Sunday, January 19, 2025
Homeసినిమా'పుష్ప'లో హైలైట్స్...

‘పుష్ప’లో హైలైట్స్…

Pushpa: FIR
అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప‘ సినిమా రూపొందింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకి, భారీ తారాగణమే ప్రధానమైన ఆకర్షణ. రష్మిక కథానాయికగా నటించిన ఈ సినిమా ఈ రోజునే థియేటర్స్ కి వచ్చింది. ఈ సినిమా టాక్ ఎలా ఉందనే విషయాన్ని అలా ఉంచితే, కొన్ని అంశాలు మాత్రం ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాయని అంటున్నారు. బన్నీ .. సుకుమార్ .. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాను ఒక రేంఙ్ కి తీసుకుని వెళ్లారనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మిగతా మార్కులు యాక్షన్ .. డాన్స్ కొరియోగ్రఫర్లకీ, సినిమాటోగ్రఫర్ కి పంచవచ్చని అంటున్నారు.

ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లిన దగ్గర నుంచి థియేటర్స్ కి వచ్చేవరకూ అందరిలో ఆసక్తిని పెంచడంలో సుకుమార్ సక్సెస్ అయ్యాడు. పాత్ర స్వభావాన్ని బట్టి ప్రతి పాత్రకి ఒక ప్రత్యేకమైన లుక్ ను సెట్ చేస్తూ, సునీల్ .. అనసూయ వంటి ఆర్టిస్టులను రొటీన్ కి భిన్నంగా చూపిస్తూ అందరిలో కుతూహలాన్ని పెంచగలిగాడు. ఒక ముఠానాయకుడిగా హీరో అంచలంచెలుగా ఎదిగిన తీరును చూపించిన విధానం బాగుందని అంటున్నారు. సుకుమార్ కథాకథనాలను నడిపించిన తీరు .. పాత్రలను డిజైన్ చేసిన పద్ధతి గురించి విశేషంగా చెప్పుకుంటున్నారు. కొన్ని సీన్లు మాత్రం రొటీన్ గానే అనిపిస్తున్నాయని అనేవారు లేకపోలేదు.

బన్నీ తన ప్రతి సినిమాకి లుక్ మార్చుకుంటూ వెళుతున్నాడు. అయితే ఈ సారి ఆయన లుక్ కాస్త హెవీగానే మారిపోయింది. అంతేకాదు ఏ డాన్సులైతే బన్నీకి బాగా పేరు తెచ్చాయో, ఆ డాన్సులు అవలీలగా చేసే అవకాశం లేని బాడీ లాంగ్వేజ్ కి ఆయన కట్టుబడి పోవలసి వచ్చింది. అయినా ఆ పాత్రలో ఆయన ఇమిడిపోయాడనీ, యాక్షన్ సీన్స్ లో చెలరేగిపోయాడని అంటున్నారు. ఇక దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తోందని చెబుతున్నారు. ఏ పాటకి ఆ పాట సందర్భాన్ని కావాలని కల్పించుకున్నట్టుగా కాకుండా, కథలో నుంచి పుట్టినట్టుగానే ఉన్నాయనే టాక్ తెచ్చుకున్నాయి. ఈ సినిమా విజయంలో దేవిశ్రీ పాటలు కీలకమైన పాత్రను పోషించాయని బలంగా చెబుతున్నారు. ముఖ్యంగా సమంత ఐటమ్ సాంగ్ ఒక ఊపు ఊపేస్తోందని అంటున్నారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఆ అంచనాలను ఎంతవరకూ అందుకుంటుందో చూడాలి మరి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్