తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి ఉపశమనం లభించింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న బాబుకు ఆరోగ్య సమస్యల దృష్ట్యా నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు చెప్పింది.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో సెప్టెంబర్ 8న చంద్రబాబును ఏపీ సిఐడి అరెస్ట్ చేసింది. 9న విజయవాడ లోని సిబిఐ కోర్టు ఎదుట హాజరుపరచగా తొలుత 14 రోజులపాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. చంద్రబాబుకు 17(ఏ) వర్తిస్తుంది కాబట్టి సిఐడి దాఖలు చేసిన రిమాండ్ చెల్లదని, దీన్ని క్వాష్ చేయాలని బాబు తరఫు న్యాయవాదులు ఏపీ హైకోర్టు, సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఏపీ హైకోర్టు ఈ పిటిషన్ ను కొట్టివేయగా సుప్రీం కోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. ప్రస్తుతం తీర్పు పెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే.
స్కిల్ కేసులో బాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని న్యాయవాదులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై తదుపరి విచారణను బెంచ్ నవంబర్ 10కి వాయిదా వేసింది. అయితే చంద్రబాబు పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఆయన కుడి కంటికి శస్త్ర చికిత్స చేయాల్సి ఉందని దీనితో తాత్కాలిక బెయిల్ ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాదులు ఏపీ హైకోర్టును అభ్యర్ధించారు. దీనిపై విచారణ చేపట్టిన ఏకసభ్య ధర్మాసనం ఎట్టకేలకు బాబుకు ఉపశమనం ఇచ్చింది. నవంబర్ 28 న కోర్టులో లొంగి పోవాలని, లక్ష రూపాయలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని, ఆయనకు నచ్చిన చోట వైద్య సౌకర్యం పొందవచ్చని… రాజకీయ, ఎన్నికల కార్యకలాపాల్లో పాల్గొనకూడదని, నేతలను కలవకూడదని షరతులు విధించారు.
బాబు 53 రోజులుగా రాజమండ్రి జైలులో ఖైదీగా ఉన్నారు. ఈ సాయంత్రం ఆయన జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.