Sunday, January 19, 2025
HomeTrending Newsబ్రహ్మంగారి మఠంపై వివాదం వద్దు : మంత్రి వెల్లంపల్లి

బ్రహ్మంగారి మఠంపై వివాదం వద్దు : మంత్రి వెల్లంపల్లి

ఎంతో చరిత్ర ఉన్న బ్రహంగారి మఠాన్ని వివాదాల్లోకి లాగవద్దని, అందరూ సంయమనం పాటించాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ హితవు పలికారు. ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలని, మఠం పవిత్రతను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.

మఠాధిపతి విషయంలో మెజార్టీ ప్రజల అభిప్రాయం ప్రకారం ముందుకు వెళతామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రకటించారు. దేవాదాయ చట్టం, సంప్రదాయాలు ఈ రెంటినీ క్రోడీకరించి ఆ తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ౩౦ రోజుల ముందు నోటీసు ఇచ్చి ఆ మఠానికి చెందిన వ్యక్తులు, భక్తులతో సమావేశం నిర్వహిస్తామని, సమావేశంలో వచ్చే అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించారు. ఈలోగా మఠం నిర్వహణకు కడప జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ను ఫిట్ పర్సన్ గా నియమిస్తున్నట్లు చెప్పారు. వీలునామా ఇంకా తమకు అందలేదని, అందుకే ఎండోమెంట్ యాక్ట్ 54-2 ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.

చట్టబద్ధంగా, సంప్రదాయాల ప్రకారం మఠాధిపతి ఎంపిక జరిగేలా చర్యలు తీసుకుంటామని దీనికోసం తమ శాఖ సీనియర్ అధికారిని పంపి అన్ని విషయాలపై సమగ్ర విచారణ జరిపిస్తామని, మరోవైపు పీఠాదిపతులు ఇచ్చే సలహాలను కూడా పరిగణన లోకి తీసుకుంటామని వెల్లంపల్లి వివరించారు. శారదా పీఠం స్వరూపానందేంద్ర స్వామీ వారు ఈ విషయంలో తగిన సూచనలు చేశారని, విశ్వ భ్రాహ్మణ సంఘాలు విజ్ఞాపన పత్రాలు అందజేశారని, శివ స్వామివారు ఈ విషయమై తన నివేదికను ఇచ్చారని మంత్రి చెప్పారు.

గతంలో ఉన్న మఠాధిపతి ఒక ఉత్తరాధికారిని నియమించి ఉంటే బాగుండేదని అలా జరగలేదు కాబట్టి కుటుంబ సభ్యులు, అధికారులు కలిసి ఓ ఏకాభిప్రాయానికి రావాలని మంత్రి సూచించారు. ప్రస్తుతం కుటుంబ సభ్యుల మధ్యే విబేధాలు వచ్చాయి కాబట్టి సమస్య వచ్చిందని, త్వరలోనే ఇది పరిష్కారం అవుతుందని విశ్వసిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్