పోలవరం ప్రాజెక్టుపై సిఎం జగన్ చిత్తశుద్దితో ఉన్నారని, కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వకున్నా రాష్ట్రం నుంచి ఖర్చు చేసి ప్రాజెక్టు పనులు కొనసాగిస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. ప్రాజెక్టు నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా నిర్మాణం సాగేలా చర్యలు తీసుకుంటున్నామని, నిర్వాసితుల సమస్యలపై కూడా జగన్ ప్రత్యేక దృష్టి సారించారని, అందుకే దీనికోసం ప్రత్యేకంగా ఓ ఐఏఎస్ అధికారిని నియమించారని కన్నబాబు చెప్పారు. నిర్వాసితులకు 10లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారని వెల్లడించారు. పోలవరం నిర్వాసితులతో లోకేష్ సమావేశాన్ని కన్నబాబు ఎద్దేవా చేశారు. చంద్రబాబు, లోకేష్ లు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని వ్యాఖ్యానించారు.
దశాబ్దాలుగా మూలపడిన పోలవరం ప్రాజెక్టును మళ్ళీ వెలుగులోకి తీసుకు వచ్చింది దివంగత నేత వైఎస్ అని, ఆ ప్రాజెక్టును పూర్తి చేసేది వైఎస్ తనయుడు, సిఎం జగన్ మాత్రమేనని కన్నబాబు ధీమాగా చెప్పారు. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మూడేళ్ళ వరకూ పోలవరం ప్రాజెక్టు ఊసే ఎత్తలేదని, 2017లో కేంద్ర ప్రభుత్వంతో లాలూచీ పడి, కమీషన్ల కక్కుర్తి కోసం ప్రాజెక్టు నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించేలా ఒప్పందం చేసుకున్నారని కన్నబాబు విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు ఉన్నంతకాలం వైఎస్ పేరు చరిత్రలో నిలిచిపోతుందని కన్నబాబు అభివర్ణించారు.