Saturday, January 18, 2025
HomeTrending NewsTAIKA Martial Arts: కర్తవ్య సాధనలో ఎంతో మందికి స్పూర్తి..అశోక్ చక్రవర్తి

TAIKA Martial Arts: కర్తవ్య సాధనలో ఎంతో మందికి స్పూర్తి..అశోక్ చక్రవర్తి

ఉద్దేశం మంచిదైతే.. ఊరంతా వెంటే నిలబడుతుందంటారు. ఆశయం బలంగా ఉంటే.. అందరి తోడూ లభిస్తుందని చెబుతారు. కర్తవ్య సాధనతో కాలు కదిపితే.. అందరి అడుగులు కలిసే పడతాయి. ఆలోచన గట్టిదైతే.. అనుకోని ఆశీస్సులూ లభిస్తాయి. వీటన్నింటికీ చదువు, సంస్కారం, పరిణతి కలగలిస్తే.. విజయ పీఠాన్ని అందుకోవడం సులువవుతుందనడానికి చక్కటి ఉదాహరణ అశోక చక్రవర్తి. అసాధ్యం అనే పదం ఆయన డిక్షనరీలో లేదు. లక్ష్యానికి గురి పెడితే సాధించలేమన్నది లేదు. ఎవరూ ఎవరికీ తీసిపోరు అన్నది అతను బలంగా నమ్ముతాడు. గుండె నిబ్బరంతో ఆయనేసిన ముందడుగే.. ఇప్పుడు ఎంతో మందికి స్పూర్తిని కలిగిస్తోంది. పట్టుదల పెంచుతోంది. రంగం ఏదైతేనేం.. అనుభవం ముఖ్యం అంటాడు అశోక్‌ చక్రవర్తి. మనసు పెడితే ఏదైనా నేర్చుకోవచ్చు. ఏదైనా సాధించవచ్చు. అందుకే ఇప్పుడు అన్ని రంగాలలో పురుషులకు ధీటుగా మహిళా శక్తి చైతన్యవంతమవుతోంది. చదువుల్లోనే కాదు.. మార్షల్‌ ఆర్ట్స్‌లో కూడా తమకు సాటి ఎవరూ లేరని నిరూపించుకుంటున్నారు. పరిస్ధితులు కూడా అందుకు ప్రేరేపిస్తున్నాయి అనడానికి అశోక్ చక్రవర్తి నిర్వహిస్తున్న టైక మార్షల్‌ ఆర్ట్సే నిదర్శనం.

హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో టైక మార్షల్‌ ఆర్ట్స్‌ సంస్ధ ద్వారా ఎంతో మందికి తర్ఫీదు ఇచ్చారు. వారిలో మానసిక స్ధైర్యాన్ని.. ధైర్యాన్ని నింపారు. ఆయన చేస్తున్న సేవకు గుర్తింపుగా ఇటీవల న్యూఢిల్లీలోని త్యాగరాజ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో జాతీయ స్ధాయి పురస్కారం లభించింది. సీఎంఏ స్పోర్ట్స్‌ ఫౌండేషన్‌ నిర్వహించిన ఈ కార్యక్రమంలో అశోక్‌చక్రవర్తికి నేషనల్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డు అందజేశారు. ప్రస్తుతం ఆయన మార్షల్‌ ఆర్ట్స్‌ జాతీయ రిఫరీగా వ్యవహరిస్తున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మార్షల్‌ ఆర్ట్స్‌ కోసం విశేష కృషి చేస్తున్న కొద్ది మందిని ఎంపిక చేసి ప్రతి సంవత్సరం పురస్కారాలను అందజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది అశోక్‌ చక్రవర్తిని జాతీయ అవార్డు వరించింది.

కాలం కలిసొస్తే.. అదృష్టం వరిస్తే.. ఇంకేదో చేయాలన్న తపన. ఆ కాంక్షే అశోక్‌ చక్రవర్తిని మార్షల్‌ ఆర్ట్స్‌లో పరిణతి సాధించేలా చేసింది. కాళ్ళు తడవకుండా సముద్రం దాటచ్చేమో కానీ.. కళ్ళు తడవకుండా.. కన్నీరు లేకుండా జీవనం సాగించని వారు ఉండరు. అలాగే అతని జీవితం కూడా ఎన్నో ఎత్తుపల్లాలను చూసింది. తాను స్ధాపించిన టైకో మార్షల్‌ ఆర్ట్స్‌ సంస్ధను ఉన్నత పధానికి తీసుకు వెళ్ళడానికి ఎంతో కష్ట పడ్డాడు. మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్వడం వల్ల వచ్చే లాభాలను వివరించి ఎంతో మందిని ఆకర్షించాడు. తమను తాము ఎలా రక్షించుకోవాలో వివరించి వారిలో ధైర్యాన్ని నింపాడు. ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను వారంతటా వారే ఎదుర్కోవాలంటే మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్వాల్సిందే అంటున్న అశోక్‌ చక్రవర్తి మరెన్నో విజయాలు సాధించాలని ఆశిద్దాం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్