని బట్టీ పట్టి చెప్పడం కాదని, నడ్డాకు చేతనైతే జాతీయ స్థాయిలో వివిధ పార్టీలు చేస్తున్న విమర్శలకు సమాధానం చెప్పాలన్నారు. పచ్చపువ్వుల చెప్పుడు  మాటలు విని ఏదో మాట్లాడడం సరికాదన్నారు. తాడేపల్లిలోని వైఎస్సర్సీపీ కేంద్ర కార్యాలయంలో పేర్ని మీడియాతో మాట్లాడారు. బిజెపి-టిడిపి మధ్య కుదిరిన చీకటి ఒప్పందం ఏమిటో బైటపెట్టాలని డిమాండ్ చేశారు.

గతంలో టిడిపి-బిజెపి ఉమ్మడి ప్రభుత్వ హయంలో ఢిల్లీకి చెందిన ఓ కంపెనీకి ఏపీలోని మద్యం అమ్మకాల్లో 80 శాతం కట్టబెట్టారని, ఇది ఎవరికోసం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.  ప్రస్తుతం ప్రభుత్వానికి ఇసుకపై ఏటా నాలుగు వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తోందని, గత టిడిపి ప్రభుత్వంలో ఈ డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయని నాని ప్రశ్నించారు.

లంచాలను ఏమాత్రం తావులేకుండా ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా 2 లక్షల 16 వేల కోట్ల రూపాయలను లబ్దిదారుల ఖాతాల్లో జమ చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు పేర్ని. బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఏ ఒక్క చోటైనా ఇలా పేద, మధ్య తరగతి వర్గాలను ఆదుకున్నారా అనేది చెప్పాలన్నారు. పచ్చపూలతో నిండిపోయిన ఏపీ బిజెపి… టిజేపిగా మారిందన్నారు.

ఏపీ రాష్ట్రంపై హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై కూడా నాని తనదైన శైలిలో బదులిచ్చారు. 2018లో గెలిచిన తరువాత హరీష్ రావును ఎందుకు పక్కన పెట్టారో చెప్పాలని అడిగారు. కాంగ్రెస్ తో హరీష్ లోపాయికారీ ఒప్పందం చేసుకున్న విషయం తెలిసినందునే కొన్నాళ్ళు కెసిఆర్ అతన్ని దగ్గరకు రానీయలేదని మండిపడ్డారు. తమ ప్రభుత్వానికి హరీష్ రావు సలహాలు అక్కరలేదన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్